కదలండి ముందుకు.. నిర్భయంగా.. | Security Accessories For Womens Sexual Assaults | Sakshi
Sakshi News home page

కదలండి ముందుకు.. నిర్భయంగా..

Published Thu, Jul 17 2014 3:16 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

కదలండి ముందుకు.. నిర్భయంగా.. - Sakshi

కదలండి ముందుకు.. నిర్భయంగా..

ఢిల్లీలో నిర్భయ.. హైదరాబాద్‌లో అభయ.. ఆడపిల్ల బయటకు వెళ్లిందంటే చాలు ఇంటికొచ్చేవరకూ తల్లిదండ్రులకు టెన్షన్. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో.. ? ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో..? అన్న భయం వారిని అనునిత్యం వెంటాడుతుంది. కారణం.. నిత్యం ఎక్కడో ఒకచోట యువతులపై లైంగికదాడులు జరుగుతుండడం. కామాంధులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. ఏదో ఏ మూల ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి.

తల్లిదండ్రులను బాధిస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో యువతులు స్వీయరక్షణపై దృష్టి సారిస్తున్నారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరి ఆసక్తిని గమనిస్తున్న వివిధ కంపెనీలు రక్షణ కోసం వివిధ రకాల ఉత్పత్తులు చేస్తూ.. మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ వస్తువులన్నీ ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్‌తోపాటు నగరంలోని వివిధ షాపుల్లో లభిస్తున్నాయి. వాటిలో కొన్ని...          
          - కరీంనగర్ క్రైం
 
* మహిళల రక్షణకు మార్గాలనేకం..
* లైంగిక దాడులు ఎదుర్కొనేందుకు కొత్త ఉత్పత్తులు
* ఇప్పటికే వినియోగంలో పెప్పర్ స్ప్రే, మొబైల్ యాప్స్
* అందుబాటులోకి రానున్న బ్రాస్‌లెట్లు, నెక్లెస్‌లు, జాకెట్లు

బజ్జింగ్ యాంటీ రేప్ డివైస్

ఈ అత్యాచార వ్యతిరేక పరికరాన్ని మొబైల్‌గానీ.. బ్యాగ్‌కుగానీ.. చేతికిగానీ.. వేలాడదీసుకోవచ్చు. ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే తప్పించుకునే క్రమంలో ఈ పరికరానికి ఉన్న రాడ్ లాంటిది లాగితే చాలు పెద్ద శబ్దంతో సుమారు 90 డెసిబుల్స్‌తో అలారం మోగుతుంది. ఈ శబ్దంతో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమవుతారు. దుండగులు పారిపోయే అవకాశాలుంటాయి. ఈ డివైస్ చిన్నగా.. అందంగా ఉండడంతోపాటు చూడడానికి అలంకార వస్తువుగా కనిపిస్తుంది. తీసుకెళ్లడం కూడా చాలా సులభం. బరువు తక్కువగా ఉంటుంది.
 
స్మార్ట్‌ఫోన్ యాప్స్...

స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్‌లో పలు రకాల మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అనుకోని ప్రమాదం ఏర్పడినప్పుడు స్పందించే విధానం, కాపాడుకోవడానికి ప్రత్యేకంగా పలు కంపెనీలు యాప్స్ రూపొందించాయి. మీ మొబైల్‌లో ‘విత్ యూ, మైపానిక్ అలారం, ఏఓఎస్ ఎమర్జెన్సీ, గ్లోబల్ ఎస్‌ఓఎస్, అటాక్ అలారం, ఎస్‌ఎంఎస్ వంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
పెప్పర్ స్ప్రే
స్వయరక్షణ కోసం మహిళలు, యువతులు ఎక్కువగా వినియోగిస్తున్న ఉత్పత్తులో పెప్పర్ స్ప్రే ప్రధానమైంది. నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా యువతులు వారి వెంట పుప్పర్ స్ప్రే ఉంచుకోవడం పరిపాటిగా మారింది. దాడి చేయడానికి వచ్చిన వారిపై దీనిని స్ప్రే చేస్తే వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. కళ్లు మంటలు లేస్తాయి. ఆ సమయంలో మహిళలు తప్పించుకోవచ్చు. అన్ని సమయాల్లో దీనిని వెంట తీసుకెళ్లడం సులభం. అందుకే దీనిని చాలామంది వెంట ఉంచుకుంటున్నారు.
 
యాంటీ రేప్ అండర్‌వేర్..
మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ రేప్ ఇన్నర్‌వేర్ ఇది. దీనిని గతేడాది చెన్నైకి చెందిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఎస్‌హెచ్‌ఈ (సొసైటీ హర్నెసింగ్ ఎక్విప్‌మెంట్)ను రూపొందించారు. సాధారణ నైటీ మాదిరిగా కనిపిం చే దీని లో దుస్తుల్లో 3800 కిలో వోల్టుల విద్యుత్‌షాక్ ఇచ్చే సామర్థ్యం ఉంటుంది. వీటికి అమర్చిన జీపీఎస్ పరికరం సహాయంతో బాధితులు ఎక్కడ ఉన్నా.. వెంటనే బంధువులు, పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది.
 
‘సాక్షి‘ అభయ

దాడులకు గురవుతున్న మహిళలు, యువతుల కోసం ‘సాక్షి’ యాజమాన్యం అత్యంత ఆధునిక టెక్నాలజీతో అందుబాటులో ఉండేలా ‘సాక్షి అభయ’ పేరుతో యాప్స్‌ను రూపొందించింది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిని వినియోగించడం కూడా చాలా సులభం. ఒక్క క్లిక్‌తో యాప్స్‌లో ముందే ఉంచిన నంబర్లకు సెకన్లలో సమాచారం వెళ్లిపోతుంది. దీనికి పోలీస్ నంబర్లను ఫీడ్ చేసినా వారికి కూడా మెసేజ్ వెళ్తుంది. ఇది నెట్‌తో పని లేకుండానే పనిచేయడం గమనార్హం.
 
యాంటీ మోల్‌స్టేషన్ జాకెట్
మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులివి. ఏదైన అవాంఛనీయం పరిణామం ఎదురైతే ఈ జాకెట్ మహిళలపై దాడికి చేయడానికి వచ్చిన వ్యక్తులకు విద్యుత్‌షాక్ ఇస్తుంది. రెగ్యులర్ జాకెట్ మాదిరిగా కనిపించే ఈ దుస్తుల బటన్స్ 110 వోల్టుల విద్యుత్‌శక్తిని కలిగి ఉంటాయి. దీని ప్రభావంతో 10 నుంచి 15 నిమిషాల పాటు తేరుకోలేరు. దీంతో అక్కడి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఈ జాకెట్‌ను నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్) విద్యార్థులు రూపొందించారు. డెనిమ్, యాక్రలిన్ రంగుల్లో లభిస్తుంది.
 
యాంటీ రేప్ నెక్లెస్..
ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల యాంటీ రేప్ నెక్లెస్‌లు, బ్రాస్‌లెట్లు అందుబాటులో ఉన్నాయి. అనూహ్య పరిణామాలు ఎదురైతే ఈ బ్రాస్‌లేట్‌కు ఉన్న బటన్ నొక్కితే చాలు.. అందులో ఫీడ్ చేసిన నంబర్లకు ఫోన్‌కాల్ వెళ్తుంది. బటన్ అలాగే నొక్కి పట్టుకుంటే బాధితులు ఏ ప్రాంతంలో ఉన్నారో.. పూర్తి వివరాలతో మెసేజ్ వెళ్తుంది. దాన్ని బట్టి అవతలి వ్యక్తి మీరు ప్రమాదంతో ఉందని గుర్తించి చేరుకునే అవకాశం ఉంది. కొన్ని నెక్లెస్ డివైస్‌లో విద్యుత్ షాక్ ఇచ్చే వాటితో పాటు పెద్ద శబ్దంతో సౌండ్ చేసేవి కూడా ఉన్నాయి. చిన్నగా అందంగా మెడలో వేసుకుని తీసుకెళ్లవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement