మహిళల రక్షణకు ప్రాధాన్యం
అతివల రక్షణకు కొత్త సాఫ్ట్‌వేర్
శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
కొత్త సీపీ అమిత్ గార్గ్
విశాఖపట్నం: మహిళల రక్ష ణకు తొలి ప్రాధాన్యమిస్తానని కొత్త పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన సీపీ గా బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ కమిషనరేట్‌లో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ నగరంలో శాంతి భద్రతలు కాపాడానికి అహర్నిశలు శ్రమిస్తానన్నారు. మహిళల రక్షణ కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌లను రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జె.వి.రాముడు ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆయనను డీఐజీ పి.ఉమాపతి, ఎస్పీ కోయ ప్రవీణ్, డీసీపీలు త్రివిక్రమవర్మ, రవికుమార్‌మూర్తి, రాంగోపాల్ నాయక్, ఏడీసీపీలు వరదరాజు, మహేంద్రపాత్రుడు, వెంకటేశ్వరావు, మెరైన్ ఏసీపీ మహ్మద్‌ఖాన్, సీఐలు, ఎస్‌ఐలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
‘ఐ క్లిక్’..మహిళలకు ‘అభయం’
మహిళల రక్షణకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాఫ్ట్‌వేర్‌లను రూపొందించారు. వాటిని నగర మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు ఈ కార్యక్రమాలకు హాజరవుతారు. ఉదయం 11గంటలకు సీఎంఆర్ ప్లాజాలో హోమ్ మంత్రి ‘ఐ క్లిక్ కౌసిక్’ సాంకేతిక పరికరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పోలీస్ కమిషనరేట్‌లో ఐ క్లిక్‌కు సంబంధించిన సీ అండ్ సీ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. సీఎఆర్‌లో జరిగే ‘అభయం’ ఆవిష్కరణ సభలో పాల్గొని సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించి ప్రసంగిస్తారు. రాష్ట్ర మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఐ క్లిక్ పరికరాలను నగరంలోని షాపింగ్‌మాల్స్, ఏటీఎం సెంటర్లు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆపదలో ఉన్న మహిళలు ఈ పరికానికి ఉంటే బటన్ నొక్కితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సీ అండ్ సీ సెంటర్ ఈ మొత్తం ఆపరేషన్‌ను సమన్వయం చేస్తుంది. ‘అభయం’ సాఫ్ట్‌వేర్‌ను స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని ఐదు మొబైల్ నెంబర్లను దానిలో నిక్షిప్తం చేసుకుంటే ఆపదలో ఉన్నప్పుడు ఆ నంబర్లకు ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో సమాచారం వెళుతుంది. ఈ సదుపాయాల గురించి మహిళలకు అవిగాహన కల్పించడం కోసం విస్తృత ప్రచారం కల్పించనున్నారు.