ఈ ఆర్సీబీకి ఏమైంది.. వరుసగా మ్యాచ్‌లు గెలిచేస్తుంది.. టైటిల్‌ కూడా గెలుస్తుందా ఏంది..? | IPL 2025: Can RCB Win Title This Season | Sakshi
Sakshi News home page

ఈ ఆర్సీబీకి ఏమైంది.. వరుసగా మ్యాచ్‌లు గెలిచేస్తుంది.. టైటిల్‌ కూడా గెలుస్తుందా ఏంది..?

Mar 29 2025 3:11 PM | Updated on Mar 29 2025 3:22 PM

IPL 2025: Can RCB Win Title This Season

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ గత 17 సీజన్లతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు తొలి మ్యాచ్‌ నుంచే విజయాల బాట పట్టింది. సాధారణంగా ఆర్సీబీ తొలి మ్యాచ్‌లను పెద్దగా పట్టించుకోదు. ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరిన ప్రతిసారి ఆఖరి మ్యాచ్‌ల్లోనే విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ వరుసగా కేకేఆర్‌, ముంబై ఇండియన్స్‌పై విజయాలు నమోదు చేసింది. ఈ రెండు విజయాలు ప్రత్యర్థుల అడ్డాలో రావడం మరింత ప్రత్యేకం. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్‌ను ఆర్సీబీ ఈడెన్‌ గార్డన్స్‌లో ఓడించింది. ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన సీఎస్‌కేను 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్‌లో మట్టికరిపించింది.

ఈ సీజన్‌లో ఆర్సీబీ జట్టుగా కూడా బలంగా కనిపిస్తుంది. గత సీజన్లలోలా ఒకరిద్దరిపై ఆధారపడినట్లు కనిపించడం లేదు. కొత్త కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ కామ్‌గా ఉంటూ ఆశ్చర్యకర రీతిలో వ్యూహాలు పన్నుతుకున్నాడు. పాటిదార్‌ కెప్టెన్సీ కూడా ఈసారి ఆర్సీబీ టైటిల్‌ గెలుపును సూచిస్తుంది. పాటిదార్‌ వ్యక్తిగతంగా కూడా రాణించడం ఆర్సీబీకి మరో శుభ సూచకం. ఈ సీజన్‌లో ఆర్సీబీ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో పాటిదార్‌ చాలా మూల్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. పాటిదార్‌ బలంగా షాట్లు ఆడుతూ స్పిన్నర్లను బెంబేలెత్తిస్తున్నాడు. పాటిదార్‌ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఆర్సీబీ ఈసారి ఖచ్చితంగా అద్భుతం చేస్తుంది.

ఈ సీజన్‌లో ఆర్సీబీకి మరో శుభ సూచకం హాజిల్‌వుడ్‌ ఫామ్‌. హాజిల్‌వుడ్‌ ఈ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆర్సీబీ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో అతడు కీలకపాత్ర పోషించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో హాజిల్‌వుడ్‌ ఆదిలోనే వికెట్లు తీసి ప్రత్యర్ధులను డిఫెన్స్‌లో పడేశాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీకి లభించిన మరో ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ఫిల్‌ సాల్ట్‌. సాల్ట్‌ ఈ సీజన్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు బలమైన పునాది వేశాడు. తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీతో మెరిసిన విరాట్‌.. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించాడు.

తొలి మ్యాచ్‌లో తన స్పిన్‌ బౌలింగ్‌తో అద్బుతం చేసిన కృనాల్‌ పాండ్యా కూడా ఈ సీజన్‌లో ఆర్సీబీకి టైటిల్‌ అందించేలా ఉన్నాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌, జితేశ్‌ శర్మ కూడా లైన్‌లోకి వస్తే ఆర్సీబీ బ్యాటింగ్‌ యూనిట్‌ మరింత పటిష్టంగా తయారవుతుంది. విదేశీ విధ్వంకర వీరులు లివింగ్‌స్టోన్‌, టిమ్‌ డేవిడ్‌ తమ సామర్థ్యం మేరకు రాణిస్తే ఈ సీజన్‌లో టైటిల్‌ గెలవకుండా ఆర్సీబీని ఎవ్వరూ ఆపలేరు. 

ఆర్సీబీలో దేశీయ బౌలింగ్‌ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. భువనేశ్వర్‌ కుమార్‌ చేరిక ఆర్సీబీ పేస్‌ విభాగానికి మరింత ఊపునిచ్చింది. యశ్‌ దయాల్‌ సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఒకే ఒవర్‌లో రెండు వికెట్లు​ తీసి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. స్పిన్నర్‌ సుయాశ్‌ శర్మ తొలి మ్యాచ్‌లో మ్యాజిక్‌ చేశాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో సుయాశ్‌ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. 

ఓవరాల్‌గా ఆర్సీబీ ఈ సీజన్‌లో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ప్రతి సీజన్‌కు ముందు ఈ సాలా కప్‌ నమ్మదే అని డప్పు కొట్టుకునే ఆర్సీబీ ఫ్యాన్స్‌ గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువగా హడావుడి చేయడం లేదు. ఇదీ ఓ రకంగా ఆర్సీబీ టైటిల్‌ గెలుపుకు సూచకంగా తీసుకోవచ్చు. 

అన్నిటి కంటే ఎక్కువగా ఈ సారి అంకెల కో ఇన్సిడెన్స్‌ ఆర్సీబీకి కలిసొస్తుందేమో అనిపిస్తుంది. ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి జెర్సీ నంబర్‌ 18 కాగా.. ఈ ఐపీఎల్‌ సీజన్‌ సంఖ్య కూడా పద్దెనిమిదే కావడం​ విశేషం. మరి 18 సీజన్‌ ఆర్సీబీ టైటిల్‌ విన్నింగ్‌ సీజన్‌ అవుతుందో లేదో వేచి చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement