సాక్షి, హైదరాబాద్: ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఎన్‌కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను తొలిసారిగా త్రిసభ్య కమిటీ విచారించనుంది. ఇప్పటికే సజ్జనార్‌కు సమన్లు జారీ చేసిన కమిషన్.. మంగళవారం లేదా బుధవారం రోజున విచారణ చేయనున్నట్లు సమాచారం. దిశ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) సమర్పించిన నివేదికపై నేడు విచారణ జరగనుంది. ఢిల్లీ ఎన్‌హెచ్‌ఆర్సీలోని ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు కమిటీ ముందు హాజరుకానున్నారు.
మళ్లీ మహేశ్ భగవత్ హాజరు..
దిశ హత్యాచారం, ఎన్‌కౌంటర్‌పై విచారణకు తెలంగాణ ప్రభుత్వం.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్‌గా మహేశ్ భగవత్‌ను నియమించింది. ఇప్పటికే పలుమార్లు కమిషన్ ముందు హాజరైన భగవత్‌ను త్రిసభ్య కమిటీ పలు ప్రశ్నలను అడిగింది. కొన్ని ప్రశ్నలకు ఆయన కొంత సమయం అడిగారని, మరికొన్ని ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పారని తెలిసింది. దీంతో సోమవారం ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం విచారణ తర్వాత మళ్లీ సిట్ చీఫ్ మహేశ్ భగవత్ విచారణకు హాజరుకానున్నారు.
సిట్ నివేదికలో పొందుపరిచిన అంశాలకు, కమిషన్ విచారిస్తున్న అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం, పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో విచారణకు రెండుమూడు రోజుల సమయం పడుతుందని ఓ అధికారి తెలిపారు. విచారణ తర్వాత సిర్పుర్కర్ కమిషన్ 2–3 నెలల్లో నివేదికను అందజేస్తుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment