రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి
T20 World Cup 2024- Virat Kohli- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 కెరీర్ గురించి మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో హిట్‌మ్యాన్ ఆడే అవకాశం లేదని అంచనా వేశాడు. మాజీ సారథి విరాట్ కోహ్లి మాత్రం ఈ మెగా ఐసీసీ ఈవెంట్‌లో బరిలోకి దిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు.
కాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్-2022లో రోహిత్ కెప్టెన్సీలోని భారత జట్టు సెమీస్ ఫైనల్లోనే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో వరుస విజయాలు నమోదు చేసినప్పటికీ.. మెగా టోర్నీలో మాత్రం ఫైనల్ చేరలేక చతికిలపడింది.
హార్దిక్ సారథ్యంలో
ఇక ఈ ఈవెంట్ తర్వాత పనిభారాన్ని తగ్గించే పేరిట రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిస్తూ వస్తోంది మేనేజ్‌మెంట్. అదే సమయంలో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువకులకు వరుస అవకాశాలు ఇస్తోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ప్రపంచకప్ నాటికి జట్టును పరిపుష్టం చేసే పనిలో ఉంది.
వాళ్లకు రోహిత్, కోహ్లి అవసరం లేదు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. 35 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే తన టీ20 వరల్డ్‌కప్ ఆడేశాడని వ్యాఖ్యానించాడు. ఇక యువకులకు మార్గం సుగమం చేయాలని.. ఈ ఫార్మాట్‌లో వారికి మెరుగైన భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. అయితే, కోహ్లి మాత్రం టీ20లలో కొనసాగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయన్నాడు.
అంతేకాకుండా... ఇప్పటికే యువ క్రికెటర్లకు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం మెండుగా ఉందని.. కాబట్టి కోహ్లి, రోహిత్‌ల మార్గదర్శనం పెద్దగా వారికి అవసరం లేదని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. అందుకే వీళ్లిద్దరు జట్టులో లేకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉందని పేర్కొన్నాడు.
కోహ్లి ఉంటాడు.. రోహిత్ కాదు
ఓ యూట్యూబ్ చానెల్‌లో ఈ మేరకు అభిప్రాయాలు పంచుకున్న వసీం జాఫర్.. ‘‘శ్రీలంక, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లలో కూడా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. వీటి తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, ఆ తర్వాత ఐపీఎల్.. ఆపై వన్డే వరల్డ్‌కప్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఇలాంటి నిర్ణయాలు.
ఇక ఆసీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయాలు పక్కనపెడితే.. ఇక టీ20 ఫార్మాట్..
ఇందులో భవిష్యత్ అంతా యువ ఆటగాళ్లదే. రోహిత్ శర్మ రానున్న టీ20 వరల్డ్‌కప్ ఆడతాడని నేను అనుకోవడం లేదు. అయితే, విరాట్‌కు అవకాశం ఉంది. కానీ రోహిత్ విషయంలో అలా కాదు.. ఇప్పటికే అతడి వయసు 36 ఏళ్లు అనుకుంటా.. కాబట్టి తను మాత్రం కచ్చితంగా వచ్చే ఎడిషన్‌లో ఉండడు’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: Ind Vs Aus: అప్పుడు కోహ్లి లేడు! ఇప్పుడలా కాదు.. టీమిండియాను చూసి ఆసీస్ వణికిపోతోంది! నిదర్శనమిదే..
ILT20: ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్.. ప్లేఆఫ్స్‌కు ఎంఐ ఎమిరేట్స్
Comments
Please login to add a commentAdd a comment