బాధ్యత ఎవరు తీసుకోవాలి | Laws On Protecting Women Should Be Made More Stringent | Sakshi
Sakshi News home page

బాధ్యత ఎవరు తీసుకోవాలి

Published Mon, Dec 2 2019 3:17 AM | Last Updated on Mon, Dec 2 2019 3:21 AM

Laws On Protecting Women Should Be Made More Stringent - Sakshi

స్త్రీలను గౌరవించాలి. వారు భద్రమైన వాతావరణంలో ఉండాలి.వారికి అనుక్షణం రక్షణ ఇచ్చే వ్యవస్థ ఉండాలి. వారిని లైంగిక వస్తువులుగా చూడని సంస్కారం పురుషులలో ఏర్పడాలి. ఇందుకు ఎవరు పూనుకోవాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? తల్లిదండ్రులా? టీచర్లా? పోలీసులా?

‘ధైర్యం, స్వేచ్ఛ ఎంత ముఖ్యమో పరిస్థితులను ఎరిగి జాగ్రత్తలో ఉండడం కూడా అంతే ముఖ్యం’ ‘దిశ’ హత్య సంఘటన నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో కనిపించిన ఒక కామెంట్‌ అది. ఈ కామెంట్‌లో వాస్తవం ఉంది. ‘దిశ’ ఘటనలోగాని,  వరంగల్‌లో కారులో అత్యాచారం జరగడం వల్ల షాక్‌కు గురై మరణించిన మానస విషయంలోగాని జరిగింది అదే. పరిస్థితులను ఎరిగి జాగ్రత్తలో లేకపోవడం. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగాక మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలను మరింత కట్టుదిట్టం చేశారు. కొత్త చట్టాన్నీ తెచ్చారు.

అయినా లైంగిక దాడులతో కూడిన హత్యలు ఆగడం లేదు. ఇందులో సమాజంలో స్త్రీల పట్ల పేరుకునిపోయిన క్రూర దాడి స్వభావంతో పాటు మహిళలు తామున్న పరిస్థితిని గుర్తెరిగి ప్రవర్తించకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఒక తప్పుకు కేవలం ఒకరు మాత్రమే బాధ్యత వహించవలసిన పని లేదు. సమష్టిగా బాధ్యత వహించాల్సిందే. అందులో తల్లిదండ్రులు, టీచర్లు, పోలీసులు.. ఈ అన్ని వ్యవస్థల సంరక్షణా కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన ప్రభుత్వం కూడా ఉంది.

ఎందుకు?
మంచి జీవితం కోసం ఇప్పుడు అమ్మానాన్నా ఇద్దరూ జీతం తేవాల్సిందే. పిల్లలకు ‘మంచి’ చదువు ఇప్పించడం కోసం ప్రైవేట్‌ స్కూల్లో వేయాల్సిందే. బాగా చదువుచెప్పే పనిలో ఆ స్కూళ్లూ పిల్లలను దాదాపు ఉదయం ఏడు నుంచి సాయంకాలం ఆరుగంటల దాకా ఎంగేజ్‌ చేస్తున్నాయి. దీంతో పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో కంటే స్కూల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇంటికొచ్చాక కూడా స్కూల్‌ ఇచ్చిన పనిలో కొంతసేపు ఉండి, మిగిలిన కాసేపు సోషల్‌ మీడియా బడిలో సేద తీరుతున్నారు. కాలేజ్‌ పిల్లల షెడ్యూల్‌ కూడా ఇంచుమించు ఇలాగే ఉంది కొంత మార్పుతో. ఏతావాతా పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయ పరిమాణం, సమయ నాణ్యత గణనీయంగా తగ్గింది. తల్లిదండ్రుల పాత్రను టీచర్లే పోషించాల్సిన అవసరం ఏర్పడింది.

అలాగని పిల్లల సమయం ఎక్కడోఒకచోట పూరింపబడుతోంది కదా అని సంతోషపడాల్సిన ముచ్చట లేదు. ప్రైవేట్‌ లేదా కార్పొరేట్‌ స్కూళ్లు పిల్లలను తెలివైన విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని తల్లిదండ్రులకు మాటిస్తాయి తప్ప మంచి విద్యార్థిగా అని కాదు. తల్లిదండ్రుల షరతు కూడా తెలివైన బిడ్డలు కావాలనే. మంచి పిల్లలు అని కాదు. ఇక ప్రభుత్వ పాఠశాల విషయానికి వస్తే.. వికాసవంతమైన విద్య, క్రీడా విద్య, ఆరోగ్యం, లైఫ్‌ స్కిల్స్‌ మొదలైనవన్నీ కరిక్యులమ్‌లో భాగాలే. ప్రతి యూనిట్, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షల్లో పై వాటికీ మార్కులుంటాయి. ప్రతి విద్యార్థి ప్రవర్తనను, ఆరోగ్య, మానసిక దృఢత్వాన్ని పరీక్షించే మార్కులు వేయాలి. కాని ప్రాక్టికల్‌గా అలా ఉండదు.

ఎందుకంటే చాలా ప్రభుత్వ పాఠశాలలు దాదాపుగా ఇద్దరు టీచర్ల నిర్వహణలో నడుస్తున్నాయి. ఈ స్థితిలో మొక్కుబడిగా మార్కులివ్వడం తప్పిస్తే పరీక్షించి రిపోర్ట్‌ రాయడం కుదరని పని. ఈ కరిక్యులమ్‌కు రూపకల్పన చేసిన ప్రభుత్వ సిబ్బందికీ ఆ విషయం తెలుసు. ఇక పోలీసులు.. సమాజంలోని కుల, మత, వర్గ, లింగ వివక్ష చూపకుండా, చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ రక్షణ చూసుకోవాల్సిన వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి నుంచి విధానాలు రూపొందే అసెంబ్లీ (రాష్ట్రం వరకు మాట్లాడుకుంటే) వరకు శాంతి, భద్రతల బరువును మోయాల్సిన వారు. అంటే పిల్లలకు సంబంధించి పేరెంటింగ్‌ పాత్రనూ చేపట్టాల్సిన వారు.

వీటన్నిటినీ సమన్వయం చేయాల్సిన ప్రభుత్వమూ ఉమ్మడి కుటుంబంలో పెద్ద వాళ్ల భూమికను పోషించాలి. ఆడవాళ్ల మీద హింస తగ్గించడానికి, అలాంటి నేరాలు జరిగినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా పోలీసులను సంప్రదించడానికి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అది – ఆ జిల్లాలోని స్కూళ్ల నుంచి అమ్మాయిలను ఎంపిక చేసి వారానికి ఒకరోజు ఆ ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జిగా పెట్టడం. దీనివల్ల నేరాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా రిపోర్ట్‌ చేయాలి వంటి వాటి మీద అమ్మాయిలకు అవగాహన పెరగడమే కాక భయం పోతుంది. పోలీసులు సున్నితంగా వ్యవహరించే వీలుంటుంది అని. ఇలాంటివి ఇక్కడా ప్రయోగించవచ్చేమో. ‘దిశ’ ఘటన నేపథ్యంలో ఆయా వర్గాలు ఏమంటున్నాయో చూద్దాం.

ఒక్కోనెల ఒక్కోరంగంలోని నిపుణుడితో సెషన్‌ పెట్టించాలి
పేరెంట్స్‌ అయినా టీచర్స్‌ అయినా ముందు పిల్లలను మార్కుల కోసం వత్తిడి చేయడం ఆపాలి. వారి లైఫ్‌ స్కిల్స్‌ పట్ల దృష్టి పెట్టాలి. ఇంతకుముందు ఇంట్లోంచి ఇవి అందేవి. ఇప్పుడు స్కూల్లో అందేలా చూడాలి.  ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు శ్రద్ధ పెట్టే టైమ్‌లేక నైతికవిద్య, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, జీవన నైపుణ్యాలు వంటి అంశాలను కూడా మామూలు పరీక్షల్లాగే భావించి అందరికీ ఒకే రకంగా మార్కులు వేసి పాస్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చేయడం నిజంగా ఏ టీచర్‌కూ ఇష్టం ఉండదు. బాధగానే ఉంటుంది. కాని ఏం చేస్తాం? నేను కోరేది ఒక్కటే.. ప్రతి స్కూల్లో ప్రతి నెల ఆయా రంగాల్లోని నిపుణులను పిలిపించి ఆ రోజు పిల్లలతోపాటు, టీచర్లు, పేరెంట్స్‌కి కూడా  క్లాస్‌ ఇప్పించాలి. అంటే కౌన్సిలింగ్‌ సెషన్‌లా ఉండాలన్నమాట.

– గాజోజు నాగభూషణం, మన్నెపల్లి ప్రాథమిక పాఠశాల
ప్రధానోపాధ్యాయుడు, కరీంనగర్‌ జిల్లా.

విపరీతంగా ప్రచారం చేయాలి
ఈరోజు ప్రతి వాళ్లకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ దినచర్యలో ప్రయాణం తప్పనిసరి అయింది. నేరాలు జరిగే అవకాశం కూడా ఈ మూమెంట్‌లోనే ఎక్కువ.  ఒక ప్రొడక్ట్‌కి మార్కెట్‌లో ఎలా అయితే ప్రచారం జరుగుతుందో అలాగే ఈ సేఫ్టీ అండ్‌ సెక్యురిటీని కూడా మార్కెటైజ్‌ చేయాలి అంటాను. వాట్సప్‌లో అప్పుడప్పుడూ కొన్ని మెసేజెస్‌ వస్తూంటాయి.. ఫలానా దేవుడి నామాన్ని 108 మందికి ఫార్వర్డ్‌ చేయండి.. లేదంటే ఏదో అవుతుంది అనుకుంటూ! అదిగో ఆ స్థాయిలో ఈ సేఫ్టీ అండ్‌ సెక్యురిటీ ప్రచారం సాగాలి. ఇంటి నుంచి డెస్టినేషన్‌కు వెళ్లే దారిలో ప్రజల దృష్టి పడే చోట్లంతా దీనికి సంబంధించిన పత్రాలను, హోర్డింగ్స్‌ను పెట్టాలి. పేరెంట్స్, టీచర్స్, పోలీసులు అని కాకుండా అందరం దీన్నో క్యాంపెయిన్‌లా ముందుకు తీసుకుపోవాలి.

– సుమతి, ఐపీఎస్‌

పేరెంట్స్‌ మీటింగ్‌కి కూడా హాజరు కావడం లేదు
నిజమే .. స్కూల్లో టీచర్‌ పేరెంట్‌ పాత్ర పోషించాలి. పోషిస్తున్నాం కూడా. కాని ఇంట్లో తల్లిదండ్రులూ శ్రద్ధ పెట్టాల్సిందే. పాఠాలు ఎంత ముఖ్యమో.. బతుకు పాఠాలు అంతకన్నా ముఖ్యం. నేను ప్రతి క్లాస్‌లో లెసన్‌ చెప్పేకంటే ముందు పదినిమిషాలు జనరల్‌ విషయాల గురించే పిల్లలతో మాట్లాడ్తా. వాళ్ల అబ్జర్వేషన్స్‌ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా. దాంతో వాళ్ల ఆలోచనా ధోరణి తెలుస్తుందని. ఏ కొంచెం తేడా అనిపించినా తల్లిదండ్రులతో మాట్లాడొచ్చు అని. ఇవి కరిక్యులమ్‌లో భాగమైనా కాకపోయినా ఓ టీచర్‌ పాఠంలో భాగం కావాలని అనుకుంటా, నమ్ముతా, అమలుచేస్తా. ఇలాంటి ఎక్సర్‌సైజ్‌ ఇంట్లోనూ జరగాలి. పేరెంట్స్‌ మీటింగ్‌లో పిల్లల మార్కులనే కాదు ప్రవర్తననూ డిస్కస్‌ చేస్తా. అందుకే పేరెంట్‌ మీటింగ్‌కి తప్పకుండా తల్లి, తండ్రి ఇద్దరూ హాజరుకావాలి. కాని వాస్తవం ఏమిటంటే తల్లిదండ్రులకు అందుకోసం కూడా టైమ్‌ ఉండటం లేదు.

– కె. కవిత, ప్రభుత్వ టీచర్, మనోహరాబాద్, మెదక్‌ జిల్లా.

ఇంగితాన్ని నేర్పాలి
కొన్ని పరిస్థితుల్లో గుడ్డిగా నమ్మడం కంటే అనుమానించడమే మంచిది అని ఇంగ్లిష్‌ సామెత. అయితే అబ్బాయిల కన్నా అమ్మాయిల్లో నమ్మకం పాలు ఎక్కువని సైంటిఫిక్‌గా రుజువైంది. అమ్మాయిల్లో విడుదలయ్యే కొన్ని హార్మోన్సే ఇందుకు కారణం. జాలి, దయ, సహాయం చేస్తుంటే వారించలేనితనాన్ని ఈ హార్మోన్లు ప్రేరేపిస్తూంటాయి. కాని ఎల్లవేళలా ఇది మంచిదికాదు కదా. ఏ పరిస్థితికి ఆ పరిస్థితి వేరు అనే స్పృహను, ఎవరినీ అంతలా నమ్మకూడదు అనే అవగాహనను పెంచాలి.

ప్రతి సంఘటనను దేనికదే విడిగా చూడాలనే ఇంగితాన్నీ నేర్పాలి. ఇది స్కూల్లో పాఠంగా మారాలి. ఎనిమిదేళ్లు నిండిన ప్రతివాళ్లకు చెప్పాలి. అమ్మాయిలకు కూడా శారీరక దృఢత్వంతోపాటు మానసిక దృఢత్వమూ అవసరం అనే ఎరుకను పెంచాలి. శిక్షణనూ ఇవ్వాలి. ప్రతిరోజు అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చ ఒకటి చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్లను ఎలా సంప్రదించాలో చెపుతూ అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రవర్తించాల్సిన తీరునూ వివరించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి అమ్మాయి తనకు నిర్భయలాంటి ప్రమాదకర స్థితి పొంచి ఉందనే జాగరూకతతో వ్యవహరించాలి.

– కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement