
Photo Courtesy: BCCI
ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా అవతరించాడు. నిన్న (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ వికెట్ తీయడం ద్వారా భువీ ఈ ఘనత సాధించాడు. భువీ ఐపీఎల్ 179 మ్యాచ్‌లు ఆడి 184 వికెట్లు తీశాడు. భువీ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా డ్వేన్ బ్రావో ఉన్నాడు. బ్రావో 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీశాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 పేసర్లు
184 - భువనేశ్వర్ కుమార్ (179 మ్యాచ్‌లు)
183 - డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌లు)
170 - లసిత్ మలింగ (122 మ్యాచ్‌లు)
165 - జస్ప్రీత్ బుమ్రా (134 మ్యాచ్‌లు)
144 - ఉమేష్ యాదవ్ (148 మ్యాచ్‌లు)
ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 163 మ్యాచ్‌ల్లో 206 వికెట్లు తీశాడు. చహల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఘనత పియూశ్ చావ్లాకు దక్కుతుంది. చావ్లా 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చహల్ , చావ్లా తర్వాత భువీ, బ్రావో, అశ్విన్ ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు
206 - యుజ్వేంద్ర చహల్ (163 మ్యాచ్‌లు)
192 - పియూశ్ చావ్లా (192 మ్యాచ్‌లు)
184 - భువనేశ్వర్ కుమార్ (179 మ్యాచ్‌లు)
183 - డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌లు)
183 - రవిచంద్రన్ అశ్విన్ (216 మ్యాచ్‌లు)
కాగా, నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ముంబై ఇండియన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేసి చివరివరకు పోరాడింది. అయితే లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
తద్వారా ఆర్సీబీ 10 ఏళ్ల తర్వాత ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో ఓడించింది. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీకి 4 మ్యాచ్‌ల్లో ఇది మూడో గెలుపు. ముంబైకి 5 మ్యాచ్‌ల్లో నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉండగా.. ముంబై చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.
నిన్నటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (67), రజత్ పాటిదార్ (64), జితేశ్ శర్మ (40 నాటౌట్), పడిక్కల్ (37) సత్తా చాటి ఆర్సీబీ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. బౌల్ట్, హార్దిక్ తలో 2 వికెట్లు తీయగా.. విజ్ఞేశ్ పుతుర్ ఓ వికెట్ పడగొట్టాడు. ఛేదనలో ముంబైకు ఆదిలోనే షాక్ తగిలింది.
మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (17) రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ రికెల్టన్ (17) నాలుగో ఓవర్‌లో పెవిలియన్‌కు చేరాడు. విల్ జాక్స్ (22), సూర్యకుమార్ యాదవ్ (28) క్రీజ్‌లో నిలదొక్కుకునే క్రమంలో ఔటయ్యారు. ఈ దశలో తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ముంబైని గెలుపు దిశగా తీసుకెళ్లారు.
అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ముంబై చివరి ఓవర్ వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ఆర్సీబీ బౌలర్ కృనాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అంతకుముందు భువీ 18వ ఓవర్‌లో తిలక్ వర్మను.. 19వ ఓవర్‌లో హాజిల్‌వుడ్ హార్దిక్ పాండ్యాను ఔట్ చేశారు.