ఆర్సీబీ​కి గుడ్‌ న్యూస్‌.. భువనేశ్వర్‌ కుమార్‌ హ్యాట్రిక్‌ | RCB Pacer Bhuvneshwar Kumar Takes Hat Trick VS Jharkhand In Syed Mushtaq Ali T20 Trophy | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ​కి గుడ్‌ న్యూస్‌.. భువనేశ్వర్‌ కుమార్‌ హ్యాట్రిక్‌

Published Thu, Dec 5 2024 2:59 PM | Last Updated on Thu, Dec 5 2024 7:21 PM

RCB Pacer Bhuvneshwar Kumar Takes Hat Trick VS Jharkhand In Syed Mushtaq Ali T20 Trophy

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్‌ ప్రదేశ్‌ కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగాడు. జార్ఖండ్‌తో ఇవాళ (డిసెంబర్‌ 5) జరిగిన మ్యాచ్‌లో భువీ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌ 17వ ఓవర్‌లో భువీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్‌లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్‌ ఉంది. 

ఈ మ్యాచ్‌లో భువీతో పాటు నితీశ్‌ రాణా (4-0-19-2), మొహిసిన్‌ ఖాన్‌ (2.5-0-38-2), వినీత్‌ పన్వార్‌ (4-0-39-1), విప్రాజ్‌ నిగమ్‌ (2-0-18-1), శివమ్‌ మావి (3-0-28-1) రాణించడంతో జార్ఖండ్‌పై ఉత్తర్‌ ప్రదేశ్‌ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ 28 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ప్రియమ్‌ గార్గ్‌ 31, సమీర్‌ రిజ్వి 24, నితీశ్‌ రాణా 16, శివమ్‌ మావి 15 పరుగులు చేశారు. జార్ఖండ్‌ బౌలర్లలో బాల్‌ కృష్ణ 3 వికెట్లు తీయగా.. వివేకానంద్‌ తివారి 2, వికాస్‌ కుమార్‌, వికాశ్‌ సింగ్‌, అనుకుల్‌ రాయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్‌.. 19.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. అనుకుల్‌ రాయ్‌ (44 బంతుల్లో 91) జార్ఖండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి మరో ఎండ్‌ నుంచి సహకారం లభించలేదు. విరాట్‌ సింగ్‌ (23), రాబిన్‌ మింజ్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ (8) విఫలమయ్యాడు.

ఆర్సీబీలో చేరిన భువీ
ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో భువనేశ్వర్‌ కుమార్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. భువీపై ఆర్సీబీ 10.75 కోట్లు వెచ్చించింది. మెగా వేలానికి ముందు భువనేశ్వర్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వదులుకుంది. భువీ 2014 నుంచి సన్‌రైజర్స్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భువీకి పవర్‌ ప్లే మరియు డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుంది. భువీ 2016, 2017 ఐపీఎల్‌ సీజన్లలో పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌గా నిలిచాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ 2016లో టైటిల్‌ సాధించడంలో భువీ కీలకపాత్ర పోషించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement