టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఇప్పట్లో మైదానంలో దిగే పరిస్థితి కనిపించడం లేదు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నాటికి కూడా అతడు అందుబాటులోకి వస్తాడా? లేదా అన్న విషయంపై కూడా సందిగ్దం నెలకొంది.
కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అంతా తానై పేస్ దళ బాధ్యతలు మోసిన బుమ్రా.. ఆఖరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా వెన్నునొప్పి(Back Spasm)తో బాధపడ్డాడు. మ్యాచ్ మధ్యలోనే ఆస్పత్రికి వెళ్లిన బుమ్రా.. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ జట్టుతో చేరాడు.
కానీ.. బౌలింగ్ మాత్రం చేయలేకపోయాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు అతడు దూరమయ్యాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడికి ఫిట్‌నెస్ ఆధారంగా చోటు కల్పించింది.
స్పందించిన రోహిత్ శర్మ
కానీ ఇప్పటికీ బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకోలేదని వార్తలు వస్తుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంపై స్పందించాడు. ఇంగ్లండ్‌తో గురువారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బుమ్రా స్కానింగ్ రిపోర్టుల కోసం మేము ఎదురుచూస్తున్నాం.
మరికొన్ని రోజుల్లో వైద్య బృందం వద్దకు నివేదిక వస్తుంది. ఆ తర్వాతే బుమ్రా ఫిట్‌గా ఉన్నాడా? లేదా అన్న అంశంపై స్పష్టత వస్తుంది. ఒకవేళ అతడు ఫిట్‌నెస్ సాధిస్తే ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేకు అందుబాటులోకి వస్తాడు’’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
వరుణ్ పోటీలో ఉంటాడు
అదే విధంగా.. తొలిసారిగా వన్డే జట్టుకు ఎంపికైన వరుణ్ చక్రవర్తి గురించి కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు.
‘‘టీ20 సిరీస్‌లో అతడు తన బౌలింగ్‌లో వైవిధ్యాన్ని చూపించాడు. పొట్టి ఫార్మాట్‌కు వన్డేలకు తేడా ఉంటుందని తెలుసు. అయితే, తాను ఏం చేయగలనో వరుణ్ నిరూపించాడు. అందుకే అతడిని కూడా మా ఆప్షన్లలో చేర్చుకున్నాం.
ఈ సిరీస్ ద్వారా అతడి బౌలింగ్ సామర్థ్యాలు, నైపుణ్యాలను క్షుణ్ణంగా గమనించే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాం. అతడిని తుదిజట్టులోకి తీసుకుంటామా? లేదా అన్నది ఇప్పుడే చెప్పలేను. అయితే, కచ్చితంగా అతడు మాత్రం పోటీలో ఉంటాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
కాగా ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి పద్నాలుగు వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో వన్డే జట్టులోనూ అతడిని చేర్చారు.
ఇదిలా ఉంటే.. 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తి ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 18 టీ20 మ్యాచ్‌లు ఆడి.. మొత్తంగా 33 వికెట్లు తీశాడు. ఇక.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులకు ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది.
కాబట్టి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తర్వాత వరుణ్ ఈ మెగా టోర్నీకి ఎంపికవుతాడా? లేదా అన్న విషయం తేలుతుంది. ప్రస్తుతానికి అతడు ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో ఉన్నాడు.
చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment