సాక్షి, షాద్‌నగర్ టౌన్: దిశ కేసు, నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి అడిషనల్ రిపోర్టును పోలీసులు షాద్‌నగర్ కోర్టుకు సమర్పించారు. దిశ కేసులో నిందితుల కస్టడీ, రిమాండ్ కాలం పూర్తి కావడంతో కేసుకు సంబంధించిన వివరాలు కోర్టుకు తెలియజేయాల్సిన నేపథ్యంలో పోలీసులు అడిషనల్ రిపోర్టును సమర్పించినట్లు సమాచారం. దిశ హత్యాచారం తర్వాత , నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన విషయం విదితమే. నిందితుల ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు, మృతుల వివరాలు, నిందితుల నుంచి సేకరించిన ఆధారాల వివరాలన్నింటినీ పేర్కొంటూ అడిషనల్ రిపోర్టును పోలీసులు కోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత తుది రిపోర్టును కోర్టుకు అందజేయనున్నట్లు తెలిసింది.
దారి మూసివేత..
ఎన్‌కౌంటర్ చేసిన ఘటనా స్థలానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు దారి మూసేశారు. చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గరి నుంచి ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనా స్థలానికి చెట్ల, పొలం గట్ల మధ్యలో నుంచి దారి ఉంది. ఘటనా స్థలానికి ఎవరూ వెళ్లకుండా ఇనుప కంచె ఏర్పాటు చేశారు. పోలీ సులు ఘటనా స్థలం వద్ద గుడారాన్ని ఏర్పాటు చేసుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఎన్‌కౌంటర్‌పై పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కె.సజయ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తోసిపుచ్చింది. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని, మృతదేహాలు పాడవకుండా ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది బృందా గ్రోవర్ అభ్యర్థించగా.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్‌ను నియమించామని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ అభ్యర్థన మేరకు హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను ధర్మాసనం కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment