ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్‌ | Disha Case Supreme Court Orders Inquiry Into Encounter Of Accused | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్‌

Published Fri, Dec 13 2019 1:35 AM | Last Updated on Fri, Dec 13 2019 4:09 AM

Disha Case Supreme Court Orders Inquiry Into Encounter Of Accused - Sakshi

సిర్పుర్కర్‌, రేఖా ప్రకాశ్‌, కార్తికేయన్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై సుప్రీంకోర్టు న్యాయ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పుర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ న్యాయ విచారణ చేపడుతుందని పేర్కొంది. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ బాల్డోట, సీబీఐ మాజీ డైరెక్టర్‌ డి.ఆర్‌.కార్తి కేయన్‌ ఇందులో సభ్యులుగా ఉంటారని తెలిపింది. హైదరా బాద్‌ కేంద్రంగా పనిచేసే ఈ కమిషన్‌.. విధులు ప్రారంభించిన తొలి రోజు నుంచి ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పిస్తుందని వెల్లడించింది. అప్పటి వరకు ఏ ఇతర కోర్టులూ ఎన్‌కౌంటర్‌ మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌.ఎ. బాబ్డే నేతృత్వంలోని జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురు వారం ఆదేశాలు జారీచేసింది. నిందితులను బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని, బాధ్యు లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిం చాలని కోరుతూ జి.ఎస్‌.మణి, ప్రదీప్‌కుమార్‌ యాదవ్, ఎంకే శర్మ, మనోహర్‌లాల్‌ శర్మలు దాఖలు చేసిన మూడు పిటి షన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.


మీరు తప్పు చేశారని మేం అనడంలేదు. కానీ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ న్యాయ విచారణ జరిపిస్తున్నాం.
– సుప్రీంకోర్టు 

వాదనలు విన్న అనంతరం.. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నం దునే కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ‘కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ యాక్ట్‌– 1951’ ద్వారా దఖలుపడిన అధికారాలన్నీ ఈ కమి షన్‌ కలిగి ఉంటుందని వెల్లడించింది. కమిషన్‌కు హైదరాబాద్‌లో కావాల్సిన కార్యాలయం, వసతి, సచివాలయ సిబ్బంది, రవాణా వసతిని కమిషన్‌ సూచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సమకూర్చాలని ఆదేశించింది. అలాగే కమిషన్‌కు సీఆర్‌పీఎఫ్‌ భద్రత కల్పించాలని సూచించింది. కమిషన్‌కు కౌన్సిల్‌గా న్యాయవాది కె.పరమేశ్వరన్‌ వ్యవహరిస్తారని పేర్కొంది. నిందితుల మృతదేహాలు భద్రపరచాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టంచేసింది.

ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నల వర్షం..
అంతకుముందు ఈ పిటిషన్లపై తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ సుదీర్ఘ వాదనలు వినిపించారు. గంటపాటు సాగిన విచారణలో తొలుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ ఎ.బాబ్డే.. ముకుల్‌ రోహత్గీపై ప్రశ్నల వర్షం కురిపించారు. దిశ హత్యోదంతం సంఘటన రోహత్గీ వివరిస్తుండగా.. పిటిషన్‌ కేవలం ఎన్‌కౌంటర్‌కు సంబంధించినదని ధర్మాసనం ప్రస్తావించడంతో ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును రోహత్గీ నివేదించారు. ‘పోలీసులు నిందితులను తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో క్రైమ్‌ సీన్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలికి సంబంధించిన మొబైల్‌ వంటి వస్తువులను సేకరించారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా ఘటన తీరును తెలుసుకునే క్రమంలో విచారిస్తుండగా నిందితులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఆయుధాలను లాక్కుని కాల్చడం ప్రారంభించారు’ అని తెలిపారు. జస్టిస్‌ బాబ్డే జోక్యం చేసుకుని ‘పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కునే పరిస్థితి ఉంటుందా?’ అని ప్రశ్నించారు.

దీనికి రోహత్గీ బదులిస్తూ.. ‘రాళ్లతో దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు. పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి’ అని బదులిచ్చారు. మరి దీనికి సంబంధించి మెడికల్‌ రిపోర్ట్‌ ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని రోహత్గీ చెప్పారు. నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లిన పోలీసు అధికారుల ర్యాంక్‌(హోదా) ఏంటని, కాల్పులు జరిపిన అధికారుల ర్యాంక్‌ ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏసీపీ నేతృత్వంలో సీఐ, ఎస్‌ఐ ర్యాంకులతో కూడిన అధికారుల బృందం అక్కడికి వెళ్లిందని రోహత్గీ వివరించారు. నిందితులు పిస్టల్‌ను, రాళ్లను ఒకేసారి ఎలా వినియోగించారని జస్టిస్‌ బాబ్డే ప్రశ్నించారు. వారు కాల్పులు జరిపారా? జరిపితే ఆ బుల్లెట్లను సేకరించారా? వాటిని ఎక్కడ దాచారు? అంటూ ప్రధాన న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు రోహత్గీ వివరంగా సమాధానాలు చెప్పారు. ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు చంపారని, వారికి వేరొక మార్గం కనిపించలేదని వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సిట్‌ నిష్పాక్షిక విచారణ జరుపుతోందని, ఆ నివేదిక వచ్చాక అవసరమైన పక్షంలో తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని నివేదించారు. అయితే ఈ సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపిస్తే వచ్చే ఇబ్బందేంటని ధర్మాసనం ప్రశ్నించింది.

సమాంతర దర్యాప్తు వీలుకాదు
ఇప్పటికే పీయూసీఎల్‌ కేసులో సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాలన్నీ అమలు చేశామని, ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, పోలీస్‌ కమిషనర్‌ నేతృత్వంలో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌) దర్యాప్తు జరుపుతోందని రోహత్గీ వివరించారు. దర్యాప్తు స్వతంత్రతపై విశ్వాసం లేనప్పుడే ఎన్‌హెచ్‌ఆర్సీ జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు మార్గదర్శకం ఉన్నప్పటికీ, దానిని కాదని ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ జరుపుతోందని తెలిపారు. ఒకవైపు సిట్‌ ఈ కేసులో దర్యాప్తు జరుపుతుండగా మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో సమాంతర దర్యాప్తు సాధ్యం కాదని పేర్కొన్నారు. ‘పోలీసులపై తిరగబడి వారిపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నిందితులు ఇద్దరు పోలీసు అధికారుల నుంచి ఆయుధాలు లాక్కుని కాల్పులకు దిగడంతో పోలీసులు ప్రతిఘటనగా ఈ కాల్పులు జరిపారు’ అని రోహత్గీ వివరించారు.

ఈ విచారణ హాస్యాస్పదం...
‘పోలీసులపై హత్యాయత్నానికి దిగారంటూ చనిపోయిన వారిని నిందితులుగా చేర్చి విచారణ జరుపుతున్నామంటూ చెప్పడం దర్యాప్తును నీరుగార్చడమే. ఇక్కడ ప్రాసిక్యూషన్‌ విట్‌నెస్‌ ఎక్కడుంది? ఇది విచారణ ఎలా అనిపించుకుంటుంది. విశ్వసనీయతతో కూడిన అంశంగా దీనిని చూడాలి. మీరు మాట్లాడుతున్న విచారణకు అర్థం లేదు. నిందితులు లేరు. శిక్ష ఉండదు. మీ రక్షణ కోసమే నిర్వహించే విచారణ అవుతుంది. మీరేమీ చేయలేదని ఎవరు చెబుతారు? ఎవరి సాక్ష్యం ఆధారంగా చెబుతారు? ఈ విచారణ హాస్యాస్పదం అవుతుంది. ఈ విషయంలో మీరు స్టేట్స్‌మెన్‌లా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. ఇది పరిహాసం కాకూడదు’ అని జస్టిస్‌ బాబ్డే పేర్కొన్నారు.

మీరు దోషులని మేమనడం లేదు
‘మీరు తప్పు చేశారని మేం అనడంలేదు. కానీ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తప్పనిసరిగా నిజాలు తెలియాలి. అందుకే ఈ న్యాయ విచారణ జరిపిస్తున్నాం.. వాస్తవాలు ఇవి అని మేం ఊహించజాలం. నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. 
న్యాయ విచారణ జరగనివ్వండి. ఈ విషయంలో మీరు ఎందుకు అభ్యంతరపెడుతున్నారు’ అని ధర్మాసనం ప్రశ్నించింది. కానీ ఎన్ని ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించగలమని న్యాయవాది రోహత్గీ వాదించారు. ‘ఒకవైపు సిట్‌ దర్యాప్తు చేస్తోంది. ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా విచారిస్తోంది. ఇంకా ఎన్ని విచారణలు జరుగుతాయి?’ అని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ బాబ్డే స్పందిస్తూ ‘సిట్‌.. ఈ కమిషన్‌కు సహకరించవచ్చు. సాక్ష్యాలను సమర్పించవచ్చు’ అని సూచించారు. దీనిపై రోహత్గీ స్పందిస్తూ.. ‘కమిషన్‌ను నియమిస్తే హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణలను నిలుపుదల చేయండి’ అని నివేదించారు.

మీడియాను నియంత్రించండి: పిటిషనర్‌
‘దిశ హత్యోదంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇదిగో సాక్ష్యం, అదిగో సాక్ష్యం అంటూ మీడియా అనవసరంగా ప్రసారాలు చేసి కేసుపై ప్రభావం చూపింది. ప్రజలను రెచ్చగొట్టేలా చేసింది’ అని పిటిషనర్లలో ఒకరైన మనోహర్‌లాల్‌ శర్మ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో ధర్మాసనం స్పందిస్తూ ‘విచారణ కమిషన్‌ విచారణ జరుపుతున్నప్పుడు మీడియా పబ్లిసిటీ ఇవ్వకుండా నియంత్రించాలని, విచారణపై కామెంట్లు చేయడం ఆపేలా నియంత్రించాలని సలహా వచ్చింది. అయితే ఈ విషయంలో ఆదేశాలు జారీ చేసేముందు సంబంధిత మీడియా అభిప్రాయం కూడా తీసుకోవాలని రోహత్గీ చెప్పారు. ఈ దిశగా మేం 
అభిప్రాయం కోరుతూ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, పీటీఐకి నోటీసులు జారీ చేస్తున్నాం. దీనికి నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలి’ అని పేర్కొంది. కాగా పీటీఐని ఇంప్లీడ్‌ చేసేందుకు వీలుగా దరఖాస్తు చేసుకునేందుకు మనోహర్‌లాల్‌ శర్మకు స్వేచ్ఛ ఇస్తున్నట్టు ఆదేశాల్లో స్పష్టంచేసింది. అలాగే ఈ కేసులో ప్రతివాది అయిన కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement