సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసు లోని నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించిన నేపథ్యంలో వీరిపై నేరాభియోగపత్రం (చార్జిషీటు) దాఖలు చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే సైబరాబాద్ పోలీసులు చార్జిషీటు స్థానంలో ఫైనల్ రిపోర్టును సమర్పించనున్నారని సమాచారం. నవంబర్ 27న శంషాబాద్ తొండుపల్లి టోల్‌గేట్ వద్ద ‘దిశ’అపహరణ, హత్య నుంచి డిసెంబర్ 6న చటాన్‌పల్లిలో నిందితుల ఎన్‌కౌంటర్ వరకు జరిగిన ఘటనలన్నింటిని వివరిస్తూ షాద్‌నగర్ కోర్టుకు ఫైనల్ రిపోర్టు సమర్పించనున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ కేసులో నిందితులకు వేగంగా శిక్ష పడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఆరంభానికి ముందే నిలిచిపోయింది.
చదవండి: దిశ: ఆ మృతదేహాలను ఏం చేయాలి?
కోర్టు ఏర్పాటు ప్రకటన అనంతరం నిందితులంతా హతమవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ఫైనల్ రిపోర్టును రూపొందించే పనిలో పడ్డారు. ఇది సమర్పించాక ఇక దర్యాప్తు దాదాపుగా ముగిసినట్లేనని ఓ సీనియ ర్ అధికారి వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్‌పై విచారణ చేయడానికి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణను కొనసాగించనుంది. ఇక ఎన్‌కౌంటర్ బూటకమంటూ సుప్రీంకోర్టులు పలు పిటిషన్లు దాఖలు కావడంతో దీనిపై విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిషన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కమిటీ వారం రోజుల్లోపు నగరానికి రావొచ్చని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ కమిషన్ సిఫార్సు మేరకే నిందితుల మృతదేహాల అప్పగింతపై తుది నిర్ణయం ఉంటుంది. అయితే తమ కుమారుల మృతదేహాలు త్వరగా అప్పగించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment