
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ఫైనల్‌లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాతికేళ్ల తర్వాత మరోసారి ఈ రెండు జట్లు ఈ మెగా వన్డే టోర్నీ టైటిల్ పోరులో తలపడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నాడు కివీస్ టీమిండియాపై పైచేయి సాధించి ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలవగా.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈసారి ఫైనల్ మామూలుగా ఉండబోదని ఇరుజట్ల అభిమానులు ఈ రసవత్తర పోరు కోసం ఎదురుచూస్తున్నారు. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- కివీస్ తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే
టైటిల్ సమరంలో టీమిండియా తరఫున మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అవుతాడని అంచనా వేసిన ఈ మాజీ ఓపెనర్.. శుబ్‌మన్ గిల్ కూడా కీలకం కాబోతున్నాడని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈసారి కివీస్ బౌలర్లు ప్రధానంగా శ్రేయస్ అయ్యర్‌నే టార్గెట్ చేస్తారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌పై వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్కసారి మాత్రమే 30 కంటే తక్కువ పరుగులు చేశాడనుకుంటా. అదొక్కటి మినహా ప్రతిసారీ అతడు కివీస్‌పై బాగానే రన్స్ రాబట్టాడు. కాబట్టి ఈసారి అతడినే ఎక్కువగా టార్గెట్ చేస్తారనిపిస్తోంది.
మిడిల్ ఓవర్లలో వాళ్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. మిచెల్ సాంట్నర్, బ్రాస్‌వెల్ లేదంటే రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్.. ఈ నలుగురే ఎక్కువగా బరిలోకి దిగవచ్చు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు కదా!
అందుకే అతడిని త్వరగా పెవిలియన్‌కు పంపేందుకు ఈ స్పిన్ బౌలర్లు ప్రయత్నిస్తారు. అతడిపైనే దృష్టి పెడతారు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
కివీస్‌తో ఆటంటే శ్రేయస్‌కు మజా
కాగా న్యూజిలాండ్‌తో వన్డేల్లో ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్.. సగటున 70.38తో 563 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక కివీస్‌పై శ్రేయస్ అత్యల్ప స్కోరు 33. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.
ఇక ఓపెనింగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘బంగ్లాదేశ్‌పై సెంచరీ చేయడం ద్వారా ఈ ఐసీసీ టోర్నీలో గిల్ బిగ్‌బ్యాంగ్‌తో ముందుకు వచ్చాడు. పాకిస్తాన్‌పై కూడా మెరుగ్గా ఆడాడు. అయితే, ఆ తర్వాత అతడు కాస్త వెనుకబడ్డాడు.
ఫైనల్లో బ్యాట్ ఝులిపిస్తేనే జట్టుకు, అతడికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరో విరాట్ కావాలంటే గిల్ ఫైనల్లో తన ముద్రను వేయాలి. శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ గనుక రాణిస్తే చాంపియన్స్ ట్రోఫీ మనదే అని రాసిపెట్టుకోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
డబుల్ సెంచరీ వీరుడు
కాగా కివీస్‌పై గిల్‌కు కూడా గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు కివీస్‌పై పదకొండు ఇన్నింగ్స్‌లో అతడు 592 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. హైదరాబాద్‌లో 2023లో డబుల్ సెంచరీ(208) కూడా కివీస్‌పైనే సాధించాడు.
చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం?
Comments
Please login to add a commentAdd a comment