
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను వరుసగా నాలుగు విజయాలతో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ సాగే కొద్ది ప్రభ కోల్పోతున్నట్లు కనిపిస్తుంది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఆ జట్టు మూడు పరాజయాలు ఎదుర్కొని రెండే విజయాలు సాధించింది. ఇందులో ఒకటి సూపర్ ఓవర్‌లో (రాజస్థాన్ రాయల్స్) గెలిచింది.
తాజాగా (ఏప్రిల్ 27) ఈ జట్టు సొంత మైదానంలో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. ఈ ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. లీగ్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఢిల్లీని వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. తాజాగా ఢిల్లీపై గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. గుజరాత్ రెండో స్థానానికి పడిపోయింది.
ఢిల్లీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 పరాజయలతో 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఆ జట్టు రన్‌రేట్ 0.482గా ఉంది. గుజరాత్, ముంబై కూడా చెరో 12 పాయింట్లు కలిగినప్పటికీ వారి రన్‌రేట్ ఢిల్లీ కంటే మెరుగ్గా ఉంది.
ఢిల్లీ తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటి ప్రదర్శనే కొనసాగిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదముంది. లీగ్ ప్రారంభంలో అద్భుత విజయాలు సాధించిన జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోలేని సందర్భాలు చాలా ఉన్నాయి. ఢిల్లీ ఇకనైనా జాగ్రత్త పడితేనే టైటిల్ వేట కొనసాగించగలదు.
నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి అతి తక్కువ స్కోర్‌కు (162) పరిమితమైన ఢిల్లీ.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేక ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తూ ఢిల్లీ చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఢిల్లీ బ్యాటర్లు తడబడ్డారు.
ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇక్కడ క్రెడిట్ ఆర్సీబీ బౌలర్లకు ఇవ్వాలి. భువనేశ్వర్ కుమార్ (4-0-33-3), హాజిల్‌వుడ్ (4-0-36-2), సుయాశ్ శర్మ (4-0-22-0), కృనాల్ పాండ్యా (4-0-28-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ కూడా ఆదిలో తడబడినప్పటికీ (4 ఓవర్లలో 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది).. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు.
ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ (4-0-19-2), కుల్దీప్ యాదవ్ (4-0-28-0), చమీరా (3-0-24-1) బాగానే బౌలింగ్ చేసినప్పటికీ.. లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఆ జట్టు బౌలర్లలో స్టార్క్ (3-0-31-0), ముకేశ్ కుమార్ (3.3-0-51-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ అన్ని విభాగాల్లో సామర్థ్యం మేరకు రాణించలేక ఓటమిపాలైంది.
మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 10-15 పరుగులు తక్కువగా చేశామని భావిస్తున్నాను. మేము బ్యాటింగ్ చేసేటప్పుడు మంచు కారణంగా వికెట్ కాస్త కఠినంగా ఉండింది. ఆర్సీబీ బ్యాటింగ్ చేసే సమయానికి వికెట్ సులువుగా మారింది. ఈ మ్యాచ్‌లో మేము కొన్ని ఈజీ క్యాచ్‌లను మిస్ చేశాము. ఆ క్యాచ్‌లను పట్టి ఉండాల్సింది.
మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాము. ఓ బ్యాటర్ కొంత సమయం క్రీజ్‌లో గడిపి ఉంటే వేగంగా పరుగులు సాధించగలిగేవాడు. అదనంగా 10-15 పరుగులు వచ్చేవి. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓ స్థానం కిందికి రావడంపై స్పందిస్తూ.. రాహుల్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే అతన్ని 4వ స్థానంలో పంపాము. మైదానంలో ఓ వైపు చిన్నగా ఉంది. రాహుల్‌ను ముందుగా పంపడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పాడు.