
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మరోసారి తమ హోం గ్రౌండ్‌లో చతికలపడింది. ఈ మెగా టోర్నీలో భాంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రెండు విభాగాల్లోనూ బెంగళూరు నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
ఆర్సీబీ పవర్ ప్లేలో మెరుపు ఆరంభం లభించినప్పటికీ, ఆ తర్వాత వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి మోస్తారు స్కోర్‌కే పరిమితమైంది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(37) పరుగులతో మెరుపు ఆరంభం ఇవ్వగా..టిమ్ డేవిడ్(18 బంతుల్లో 32, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు.
అనంతరం 164 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. తన సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత కాస్త నెమ్మదిగా ఆడినప్పటికి మిడిల్ ఓవర్లలో మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
53 బంతులు ఎదుర్కొన్న రాహుల్..7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 93 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రాహుల్‌తో పాటు స్టబ్స్(38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీకి బౌలింగ్‌లో అద్బుతమైన ఆరంభం లభించింది. 60 పరుగులకే ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ మిడిల్ ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు తేలిపోయారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు, యశ్‌దయాల్, సుయాష్ శర్మ తలా వికెట్ సాధించారు.
ఆర్సీబీ చెత్త రికార్డు..
ఈ మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన ఆర్సీబీ.. అత్యంత చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఐపీఎల్‌లో ఒకే వేదికలో అత్యధిక ఎదుర్కొన్న జట్టుగా చెత్త రికార్డును నెలకొల్పింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది 45వ ఓటమి. తద్వారా ఈ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉండేది. ఢిల్లీ జట్టు అరుణ్ జైట్లీ స్టేడియంలో 44 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. తాజా ఓటమితో ఢిల్లీని బెంగళూరు జట్టు అధిగమించింది.