
సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్న సమయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల 6న ఉదయం దాదాపు 5:45 గంటల నుంచి 6:15 గంటల మధ్య దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు ఇప్పటికే పేర్కొనగా ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో కచ్చిత సమయం నమోదైంది. దీని ప్రకారం ఎన్‌కౌంటర్ ఘటనపై అదే రోజు ఉదయం 8.30 గంటలకు పోలీసులపై దాడి విషయాన్ని షాద్‌నగర్ ఏసీపీ వి. సురేందర్ షాద్‌నగర్ పోలీసు స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో ఎన్‌కౌంటర్ జరిగిన సమయాన్ని ఉదయం 6:10 గం.గా పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఈ సమయమే ప్రామాణికం కానుంది. ఈ ఫిర్యాదును ఎస్సై దేవరాజు స్వీకరించి క్రైం నంబర్ 803/2019గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
దాడి, ఆయుధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులుపై కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ను ఉదయం 9.30 గంటలకల్లా షాద్‌నగర్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌కు పంపించారు. దిశకు సంబంధించిన ఆధారాల కోసం ఈ నెల 6న ఉదయం 5:30 గంటలు దాటిన తరువాత నిందితులను చటాన్‌పల్లిలోని ఘటనా స్థలానికి పోలీసులు తీసుకెళ్లడం, నిందితులు పోలీసుల ఆయుధాలు లాక్కొని కాల్పులు జరపడం, పోలీసుల ఎదురుకాల్పుల్లో వారు హతమవడం తెలిసిందే.
అత్యాచారాన్ని నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక
ఫోరెన్సిక్ నివేదికలో దిశపై అత్యాచారం నిజమేనని తేలింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఫోరెన్సిక్ టీం దిశ దుస్తులు, వస్తువులు, నిందితులు ఉపయోగించిన లారీలో గుర్తించిన రక్తపు మరకలు, వెంట్రుకలు, దుస్తులకు అంటిన వీర్యపు మరకల ఆనవాళ్లను సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తరువాత వారి నుంచి సేకరించిన శాంపిళ్లతో అవి సరిపోలినట్లు తెలియవచ్చింది. దీంతో దిశపై అత్యాచారం జరిపింది ఈ నలుగురేనన్న విషయం శాస్త్రీయంగా నిరూపితమైంది. అలాగే చటాన్‌పల్లి అండర్‌పాస్ వద్ద లభించిన కాలిన మృతదేహం దిశదేనని ఫోరెన్సిక్ బృందం తేల్చిందని, మృతదేహం నుంచి సేకరించిన స్టెర్నమ్ బోన్ డీఎన్‌ఏ దిశ తల్లి దండ్రులతో సరిపోలిందని సమాచారం. ఈ మేర కు ఫోరెన్సిక్ బృందం తమ నివేదికను దర్యాప్తు అధికారులకు సమర్పించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment