ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్‌గా తొలి టెస్టులోనే విజయం సాధించడం పట్ల జస్‌ప్రీత్ బుమ్రా హర్షం వ్యక్తం చేశాడు. పెర్త్‌లో తమ జట్టు ప్రదర్శనతో పూర్తి సంతృప్తిగా.. గర్వంగా ఉన్నానని చెప్పాడు. ఆత్మవిశ్వాసం ఉంటే అనుభవంతో పనిలేదని భారత యువ ఆటగాళ్లు ఈ మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపించారని కొనియాడాడు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. అయితే, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. పేసర్ బుమ్రా భారత జట్టు సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఆడిన టీమిండియా.. ఆసీస్‌ను ఏకంగా 295 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా కంగారూ గడ్డపై అతిపెద్ద విజయం నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో విజయానంతరం తాత్కాలిక కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా మాట్లాడుతూ.. ‘‘విజయంతో సిరీస్ ఆరంభించడం సంతోషంగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో మేము బాగా ఒత్తిడికి లోనయ్యాం. అయితే, ఆ తర్వాత తిరిగి పుంజుకున్న తీరు పట్ల నాకెంతో గర్వంగా ఉంది.
2018లో ఇక్కడ ఆడాను. ఇక ఈ పిచ్ మాకు సవాళ్లు విసిరింది. అయితే, అనుభవం కంటే.. సామర్థ్యాన్నే మేము ఎక్కువగా నమ్ముకున్నాం. పూర్తిస్థాయిలో మ్యాచ్ కోసం సిద్ధమయ్యాం. ఆత్మవిశ్వాసం ఉంటే.. ప్రత్యేకంగా ఏదైనా సాధించగలమని విశ్వసించాం. ఇంతకంటే మాకు ఇంకేం కావాలి’’ అని బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు.
ఇక సెంచరీ వీరులు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిల గురించి ప్రస్తావన రాగా.. ‘‘జైస్వాల్ టెస్టు కెరీర్ అద్భుతంగా సాగుతోంది. టెస్టుల్లో ఇదే అతడికి మొదటి అత్యుత్తమ ఇన్నింగ్స్ అనుకుంటున్నా. బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ అతడు అటాక్ చేసిన విధానం అద్భుతం.
ఇక విరాట్.. అతడు ఫామ్‌లో లేడని నేనెప్పుడూ అనుకోను. ఇలాంటి కఠినమైన పిచ్‌లపైనే కదా.. బ్యాటర్ అసలైన ఫామ్ తెలిసేది’’ అంటూ బుమ్రా వారిద్దరిపై ప్రశంసలు కురిపించాడు. కాగా పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్, కోహ్లి నిరాశపరిచిని విషయం తెలిసిందే. జైస్వాల్ డకౌట్ కాగా.. కోహ్లి 5 పరుగులే చేశాడు.
అయితే, రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టాండ్ బ్యాటర్ జైస్వాల్.. 161 పరుగులతో దుమ్ములేపగా.. కోహ్లి 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఎనిమిది వికెట్లు కూల్చాడు.
ఇక తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక పెర్త్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగియగా.. ఇరుజట్ల మధ్య డిసెంబరు 6- 10 వరకు అడిలైడ్‌లో రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పెర్తు టెస్టు స్కోర్లు
👉భారత్ తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్
👉ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 104 ఆలౌట్
👉భారత్ రెండో ఇన్నింగ్స్:487/6 డిక్లేర్డ్
👉ఆసీస్ లక్ష్యం: 534 పరుగులు
👉ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 238 ఆలౌట్
👉ఫలితం: ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో బుమ్రా సేన భారీ విజయం
Comments
Please login to add a commentAdd a comment