
రాహుల్ ద్రవిడ్‌తో చాపెల్ (ఫైల్ ఫొటో)
India Vs Australia BGT 2023 Test Series: ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియానే గెలుస్తుందని ఆ జట్టు మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అంచనా వేశాడు. స్వదేశంలో టీమిండియాకు కంగారు జట్టు రూపంలో కఠిన సవాల్ ఎదురు కానుందని పేర్కొన్నాడు. కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం కావడం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న చాపెల్.. దీంతో సొంతగడ్డపై టీమిండియా మరింత బలహీనం కానుందని చెప్పుకొచ్చాడు.
కాగా 2020లో ఆసీస్ గడ్డపై టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 9 నుంచి ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఇరు జట్లు మరోసారి పోటీ పడనున్నాయి. అయితే, ఆసీస్ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. సొంత దేశంలో రోహిత్ సేననే ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. స్పిన్ పిచ్‌లపై ఆడేందుకు ఇబ్బందిపడే ఆసీస్ బ్యాటర్లను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని గత ఫలితాలను బట్టి చెప్పవచ్చు.
వాళ్లు లేరు.. టీమిండియా బలహీనం
ఈ నేపథ్యంలో గతంలో భారత జట్టుకు మార్గదర్శనం చేసిన గ్రెగ్ చాపెల్ మాత్రం భిన్నంగా స్పందించాడు. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడిన కారణంగా సొంతగడ్డపై కూడా టీమిండియా బలహీనంగానే కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే వాళ్లు పూర్తిగా విరాట్ కోహ్లిపైనే పూర్తిగా ఆధారపడతారు.
ఆసీస్‌దే ట్రోఫీ
భారం మొత్తం అతడిదే. ఈసారి ఆస్ట్రేలియానే సిరీస్ గెలుస్తుంది’’ అని జోస్యం చెప్పాడు. ఇక ఆస్ట్రేలియా స్పిన్ విభాగం గురించి మాట్లాడుతూ.. ‘‘అక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈసారి అష్టన్ అగర్‌కు ఎక్కువ అవకాశాలు లభిస్తాయనుకుంటున్నా. నాథన్ లియోన్‌తో కలిసి ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ రాణించగలడు’’ అని గ్రెగ్ చాపెల్ అన్నాడు. కాగా భారత జట్టుకు 2005-2007 మధ్యకాలంలో చాపెల్ హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
చదవండి: T20 WC: వచ్చే వరల్డ్‌కప్‌లో కోహ్లి ఆడతాడు.. కానీ రోహిత్ ఉండడు.. అవసరం కూడా లేదు!
Gill-Kohli: 'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా'