ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో రోహిత్ శర్మ ప్రసంగం
ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా మరో విజయంపై కన్నేసింది. అడిలైడ్‌లో జరుగనున్న రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది.
ఇక ఈ మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా.. కాన్‌బెర్రాలో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టుతో భారత్ రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ (పింక్ బాల్‌తో) ఆడనుంది. శని, ఆదివారాల్లో మనుకా ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, అంతకంటే ముందు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది.
అధికారిక విందు
విదేశీ జట్టు ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు ఆటగాళ్లకు అధికారిక విందు ఇచ్చే సంప్రదాయం ఈసారీ కొనసాగింది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్‌లో ఆల్బనీస్ ఇచ్చిన ప్రత్యేక రిసెప్షన్‌లో టీమిండియా సభ్యులంతా పాల్గొన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు సభ్యులను ఆసీస్ ప్రధానికి పరిచయం చేశాడు.
వాళ్లిద్దరికి ప్రత్యేక అభినందనలు
ఈ క్రమంలో పెర్త్ వేదికగా తొలి టెస్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రాలను ఆల్బనీస్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘అద్భుతంగా ఆడుతున్న భారత జట్టుతో తలపడటం మా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌కు పెద్ద సవాల్’ అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
ఇక పీఎం ఎలెవన్‌కు నాయకత్వం వహిస్తున్న జాక్ ఎడ్వర్డ్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం రోహిత్ శర్మ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్‌లో పాటు ఇతర రంగాల్లోనూ సుదీర్ఘ బంధం ఉందని, ఇక్కడికి వచ్చి ఆడటం తమకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.
ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటి
‘ఆస్ట్రేలియాలో ఆడటం, ఇక్కడి భిన్న సంస్కృతిని ఆస్వాదించడాన్ని భారత ఆటగాళ్లంతా ఇష్టపడతారు. విభిన్న నగరాలు విభిన్న అనుభవాలను ఇస్తాయి.
ఇక మైదానంలో సమరాల గురించి కొత్తగా చెప్పేదేముంది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాతో తలపడి గెలవాలని అంతా కోరుకుంటారు. ఈ పోటీతత్వమే మేం ఇక్కడ మరింత పట్టుదలగా ఆడేలా చేస్తుంది. ఆటతో పాటు పర్యటనను అన్ని రకాలుగా మేం ఆస్వాదిస్తాం.
పింక్ బాల్ టెస్టు
గత వారం చూపిన ప్రదర్శనను మున్ముందు కొనసాగిస్తాం. ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు పూర్తి స్థాయి వినోదం అందించగలమని నమ్ముతున్నాం’ అని రోహిత్ శర్మ అన్నాడు. కాగా డిసెంబర్ 6 నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్‌లో రెండో టెస్టు (డే అండ్ నైట్- పింక్ బాల్) జరుగుతుంది.
చదవండి: అప్పుడు రూ. 20 లక్షలు.. ఇప్పుడు రూ. 11 కోట్లు.. టీమిండియా రైజింగ్ స్టార్ ‘భారీ’ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment