‘నువ్వుంటే నిశ్చింత.. నువ్వే నా హృదయ స్పందన’ | Sanjana Ganesan Pens Heartfelt Note For Jasprit Bumrah On Wedding Anniversary, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘నువ్వుంటే నిశ్చింత.. నువ్వే నా హృదయ స్పందన’

Mar 15 2025 12:25 PM | Updated on Mar 15 2025 1:27 PM

Sanjana Ganesan Pens heartfelt lyrics for Bumrah on Anniversary Post Viral

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)- స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేషన్‌ (Sanjana Ganesan) వివాహ వార్షికోత్సవం నేడు (మార్చి 15). ఈ సందర్భంగా సంజనా భర్తపై ప్రేమను కురిపిస్తూ ఉద్వేగ పూరిత నోట్‌ షేర్‌ చేసింది. 

‘‘నువ్వుంటేనే నా గుండె కొట్టుకుంటుంది.. నువ్వు నాతో ఉంటేనే నాకు శ్వాస ఆడుతుంది.. నువ్వు లేని ఇల్లు ఇల్లులా కనిపించదు.. నువ్వే నా ధైర్యం.. నువ్వుంటే నేను నిశ్చితంగా ఉంటాను.. హ్యాపీ 4 లవ్‌’’ అంటూ సంజనా కవితాత్మక పంక్తులతో భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి’ సినిమా పాటలోని లిరిక్స్‌తో తన ప్రేమను వ్యక్తపరిచింది.

హ్యాపీ యానివర్సరీ
ఇందుకు బుమ్రాతో కలిసి ఉన్న ఫొటోను సంజనా జతచేసింది. ఈ క్రమంలో బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సాధారణ కుటుంబంలో జన్మించిన బుమ్రా.. తన అంకిత భావం, కఠిన శ్రమతో వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో అతడే ముందున్నాడు.

అంతేకాదు.. టీమిండియా పేస్‌ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. వైస్‌ కెప్టెన్‌గానూ సేవలు అందిస్తున్నాడు. ఇక సంజనా విషయానికొస్తే.. బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించిన ఆమె.. తర్వాత స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా మారింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రజెంటర్‌గా పనిచేస్తూ ఉన్నత స్థాయికి చేరుకుంది.

ఈ క్రమంలో బుమ్రా- సంజనా మధ్య కుదిరిన స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. ఇరు కుటుంబాల సమ్మతంతో వీరు 2021, మార్చి 15న సిక్కు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు సెప్టెంబరు 4, 2023లో కుమారుడు జన్మించగా.. అతడికి అంగద్‌గా నామకరణం చేశారు. 

కోలుకుంటున్న బుమ్రా
కాగా బుమ్రా ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గాయం కారణంగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 మొత్తానికి దూరమైన అతడు... కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఐపీఎల్‌-2025లో ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.

ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఐపీఎల్‌ ఆరంభం నుంచి ముంబైతో ప్రయాణిస్తున్న బుమ్రాను మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ తమ మొదటి ప్రాధాన్య ప్లేయర్‌గా రిటైన్‌ చేసుకుంది. అతడి కోసం రూ. 18 కోట్లు ఖర్చు చేసింది.

ఇక ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 45 టెస్టులు ఆడిన బుమ్రా.. 205 వికెట్లు తీశాడు. ఇక 89 వన్డేల్లో ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ 149 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున 89 వికెట్లు తీసిన బుమ్రా.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు ఆడి 165 వికెట్లు పడగొట్టాడు. 

చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement