శుబ్‌మన్‌ గిల్‌కు ప్రమోషన్‌.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!? | Shubman Gill to be promoted to A+ category in BCCI central contracts list: Reports | Sakshi
Sakshi News home page

BCCI: శుబ్‌మన్‌ గిల్‌కు ప్రమోషన్‌.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!?

Published Sat, Mar 8 2025 9:24 AM | Last Updated on Sat, Mar 8 2025 10:26 AM

Shubman Gill to be promoted to A+ category in BCCI central contracts list: Reports

భార‌త క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్ర‌క‌టించేందుకు సిద్ద‌మైంది. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత ఈ లిస్ట్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం.

అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశీవాళీ క్రికెట్‌లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో బీసీసీఐ అయ్యర్‌పై వేటు వేసింది. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని రంజీల్లో ఆడిన శ్రేయస్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.

జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్‌.. తన అద్బుతప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ శ్రేయస్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి తిరిగి మళ్లీ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.

గిల్‌కు ప్రమోషన్‌.. కోహ్లి, రోహిత్‌కు డిమోషన్‌
మరోవైపు అద్బుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌(Shubman Gill)కు సైతం ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గిల్ ప్రస్తుతం బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఏ కేటగిరిలో ఉన్నాడు.  ఇప్పుడు అతడిని టాప్ గ్రేడ్‌(ఏ ప్లస్‌)కు ప్రమోట్ చేయాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించుకున్నారంట. 

కాగా ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా‌లు మాత్రమే ఉన్నారు. అయితే అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికిన కోహ్లి, రోహిత్ శర్మ, జడేజా కాంట్రాక్‌లు మారనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సీనియర్ త్రయాన్ని ఏ ప్లస్ నుంచి ఏ గ్రేడ్‌కు డిమోట్ చేసే అవకాశముంది. వీరిస్ధానాల్లో గిల్‌తో పాటు వికెట్ ​కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఏ ప్లస్ కేటగిరిలో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి.

కేటగిరి వారీగా ఆటగాళ్లకు ద‌క్కే మొత్తం ఎంతంటే?
ఏ ప్లస్‌ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.

కివీస్‌తో ఫైనల్‌ పోరు..
ఇక ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్‌​ వేదికగా జరగనున్న ఫైనల్‌ పోరులో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి మూడోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు కివీస్‌ కూడా భారత్‌ను ఓడించి రెండోసారి ఈ మెగా టోర్నీ టైటిల్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.
చదవండి: CT 2025: భార‌త్-న్యూజిలాండ్ ఫైన‌ల్ పోరు.. బ్యాట‌ర్ల‌కు చుక్క‌లే! ఎందుకంటే?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement