
న్యూజిలాండ్(India vs New Zealand)తో వన్డే నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడీ మారవచ్చని.. అదే విధంగా.. కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు జట్టులో దక్కవచ్చని అంచనా వేశాడు. అయితే, తాను మాత్రం ఇలాంటి మార్పులు వద్దనే సూచిస్తానని పేర్కొన్నాడు.
సెమీస్‌లో భారత్, కివీస్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఈ క్రమంలో లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌ను ఓడించిన రోహిత్ సేన.. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కూడా జయభేరి మోగించింది. మరోవైపు.. న్యూజిలాండ్ కూడా ఈ రెండు జట్లపై గెలిచి భారత్‌తో పాటు సెమీస్ చేరింది.
రోహిత్ శర్మ దూరం?
ఈ క్రమంలో లీగ్ దశలో చివరగా నామమాత్రపు మ్యాచ్‌లో భారత్- కివీస్ ఆదివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరుజట్లకు సెమీస్‌కు సన్నాహకంగా మారనుంది. ఇందులో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని భారత్- న్యూజిలాండ్ పట్టుదలగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్ సందర్భంగా పిక్కల్లో నొప్పితో బాధపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం.
అదే విధంగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా మార్పులు చేయబోతోందా? రోహిత్ శర్మ ఇందులో ఆడకపోవచ్చు. మహ్మద్ షమీ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.
రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్‌లకు అవకాశం
కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా రాబోతున్నాడు. రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఈసారి తుదిజట్టులో చోటు దక్కుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇలా జరగొచ్చు. లేదంటే జరగకపోవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం భారత్ గత రెండు మ్యాచ్‌లలో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లాలి.
గెలుపు మనకు ఓ అలవాటుగా మారినప్పుడు.. అదే జట్టును కొనసాగిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి. చాంపియన్స్ ట్రోఫీలో జడ్డూ గత మ్యాచ్‌లలో పెద్దగా వికెట్లు తీయలేదు. అయినా సరే అతడిని కొనసాగించాల్సిందే. జడ్డూను కాదని వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చే ఆలోచన కూడా యాజమాన్యానికి ఉండి ఉండవచ్చు.
జడ్డూనే ఆడించాలి
లేదా.. కివీస్ జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఎక్కువ కాబట్టి వాషింగ్టన్ సుందర్‌ను ఆడించే యోచనలో ఉండొచ్చు. కానీ జడ్డూనే ఆడించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే.. అతడు తదుపరి సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో విశ్రాంతి పేరిట పక్కనపెట్టకూడదు’’ అని అభిప్రాయపడ్డాడు.
ఒకవేళ తుదిజట్టులో మార్పు చేయాలని భావిస్తే షమీని తప్పించి అర్ష్‌దీప్‌ను ఆడిస్తే ప్రయోజనకరంగానే ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తొమ్మిది ఓవర్ల కోటా వేసిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 37 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.
ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం ఏడు ఓవర్లలోనే 40 రన్స్ ఇచ్చిన జడ్డూ ఒక వికెట్ తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో కేఎల్ రాహుల్‌తో కలిసి వికెట్ కీపర్ కోటాలో అవకాశం దక్కించుకున్న రిషభ్ పంత్‌కు మాత్రం తుదిజట్టులో ఆడే ఛాన్స్ రావడం లేదు. అయితే, కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరంగా ఉంటే మాత్రం.. రాహుల్ ఓపెనర్‌గా వస్తే.. పంత్‌కు చోటు దక్కవచ్చు.
బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లలో ఆడిన భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
బెంచ్: రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్
Comments
Please login to add a commentAdd a comment