
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సతీమణి సంజనా గణేషన్ (Sanjana Ganesan) నెటిజన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోదం కోసం తమ చిన్నారి కుమారుడి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. తమకేమీ ప్రచార పిచ్చి లేదని.. ఇకనైనా పిచ్చి వాగుడు కట్టిపెట్టాలంటూ చురకలు అంటించారు.
అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025) లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు.
ఐడెన్ మార్క్రమ్ (9), డేవిడ్ మిల్లర్ (24) రూపంలో రెండు కీలక వికెట్లు తీసిన బుమ్రా.. అబ్దుల్ సమద్ (2), ఆవేశ్ ఖాన్ (0)లను వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపాడు. తన పేస్ పదునుతో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
చిన్నారి అంగద్‌తోస్టేడియానికి సంజన
ఇదిలా ఉంటే.. ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌కు బుమ్రా భార్య, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ తమ కుమారుడు అంగద్‌తో కలిసి హాజరైంది. ఈ క్రమంలో చిన్నారి అంగద్ ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో అతడు కాస్త నీరసంగా ఉన్నట్లు కనిపించిందని.. డిప్రెషన్, ట్రామా వంటి పదాలు వాడుతూ కొంత మంది నెటిజన్లు బుమ్రా- సంజనాలను విమర్శించారు.

PC: X
ఈ విషయంపై సంజనా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు.. ‘‘మీ వినోదం కోసం మా కుమారుడి పేరు లాగొద్దు. జస్‌ప్రీత్, నేను అంగద్‌ను సోషల్ మీడియాకు వీలైనంత ఎక్కువ దూరంగానే ఉంచుతాం. ఎందుకంటే.. ఇంటర్నెట్‌లో ఎక్కువగా విద్వేషం, విషం చిమ్మే వాళ్లే ఉంటారని తెలుసు.
మాకు అలాంటి పిచ్చిలేదు
చిన్నారితో కలిసి క్రికెట్ స్టేడియానికి వెళ్తే ఎలాంటి విమర్శలు వస్తాయో నాకు తెలుసు. అక్కడ కెమెరాలు ఉంటాయనీ తెలుసు. అయితే, నేను, అంగద్ కేవలం జస్‌ప్రీత్‌కు మద్దతుగా మాత్రమే అక్కడకు వచ్చాం.
మా కొడుకు ఇంటర్నెట్‌లో వైరల్ కంటెంట్‌గానో.. జాతీయ వార్తగానో మారిపోవాలని మాకు ఎంతమాత్రం లేదు. కీబోర్డు వారియర్లు అయితే ఏకంగా అంగద్‌ను మూడు సెకన్ల ఫుటేజ్‌లో చూసి ఏదేదో మాట్లాడేస్తున్నారు.
మా గురించి మీకేం తెలుసు?..
వాడికి ఇప్పుడు ఏడాదిన్నర వయసు మాత్రమే. కానీ మీరు ట్రామా, డిప్రెషన్ వంటివి పదాలు వాడుతూ వాడి గురించి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా విచారకరం. మా కొడుకు గురించి మీకు ఏం తెలుసు?
మా జీవితాల గురించి మీకెంత తెలుసు. మీ అభిప్రాయాలను మీతోనే పెట్టుకోండి. ఎదుటివారి పట్ల దయ, సహానుభూతి కలిగి ఉండటం వంటివి ఈరోజుల్లో ఎంతో ముఖ్యమైన విషయాలుగా మారిపోయాయి’’ అని సంజనా గణేషన్ తన ఇన్‌స్టా స్టోరీలో భావోద్వేగపూరిత నోట్ రాశారు. దయచేసి చిన్నపిల్లల విషయంలోనైనా కాస్త సంయమనంతో వ్యవహరించాలని కోరారు.
చదవండి: కేఎల్ రాహుల్‌తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్ కీపర్! వీడియో