IPL 2025: ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం చేస్తున్న భువీ.. ఈ క్రమంలో అరుదైన ఘనత | IPL 2025, DC VS RCB: Bhuvneshwar Kumar Becomes Second Highest Wicket Taker In IPL History | Sakshi
Sakshi News home page

IPL 2025: ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం చేస్తున్న భువీ.. ఈ క్రమంలో అరుదైన ఘనత

Published Mon, Apr 28 2025 1:28 PM | Last Updated on Mon, Apr 28 2025 1:37 PM

IPL 2025, DC VS RCB: Bhuvneshwar Kumar Becomes Second Highest Wicket Taker In IPL History

Photo Courtesy: BCCI

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం (టైటిల్‌ సాధించడం) చేస్తున్న వ్యక్తుల్లో భువనేశ్వర్‌ కుమార్‌ ముఖ్యుడు. ఈ సీజన్‌లో భువీ ఆడిన ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటి ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

తాజాగా (ఏప్రిల్‌ 27) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్‌ చేయడమే (4 ఓవర్లలో 33 పరుగులు) కాకుండా 3 వికెట్లు తీసి ఆర్సీబీ గెలుపులో ముఖ్య భూమిక పోషించాడు. ఈ క్రమంలో ఓ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పియూశ్‌ చావ్లాను (192) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. 

ప్రస్తుతం భువీ ఖాతాలో 193 వికెట్లు (185 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్‌ పేరిట ఉంది. చహల్‌ 169 మ్యాచ్‌ల్లో 214 వికెట్లు తీసి టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌలర్లు
యుజ్వేంద్ర చహల్‌- 214
భువనేశ్వర్‌ కుమార్‌- 193
పియూశ్‌ చావ్లా- 192
సునీల్‌ నరైన్‌- 187
రవిచంద్రన్‌ అశ్విన్‌- 185

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో భువీ ప్రదర్శనలు..
సీఎస్‌కేపై 1/20 (ఆర్సీబీ గెలుపు)
గుజరాత్‌పై 1/23 (ఆర్సీబీ ఓటమి)
ముంబై ఇండియన్స్‌పై 1/48 (ఆర్సీబీ గెలుపు)
ఢిల్లీ క్యాపిటల్స్‌పై 2/26 (ఆర్సీబీ ఓటమి)
రాజస్థాన్‌ రాయల్స్‌పై 1/32 (ఆర్సీబీ గెలుపు)
పంజాబ్‌ కింగ్స్‌పై 2/26 (ఆర్సీబీ ఓటమి)
పంజాబ్‌ కింగ్స్‌పై 0/26 (ఆర్సీబీ గెలుపు)
రాజస్థాన్‌ రాయల్స్‌పై 1/50 (ఆర్సీబీ గెలుపు)
ఢిల్లీ క్యాపిటల్స్‌పై 3/33 (ఆర్సీబీ గెలుపు)

35 ఏళ్ల భువీ ఆర్సీబీకి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పూణే వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సన్‌రైజర్స్‌ తరఫున విశేషంగా రాణించిన భువీ.. ఆ ఫ్రాంచైజీ తరఫున 157 వికెట్లు తీశాడు. మధ్యలో రెండు సీజన్లు పుణేకు ఆడి 31 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఆడుతూ 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు. 

భువీ తన ఐపీఎల్‌ కెరీర్‌లో రెండు సార్లు పర్పుల్‌ క్యాప్‌ (సీజన్‌లో అ‍త్యధిక వికెట్లు) హోల్డర్‌గా నిలిచాడు. 2016, 20167 సీజన్ల వరుసగా ఈ ఫీట్‌ను సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో కేవలం​ డ్వేన్‌ బ్రావో, హర్షల్‌ పటేల్‌ మాత్రమే రెండు సార్లు పర్పుల్‌ క్యాప్‌ సాధించారు.

నిన్న జరిగిన ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్‌ విషయానికొస్తే.. భువీతో పాటు హాజిల్‌వుడ్‌ (4-0-36-2), సుయాశ్‌ శర్మ (4-0-22-0), కృనాల్‌ పాండ్యా (4-0-28-1) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 162 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (41), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ ఆదిలో తడబడినప్పటికీ (4 ఓవర్లలో 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది).. విరాట్‌ (47 బంతుల్లో 51; 4 ఫోరు​), కృనాల్‌ (47 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టును  విజయతీరాలకు చేర్చారు. టిమ్‌ డేవిడ్‌ (5 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ‌ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటిన కృనాల్‌ పాండ్యాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ (4-0-19-2), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-28-0), చమీరా (3-0-24-1) బాగానే బౌలింగ్‌ చేసినప్పటికీ.. లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు డిఫెండ్‌ చేసుకోలేకపోయారు. ఆ జట్టు బౌలర్లలో స్టార్క్‌ (3-0-31-0), ముకేశ్‌ కుమార్‌ (3.3-0-51-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

ఢిల్లీపై గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ‌ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) ఈ జట్టు సీఎస్‌కేతో (బెంగళూరులో) తలపడనుంది. మే 9న ఎల్‌ఎస్‌జీని లక్నోను ఢీకొంటుంది. ఆతర్వాత సన్‌రైజర్స్‌, కేకేఆర్‌లను బెంగళూరులో ఎదుర్కొంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement