తాడులా కనిపించేది ఎప్పుడు పామై కాటేస్తుందో తెలియదు. వెలుగులా గోచరించేది ఎప్పుడు చీకటై ముంచేస్తుందో తెలియదు... అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటారు. ఇందుకు ప్రత్యేకంగా వనరులు సమకూర్చుకోకపోయినా నిత్యజీవితంలో మనం ఉపయోగించే వస్తువులతోనే ‘మహిళల భద్రత’ కు అవసరమైన సాంకేతిక దన్ను అందిస్తుంది శాస్త్రీయజ్ఞానం.
వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటి, తమిళనాడు)కు చెందిన పరిశోధకులు మహిళలకు రక్షణ ఇచ్చే పాదరక్షలకు రూపకల్పన చేశారు.
‘మహిళా భద్రతకు ఎన్నో చట్టాలు ఉన్నా, ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము రూపొందించే పాదరక్షలు ఎంతో భద్రతను ఇస్తాయి’ అంటున్నారు ప్రాజెక్ట్ మేకర్స్.
తమకు తాముగా జాగ్రత్తపడేలా, విపత్కరమైన పరిస్థితులలో రక్షణ పొందేలా చేసే ఈ స్మార్ట్ పాదరక్షలు ఆత్మరక్షణ ఆయుధాలుగా ఉపయోగపడతాయి. ఎటాకర్స్‌పై ప్రతిదాడి చేసే అవకాశం వీటిలో ఉంది.
జీపిఎస్, జీఎస్‌ఎం మాడ్యూల్‌ను ఉపయోగించి ఈ పాదరక్షలను డిజైన్ చేశారు. ‘షూ’లలో జీపిఎస్, జీఎస్‌ఎం మాడ్యుల్ మినియేచర్ వెర్షన్ చిప్‌లను అమర్చుతారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎమర్జెన్సీ–కాంటాక్ట్‌ల కోసం ‘షూ’ను గట్టిగా నొక్కితే సరిపోతుంది. ఎటాకర్‌కు షాక్ ఇవ్వవచ్చు. ‘ఎటాకర్’ను గుర్తించే వీడియో లైవ్ స్ట్రీమింగ్ సాంకేతికత కూడా వీటికి ఉండడం మరో విశేషం.
తాజా విషయానికి వస్తే...
హిమాచల్‌ప్రదేశ్, సొలాన్ జిల్లాలోని జైపీ యూనివర్శిటీ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ (జెయుఐటీ)కి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు సరన్ష్ రోహిల్లా, సాంధిత్య యాదవ్‌లు మహిళలకు రక్షణ ఇచ్చే ‘స్మార్ట్’ షూస్‌ను అభివృద్ధిపరిచారు. ఇవి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ‘కాంటాక్ట్స్’ను అప్రమత్తం చేస్తాయి. లొకేషన్ గురించి తెలియజేస్తాయి.
‘డిజైన్ అండ్ ఎనాలసిస్ ఆఫ్ స్మార్ట్‌షూ ఫర్ వుమెన్ సేఫ్టీ’ పేరుతో పేపర్ సమర్పించారు.
‘మహిళల భద్రతకు సాంకేతిక జ్ఞానాన్ని విరివిగా వాడుకోవాల్సిన సమయం ఇది. ఇందులో మాది ఒక అడుగు’ అంటున్నారు సరన్ష్,సాంధిత్య.
వుమెన్ సేఫ్టీ.. గొప్పగా ‘చెప్పు’కోవచ్చు!
Published Sat, Feb 5 2022 12:28 AM | Last Updated on Sat, Feb 5 2022 12:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment