
టెస్టు ఫార్మాట్ తనకు సరిపడదని టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) అన్నాడు. టీ20, వన్డేల్లో కొనసాగితే చాలని.. అందులోనే తనకు సంతృప్తి దొరుకుతుందని పేర్కొన్నాడు. కాగా 2021లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ కర్ణాటక బౌలర్ చాలాకాలం పాటు జట్టుకు దూరంగానే ఉన్నాడు.
రీ ఎంట్రీలో అదుర్స్
అయితే, ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న వరుణ్ చక్రవర్తి జాతీయ జట్టులో పునరాగమనం చేయడానికి ప్రధాన కారణం హెడ్‌కోచ్ గౌతం గంభీర్. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా పనిచేసిన గౌతీ.. ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వరుణ్ నైపుణ్యాలను దగ్గరగా గమనించాడు. ఈ క్రమంలో వరుణ్ టీమిండియా రీఎంట్రీకి మార్గం సుగమమైందని చెప్పవచ్చు.
గతేడాది స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అదరగొట్టిన వరుణ్.. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటాడు. అనంతరం సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్.. వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.
చాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తా చాటి
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన వరుణ్.. అనూహ్య రీతిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టుకు ఎంపికయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌లలో తుదిజట్టులో స్థానం దక్కనప్పటికీ.. లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆడిన 33 ఏళ్ల ఈ స్పిన్ బౌలర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు.
అంతేకాదు.. ఆస్ట్రేలియాతో సెమీస్‌లో టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించడంలోనూ తన వంతు సాయం చేశాడు. కేవలం మూడు మ్యాచ్‌లలోనే తొమ్మిది వికెట్లు తీసి చాంపియన్స్ ట్రోఫీ-2025 అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
టెస్టుల్లో ఆడటం నాకూ ఇష్టమే.. కానీ
ఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టెస్టుల్లోనూ అతడిని ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వరుణ్ స్వయంగా తనకు టెస్టు ఫార్మాట్ సరిపడదని చెప్పడం విశేషం. ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో ఆడటం నాకూ ఇష్టమే. కానీ నా బౌలింగ్ శైలి అందుకు సరిపడదు.
నా బౌలింగ్ స్టైల్ ఇంచుమించు మీడియం పేస్‌లాగే ఉంటుంది. ఇక టెస్టు క్రికెట్‌లో వరుస విరామాల్లో 20- 30 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. నాకు అది సాధ్యం కాదు. నేను కాస్త ఫాస్ట్‌గా బౌల్ చేస్తాను కాబట్టి.. 10- 15 ఓవర్ల వరకే నాకు సౌకర్యంగా ఉంటుంది. అదేమో రెడ్ బాల్ క్రికెట్‌కు సరిపడదు.
అందుకే నేను ప్రస్తుతం 20, 50 ఓవర్ల క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టాను. వైట్‌బాల్ క్రికెట్‌కే పరిమితం కావాలని భావిస్తున్నాను’’ అని వరుణ్ చక్రవర్తి తన మనసులోని మాటను వెల్లడించాడు.
అక్కడన్నీ స్పిన్‌కు అనుకూలమైన వికెట్లు
ఇక ఆరంభంలో పేసర్‌గా ఉన్న తమిళనాడు బౌలర్ వరుణ్.. తర్వాత స్పిన్నర్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పశ్చాత్తాపం ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నిజమే.. తొలిరోజుల్లో నేను మీడియం పేస్‌తో బౌలింగ్ చేశా. అక్కడ చాలా మంది పేసర్లు ఉండేవారు.
అయితే, తమిళనాడు వికెట్లపై బంతి స్వింగ్ కాదు. అక్కడన్నీ స్పిన్‌కు అనుకూలమైన వికెట్లు. అందుకే మీరు తమిళనాడు నుంచి ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లను చూడలేరు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో జూన్‌లో మొదలయ్యే టెస్టు సిరీస్‌లో వరుణ్ చక్రవర్తిని ఆడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. అతడు తనంతట తానుగా పోటీ నుంచి తప్పుకోవడం గమనార్హం.
చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్?
Comments
Please login to add a commentAdd a comment