IND Vs BAN: శుబ్‌మన్ గిల్‌ సూపర్‌ సెంచరీ.. బంగ్లాపై భారత్‌ ఘన విజయం | CT 2025 IND Vs BAN: Shubman Gill Hundred Powers India 6-wicket Victory Against Bangladesh, See More Details | Sakshi
Sakshi News home page

IND vs BAN: శుబ్‌మన్ గిల్‌ సూపర్‌ సెంచరీ.. బంగ్లాపై భారత్‌ ఘన విజయం

Published Thu, Feb 20 2025 10:12 PM | Last Updated on Fri, Feb 21 2025 9:16 AM

Shubman Gill hundred Power India 6-wicket victory against bangladesh

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 229 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో చేధించింది. భారత యువ ఓపెనర్‌, వైస్ ‍కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను గిల్ ఫినిష్ చేశాడు.

తొలుత దూకుడుగా ఆడిన గిల్‌.. వరుసగా వికెట్ల పడడంతో కాస్త ఆచితూచి ఆడాడు. ఎప్పుడైతే లక్ష్యానికి జట్టు చేరువైందో గిల్‌​ తన బ్యాటింగ్‌లో జోరును పెంచాడు. ఈ క్రమంలో 125 బంతుల్లో గిల్ తన ఎనిమిదవ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 129 బంతులు ఎదుర్కొన్న గిల్‌..9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(41), కేఎల్‌ రాహుల్‌(41) రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్‌ రెహ్మన్‌, టాస్కిన్‌ ఆహ్మద్‌ తలా వికెట్‌​ సాధించారు.

హృదయ్‌ సూపర్‌ సెంచరీ..
ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్‌ హ్రిదయ్‌(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) సూపర్‌ సెంచరీతో కదం తొక్కగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో దుబాయ్‌ వేదికగా తలపడనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement