
Photo Courtesy: BCCI
ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యాకు ఏప్రిల్ 7 భలే అచ్చొచ్చే తేదీలా ఉంది. యాధృచ్చికమో ఏమో తెలీదు కానీ ఈ తేదీన కృనాల్ చెలరేగిపోతాడు. గత కొన్నేళ్లుగా ఈ తేదీలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 2023 సీజన్ నుంచి ఏప్రిల్ 7న ఆడిన ప్రతి మ్యాచ్‌లో కృనాల్ సత్తా చాటాడు.
2023 సీజన్‌లో కృనాల్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో కృనాల్ తొలుత బంతితో చెలరేగి (4-0-18-3), ఆతర్వాత బ్యాట్‌తోనూ రాణించాడు (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, సిక్స్). ఫలితంగా లక్నో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ ప్రదర్శనకు గానూ కృనాల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.
2024 సీజన్‌లో ఏప్రిల్ 7న నాడు కృనాల్ ప్రాతినిథ్యం వహించిన లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో కృనాల్ బంతితో అదరగొట్టి (4-0-11-3) తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తాజాగా 2025 ఏప్రిల్ 7న కృనాల్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ తేదీన ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కృనాల్ చివరి ఓవర్ వేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా అతను కొత్తగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.
గత మూడేళ్లలో ఏప్రిల్ 7న ఆడిన మ్యాచ్‌ల్లో కృనాల్ రెచ్చిపోవడం చూస్తే ఈ తేదీ అతనికి అచ్చొచ్చిందిగా చెప్పవచ్చు. ఈ మూడు సందర్భాల్లో కృనాల్ రాణించడంతో పాటు అతని జట్టును కూడా గెలిపించాడు. ఓ సందర్భంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా నిలిచాడు.
2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన కృనాల్ ఈ సీజన్‌లోనే ఆర్సీబీలో చేరాడు. మెగా వేలంలో ఆర్సీబీ కృనాల్‌ను రూ. 5.75 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు కృనాల్ మూడేళ్లు (2022, 2023, 2024) లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. దానికి ముందు వరుసగా ఆరు సీజన్లు (2016, 17, 18, 19, 20, 21) ముంబై ఇండియన్స్‌కు ప్రాతనిథ్యం వహించాడు. కృనాల్ జట్టులో ఉండగా ముంబై ఇండియన్స్ మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది.
లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన 34 ఏళ్ల కృనాల్ ఇప్పటివరకు 131 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1652 పరుగులు, 83 వికెట్లు తీశాడు.
నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో దాదాపు పదేళ్ల తర్వాత ఓడించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లి (67), రజత్ పాటిదార్ (64), జితేశ్ శర్మ (40 నాటౌట్), పడిక్కల్ (37) సత్తా చాటారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ తలో 2 వికెట్లు తీయగా.. విజ్ఞేశ్ పుతుర్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఛేదనలో ముంబై చివరి ఓవర్ వరకు పోరాడి 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ముంబైని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ 4, హాజిల్‌వుడ్, యశ్ దయాల్ తలో 2, భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.