
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఏకైక అజేయ జట్టుగా నిలిచింది. గడిచిన 16 సీజన్లలో ఢిల్లీ ఆడిన తొలి మూడు మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. 2009 సీజన్‌లో ఆ జట్టు వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలో వరుసగా తొలి మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. తాజాగా సెహ్వాగ్ రికార్డును అక్షర్ సమం చేశాడు.
ఈ సీజన్‌తోనే ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అక్షర్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తన జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి అడ్డాలో (చెపాక్ స్టేడియం) ఓడించింది. ఢిల్లీ ఫ్రాంచైజీ చరిత్రలో అక్షర్‌కు ముందు సెహ్వాగ్ (2008), గంభీర్ (2010) మాత్రమే సీఎస్‌కేను వారి సొంత మైదానంలో ఓడించారు. నిన్న (ఏప్రిల్ 5) మధ్యాహ్నం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సీఎస్‌కేను 25 పరుగుల తేడాతో ఓడించింది.
కేఎల్ రాహుల్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనలో సీఎస్‌కే తడబడింది. ఢిల్లీ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. ధోని జిడ్డు బ్యాటింగ్‌తో (26 బంతుల్లో 30; ఫోర్, సిక్స్) సీఎస్‌కే విజయావకాశలను దెబ్బ తీశాడు. మరో ఎండ్‌లో త్రీడి ప్లేయర్ విజయ్ శంకర్ (54 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) కూడా నిదానంగా ఆడి సీఎస్‌కే పరాజయానికి కారకుడయ్యాడు.
ఢిల్లీ బ్యాటర్లలో జేక్ ఫ్రేజర్ డకౌట్ కాగా.. అభిషేక్ పోరెల్ 33, అక్షర్ పటేల్ 21, సమీర్ రిజ్వి 20, ట్రిస్టన్ స్టబ్స్ 24 (నాటౌట్), అశోతోష్ శర్మ 1, విప్రాజ్ నిగమ్ 1 (నాటౌట్) పరుగులు చేశారు.సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్ పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీశ పతిరణ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 74 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో నడిచింది. ఈ దశలో విజయ్ శంకర్, ధోని గెలుపు ప్రయత్నాలు ఏమాత్రం చేయకుండా వికెట్ కాపాడుకునే పని పడ్డారు. ధోని ఏకంగా 18 బంతుల తర్వాత తన తొలి సిక్సర్‌ను కొట్టాడు. విజయ్ శంకర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనే అతి నిదానమైన హాఫ్ సెంచరీ (43 బంతుల్లో) చేశాడు.
చివర్లో విజయ్ శంకర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో చెత్తగా ఆడిన ధోనిని సొంత అభిమానులు సైతం విసుక్కున్నారు. ధోని ఇక తప్పుకోవడం మంచిదని అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ (4-0-27-1), విప్రాజ్ నిగమ్ (4-0-27-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముకేశ్ కుమార్, కుల్దీప్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. సీఎస్‌కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర 3, డెవాన్ కాన్వే 13, రుతురాజ్ 5, శివమ్ దూబే 18, రవీంద్ర జడేజా 2 పరుగులు చేశారు.
ఈ ఓటమితో సీఎస్‌కే ఖాతాలో హ్యాట్రిక్ పరాజయాలు చేరాయి. తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందిన ఈ జట్టు ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ చేతుల్లో ఓడింది. మరోవైపు అక్షర్ నేతృత్వంలోని ఢిల్లీ వరుసగా లక్నో, సన్‌రైజర్స్, సీఎస్‌కేపై విజయాలు సాధించింది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో (ఏప్రిల్ 10) తలపడనుండగా.. సీఎస్‌కే పంజాబ్ కింగ్స్‌ను (ఏప్రిల్ 8) ఢీకొట్టనుంది.