గిల్‌ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే.. | Gill Warned By Umpire Despite Head Clean Catch Reason Is This If Umpire Uses His | Sakshi
Sakshi News home page

శుబ్‌మన్‌ గిల్‌ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే..

Published Wed, Mar 5 2025 1:44 PM | Last Updated on Wed, Mar 5 2025 3:06 PM

Gill Warned By Umpire Despite Head Clean Catch Reason Is This If Umpire Uses His

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత జట్టు అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా(India vs Australia)తో మంగళవారం నాటి సెమీస్‌లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్లలో అత్యధిక మంది టీమిండియాకు చేసిన ప్రధాన సూచన.. ఆసీస్‌ విధ్వంసకర వీరుడు ట్రవిస్‌ హెడ్‌ను వీలైనంత త్వరగా అవుట్‌ చేయాలనే!!...

ఎందుకంటే.. రోహిత్‌ సేన సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023(ODI World Cup) గెలవకుండా అడ్డుపడి.. ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత అతడి సొంతం. అందుకే ‘తలనొప్పి’ తెచ్చిపెట్టే ఈ బ్యాటర్‌పైనే ముందుగా దృష్టి సారించాలని సంజయ్‌ మంజ్రేకర్‌, హర్భజన్‌ సింగ్‌, దినేశ్‌ కార్తిక్‌ తదితరులు భారత బౌలర్లకు సూచించారు. అందుకు తగ్గట్లుగానే మంగళవారం హెడ్‌ను టీమిండియా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపించింది.

టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి హెడ్‌ అవుటయ్యాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు.

 ‘అతి’ ఆనందం
అయితే, హెడ్‌ ఇచ్చిన క్యాచ్‌ పట్టిన తర్వాత గిల్‌ చేసిన తప్పిదం టీమిండియా కొంపముంచేది. హెడ్‌ క్యాచ్‌ పట్టినప్పుడు శుబ్‌మన్‌ గిల్‌ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్‌ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్‌ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా గిల్‌ బంతిని గాల్లోకి విసిరేశాడు.

నిజానికి క్యాచ్‌ పట్టడంలో అతడు ఎక్కడా తడబడలేదు. అయితే బాల్‌ను ఎంతసేపు చేతిలో ఉంచుకోవాలనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్‌ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి.

క్లీన్‌’గా ఉన్నా.. వార్నింగ్‌ ఎందుకు?
ఇదే విషయాన్ని అంపైర్‌ ఇల్లింగ్‌వర్త్‌ ప్రత్యేకంగా గిల్‌కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్‌/నాటౌట్‌ ఇచ్చే విషయంలో అంపైర్‌కు విచక్షణాధికారం ఉంటుంది. ఒకవేళ ఇల్లింగ్‌వర్త్‌ గనుక గిల్‌ వెనువెంటనే బంతిని విసిరేయడాన్ని సీరియస్‌గా తీసుకుని నాటౌట్‌ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఒక్కసారి లైఫ్‌ లభిస్తే హెడ్‌ను ఆపటం అంత తేలికేమీ కాదు. అందుకే గిల్‌ చర్య విమర్శలకు దారి తీసింది.

ఇదిలా ఉంటే.. ఓపెనర్‌ హెడ్‌ అవుటైన తర్వాత కెప్టెన్‌ , వన్‌డౌన్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. మార్నస్‌ లబుషేన్‌(29) మరో ఎండ్‌ నుంచి సహకారం అందించగా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

నిజానికి అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్‌ డ్రైవ్‌ చేయగా బంతి అతడి ప్యాడ్‌ల మీదుగా స్టంప్స్‌ను తాకింది. అయితే బెయిల్స్‌ పడకపోవడంతో స్మిత్‌ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్‌ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్‌ అలా కూడా చేయలేదు. 

ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్‌లో బలంగా షాట్‌ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్‌ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్‌. ఏదేమైనా స్మిత్‌ 73 పరుగుల చేసి షమీ బౌలింగ్‌లో బౌల్డ్‌ కాగా.. అలెక్స్‌ క్యారీ అర్ధ శతకం(61) కారణంగా ఆసీస్‌ 264 పరుగులు చేయగలిగింది.

వరల్డ్‌ చాంపియన్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి
అయితే, లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత తడబడ్డప్పటికీ విరాట్‌ కోహ్లి(98 బంతుల్లో 84) అద్భుతం చేశాడు. అతడికి తోడుగా శ్రేయస్‌ అయ్యర్‌(45), వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌(34 బంతుల్లో 42) రాణించారు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో రాహుల్‌ కొట్టిన సిక్సర్‌తో టీమిండియా విజయం ఖరారైంది. ఫలితంగా వరల్డ్‌ చాంపియన్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రోహిత్‌ సేన ఫైనల్‌కూ దూసుకెళ్లింది.

చదవండి: #Steve Smith: భార‌త్ చేతిలో ఓట‌మి.. స్టీవ్ స్మిత్ సంచ‌ల‌న నిర్ణ‌యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement