‘దిశ’ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్
సాక్షి, షాద్‌నగర్: దేశవ్యాపంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ విషాదాంతానికి నేటితో రెండేళ్లు పూర్తయ్యా యి. నలుగురు మృగాళ్ల వికృత చేష్టలకు ఆమె అసువులుబాసినా మహిళా రక్షణ చట్టాలకు ‘దిశా’నిర్దేశం చేసింది. ఆమె మరణించిన కూతవేటు దూరంలోనే ఆ నలుగురికీ పడిన శిక్ష చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై.. షాద్‌నగర్ శివారులో ముగిసి.. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించిన ఈ ఘటనను ఓసారి నెమరువేసుకుంటే..
చదవండి: ‘దిశ’ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు
సరిగ్గా రెండేళ్ల క్రితం
2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో దిశ అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపి పని మీద వెళ్లి నలుగురు నరహంతకుల కంట పడింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకుని ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసింది. కాపుకాసిన ఆ నలుగురు ఆమెను బలవంతంగా ఓ పాడుబడిన ప్రహరీ పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి అంతమొందించారు. నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని లారీలో తెచ్చి షాద్‌నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు.
2019 డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం దిశను హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్థలికి తీసుకొచ్చారు. పోలీసులపై దాడి చేసి వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం మరో సంచలనం అయింది. దిశ హత్య ఘటన ఎంతగా కదిలించిందంటే ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరూ సమర్థిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాదు ఈ హత్యోదంతం చట్టాలకు దిశానిర్దేశం చేసింది.
కొత్త చట్టాలకు రూపకల్పన
దుర్మార్గుల చేతిలో కిరాతకంగా బలైన దిశ పేరిట ప్రభుత్వాలు కొత్త చట్టాలను తీసుకొచ్చాయి. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లు, పోలీసు వ్యవస్థను రూపొందించారు. ఇలాంటి సంఘటనలపై వేగంగా తీర్పు ఇచ్చి నిందితులకు శిక్షలు అమలయ్యేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఆడ పిల్లలు ఎక్కడున్నది వాహనాల ద్వార ఎక్కడికి వెళ్తున్నది ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని రక్షించేలా ప్రత్యేక యాప్‌లను క్రియేట్ చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలను కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతం చేశారు.
ఇదీ పరిస్థితి
దిశ ఘటన తర్వాత కొంత మార్పు వచ్చినా ఇంకా పూర్థి స్థాయిలో రాలేదని చెప్పాలి. ఈ సంఘటన తర్వాత కూడా ఆగడాలు అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రాజధాని సాక్షిగా జరిగిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య ఉదంతమే ఇందుకు ఉదాహరణ. మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపుల వంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో పూర్తి స్థాయిలో చైతన్యం రాకపోవడం.. పోలీసులు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో దుర్మార్గుల నుంచి రక్షణ పొందలేకపోతున్నారు. ఏది ఏమైనా దిశ హత్యోదంతం పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మార్పునకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి.
సాగుతున్న విచారణ
దిశ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులకు శిక్ష అమలైంది. ఇది తమను తాము రక్షించుకోవడంలో భాగంగా చేసిందని పోలీసులు చెబుతున్నా దీనిలో నిజానిజాలు తేల్చే దిశగా మానవ హక్కుల కమిషన్ కోర్టు విచారణ కొనసాగుతున్నాయి. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ వేసింది. కమిటీ సభ్యులు ఇప్పటికే ఎంతో మందిని విచారించారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment