
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) టెస్టుల్లో పునరాగమనంపై దృష్టి సారించాడు. దేశవాళీ టోర్నమెంట్లలో తాను అద్భుతంగా రాణించానని.. అందుకే తాను తిరిగి జాతీయ జట్టుకు ఆడతాననే ధీమా వ్యక్తం చేశాడు.
కాగా వన్డే ప్రపంచకప్-2023 తర్వాత క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంతో బీసీసీఐ(BCCI) శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలను గాయం సాకు చూపి తప్పించుకున్నాడని భావించిన బోర్డు.. అయ్యర్ వార్షిక కాంట్రాక్టును రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో ముంబై తరఫున దేశీ బరిలో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.
ఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్.. ఈ వన్డే టోర్నీలో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 243 పరుగులు సాధించాడు.
తద్వారా ఈ మెగా ఈవెంట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో న్యూజిలాండ్ స్టార్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రచిన్ రవీంద్ర(263) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.
ఇదిలా ఉంటే.. వన్డేల్లో తానేంటో మరోసారి నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీమిండియా టెస్టు రీఎంట్రీకి తాను సిద్ధమనే సంకేతాలు ఇచ్చాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో పునరాగమనం చేయాలని ఉంది. వీలైనంత ఎక్కువగా క్రికెట్ ఆడాలని భావిస్తున్నా.
నేను ఉత్తమంగా రాణించాను
దేశవాళీ టోర్నమెంట్లో నేను ఉత్తమంగా రాణించాను. అయితే, నా చేతుల్లో ఏమీ లేదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. కానీ ఈ విషయం గురించి పదే పదే ఆలోచించను. దాని వల్ల అనసవరంగా నా మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది.
అనుకున్నది జరుగకపోతే మానసికంగానూ కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తా. విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటా. సమయం వచ్చినపుడు అవకాశం అదే తలుపుతడుతుంది. ముందుగా చెప్పినట్లు నేను భవిష్యత్తు, గతం గురించి ఎక్కువగా ఆలోచించే మనిషిని కాను. ప్రస్తుతం నేను ఇలా ఉండటానికి కారణం అదే’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
కాగా చివరిసారిగా అయ్యర్ గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా టీమిండియా తరఫున 14 టెస్టులు ఆడిన ఈ ముంబైకర్ 811 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి!?
ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఇక తాజా రంజీ ట్రోఫీ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్.. ఆడిన ఐదు మ్యాచ్‌లలోనే ఏకంగా 480 పరుగులు సాధించాడు. ఇక టీమిండియా జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా స్టోక్స్ బృందంతో టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ నాటికి అయ్యర్ పునరాగమనం చేసే అవకాశాలు లేకపోలేదు.
చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment