
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025)లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఆటగాడిగా పూర్తిగా విఫలమవుతున్నాడు. చెత్త బ్యాటింగ్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అతడు నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 0, 15, 2, 2, 21, 63, 3, 0, 4.
98.21 స్ట్రైక్‌రేటుతో మొత్తంగా కలిపి కేవలం 110 పరుగులు చేశాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్రకెక్కిన పంత్ నుంచి ఇలాంటి ఆట తీరు అస్సలు ఊహించనిది. దీంతో అభిమానులు సైతం అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే, కెప్టెన్‌గా మాత్రం రిషభ్ పంత్ ప్రదర్శన బాగానే ఉంది. అతడి సారథ్యంలో ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న లక్నో ఐదింట గెలిచింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి ఐదో పరాజయం నమోదు చేసింది.
ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రిషభ్ పంత్‌కు అతడి ఫామ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది.
పరిస్థితులు మనకు అనుకూలంగా లేనపుడు మన నైపుణ్యాలపై మనకే సందేహాలు తలెత్తుతాయి. అయితే, అలాంటి భావనలను దరిచేయనీయకూడదు. జట్టు బాగా ఆడుతున్నపుడు.. ఆ విషయంపైనే ఎక్కువగా దృష్టి సారించాలి.
ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు
క్రికెట్ అంటేనే జట్టుగా ఆడాల్సిన ఆట. అవును.. ఒక్క ఆటగాడి వల్ల కూడా ప్రభావం ఉంటుంది. మ్యాచ్ దిశ మారిపోతుంది. కానీ ప్రతిసారి ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదనుకుంటా’’ అని పంత్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.
కాగా హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన పోరులో ముంబై 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
ర్యాన్ రికెల్టన్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది.
విల్ జాక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో
లక్నో ఆటగాళ్లలో ఆయుశ్ బదోని (22 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. విల్ జాక్స్ బౌలింగ్‌లో కర్ణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు.
ఇదిలా ఉంటే.. ముంబౌ బౌలర్లలో బుమ్రా 4, బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన విల్ జాక్స్ (29, 2/18) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో అత్యధికంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసి పంత్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే.
చదవండి: వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు ఆ పిచ్చి లేదు: సంజనా
𝙂𝙖𝙢𝙚. 𝙎𝙚𝙩. 𝘿𝙤𝙣𝙚 ✅@mipaltan make it 5⃣ in 5⃣ and are marching upwards and onwards in the season 📈
Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/zW7EuWhU7j— IndianPremierLeague (@IPL) April 27, 2025