అమ్మాయిల్ని ధైర్యంగా పెంచాలి | Special story to medak sp  chandana deepthi | Sakshi
Sakshi News home page

అమ్మాయిల్ని ధైర్యంగా పెంచాలి

Published Wed, Jul 4 2018 12:41 AM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

Special story to medak sp  chandana deepthi - Sakshi

మెదక్‌ జిల్లా ఎస్పీ చందన దీప్తి 

‘వరంగల్‌ యాసిడ్‌ ఘటన’.. నేను చదువుకునే రోజుల్లోనే జరిగింది. ఆ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. నేరస్తులపై నాటి పోలీసుల చర్య రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్లలో కొండంత విశ్వాసం నింపింది. అయితే మహిళలపై దాడులు తగ్గాలంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకునే చర్యలతో పాటు మగవాళ్లలోనూ పరివర్తన రావాలి. పరివర్తన తెచ్చే బాధ్యతను తల్లిదండ్రులు, సమాజం తీసుకోవాలి. ఆడపిల్లలు కూడా ఆత్మరక్షణకు సదా సిద్ధంగా ఉండాలి. అబలలమని భావించకుండా.. వేధింపులను, దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలి’’ అంటున్నారు మెదక్‌ జిల్లా ఎస్పీ చందన దీప్తి. బాలికలు, యువతులు, మహిళల సంరక్షణ కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటూ మహిళా ఐపీఎస్‌ ఆఫీసర్లలో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దీప్తితో మాట్లాడుతున్నప్పుడు మహిళా ప్రపంచానికి ఆమె ఒక స్ఫూర్తి అని ‘సాక్షి’కి అనిపించింది. నాన్న మైనింగ్‌ శాఖలో అధికారి. తరచూ బదిలీలు అవుతుండేవి. వరంగల్, కాకినాడ, నల్లగొండ, చిత్తూరు.. ఇలా అనేక ప్రాంతాల్లో నివాసం ఉన్నాము. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా నా బాల్యం గడించింది. చిత్తూరులోని గుడ్‌షెపర్డ్‌లో హైస్కూల్, ఇంటర్మీడియట్‌ చదివాను. ఇంటర్‌లో మరింత కష్టపడి చదివా. ఆ తర్వాత నాన్న గైడెన్స్‌ నా ఉన్నత విద్యాభ్యాసానికి ఎంతో తోడ్పడింది.

.. కన్నీళ్లు ఆగలేదు
ఐఐటీలో చేరాలన్నది నా కల. ఎలాగైనా ఐఐటీ సాధించాలని పట్టుదలతో ఉండేదాన్ని.  హైదరాబాద్‌లో రామయ్య కోచింగ్‌ సెంటర్‌లో ప్రవేశానికి ప్రయత్నించా. అయితే అప్పటికే సీట్లు నిండిపోవటంతో అది కుదరలేదు. చిత్తూరు జిల్లా పక్కనే ఉన్న నెల్లూరు పట్టణంలో పేరున్న ఒక కోచింగ్‌ సెంటర్‌లో చేరాలని అనుకున్నా. అక్కడికి వెళ్లి ఓ లెక్చరర్‌ని అడిగితే, ‘‘చూడమ్మాయ్‌.. ఐఐటీలు అబ్బాయిలకు మాత్రమే సూట్‌ అవుతాయ్‌. ఇంజనీరింగ్, సైన్స్‌ సబ్జెక్టుల్లో వాళ్లు మాత్రమే రాణిస్తారు. అమ్మాయిలు అలా కాదు. మీరు ఐఐటీలో సెట్‌ కాలేరు. వెళ్లి చక్కగా డిగ్రీ చదువుకో’ అని చాలా నిరుత్సాహంగా మాట్లాడారు. ఆ లెక్చరర్‌ మాటలతో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆరోజు రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. నేను ఎదుర్కొన్న మొదటి వివక్ష అదే. ఎలాగైనా ఆ లెక్చరర్‌ అభిప్రాయాన్ని తప్పుగా నిరూపించాలనుకున్నా. పట్టుదలతో కోచింగ్‌ తీసుకుని ఐఐటీ సాధించా.  అమ్మాయిలు ఏ రంగంలోనైనా అబ్బాయిలతో పోటీ పడవచ్చన్న ఆత్మవిశ్వాసం అప్పుడే నాకు కలిగింది.

సైంటిస్టు అవ్వాలనుకున్నా
ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరా. క్లాస్‌లో 60 మంది స్టూడెంట్స్‌  ఉంటే అందులో ముగ్గురం మాత్రమే అమ్మాయిలం. ఢిల్లీ ఐఐటీ  వాతావరణం బాగుంటుంది. అబ్బాయిలు, అమ్మాయిలు అన్న వివక్ష ఎక్కడా కనిపించదు. అప్పటి వరకు సైంటిస్టు కావాలనుకున్న నన్ను మా నాన్న సివిల్‌ సర్వీసెస్‌ వైపు మళ్లేలా చేశారు. ఐఐటీ పూర్తికాగానే హైదరాబాద్‌లో ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరిపోయా. మొదటి ప్రయత్నంలో సక్సెస్‌ కాలేదు. రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌ ర్యాంకు సాధించాను. 

కోపం కట్టలు తెంచుకుంది
ఐపీఎస్‌ ఆఫీసర్‌ కాక ముందు ఒక ఘటన నాపై తీవ్ర ప్రభావం చూపింది. నాన్న సుపీరియర్‌ ఆఫీసర్‌ ఒకరు హైదరాబాద్‌లో ఉండేవారు. ఒక అబ్బాయి ఆయన కూతురు వెంటపడి ప్రేమించమంటూ వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో పైశాచికంగా హత్య చేశాడు. ఆ ఘటన నన్ను కుదిపేసింది. మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నవారిపై నాలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ క్షణంలోనే అనుకున్నా.. ఇలాంటి దాడులు ఆగిపోవాలని. ఇప్పుడు ఐపీఎస్‌ ఆఫీసర్‌గా నా పరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నాను. మరీ ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాను. మెదక్‌ జిల్లాలో మహిళలపై దాడులు అరికట్టేందుకు ‘షీ భరోసా’లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఈవ్‌టీజింగ్‌ అరికట్టేందుకు పోలీస్‌స్టేషన్ల వారీగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని మహిళా కానిస్టేబుళ్లను పోలీసు అధికారులు, సిబ్బంది గౌరవించేలా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా ప్రజలు తమ సమస్యలు ఎప్పుడైనా చెప్పుకునేందుకు ఎస్పీగా ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటున్నాను. 

అంబులెన్స్‌ కోసం చూడలేదు
రంగారెడ్డి జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఓ రోజు సీఎం బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తుండగా వికారాబాద్‌ రూట్‌లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్‌బైక్‌ నడుపుతున్న ఓ వ్యక్తిని వాహనం ఢీకొంది. అందరూ ఆ వ్యక్తి చనిపోయాడు అనుకున్నారు. నేను వాహనం దిగి అతని పల్స్‌ చూశాను. బతికి ఉన్నట్లు అనిపించింది. అంబులెన్స్‌ కోసం చూడకుండా వెంటనే, కారుతున్న ఆ రక్తగాయాలతోనే అతడిని నా వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లా. వికారాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స తర్వాత  హైదరాబాద్‌కు తరలించాం. బతికాడు. అతడితో పాటు నాకూ ప్రాణం వచ్చినట్లయింది. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో చాలా మంది ప్రజాప్రతినిధులు, అధికారులు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్బంలో 108 వాహనాలకోసం ఎదురుచూడకుండా సొంత వాహనంలో క్షతగాత్రులను తరలించిన వార్తలు విన్నప్పుడు సంతృప్తిగా ఉంటుంది. 

ఆ రెండు కేసులు..!
ఐపీఎస్‌ అయ్యాక మొదట ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నల్లగొండ జిల్లాలో పనిచేశా. అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్‌ వికారాబాద్‌ ఇచ్చారు. వికారాబాద్‌లో ఏఎస్పీగా పనిచే స్తున్న సమయంలోనే.. ఓ వ్యక్తి కన్నకూతురుపై అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మొదట ఈ కేసు మాకు ఒక సవాలుగా మారింది. తన కూతురును తీసుకుని వెళ్తుంటే గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి నేను ఘటనా స్థలానికి వెళ్లాను. తండ్రిని విచారిస్తే పొంతన లేకుండా సమాధానం చెబుతున్నాడు. తండ్రే అత్యాచారం చేసి, హత్యకు పాల్పడి ఉంటాడని మాకు అనుమానం వచ్చింది. ఘటనా స్థలంలో తండ్రి చెప్పులు  కనిపించటంతో మా అనుమానం రూఢీ అయ్యింది.  గట్టిగా విచారిస్తే నేరం అంగీకరించాడు. 

ఇప్పటికీ కదిలిపోతాను
మరో కేసు గురించి కూడా చెప్పాలి. మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లిలో గత ఏడాది నవంబర్‌లో ఈ క్రైం చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన కుటుంబాలు ఉపాధి కోసం ముప్పిరెడ్డిపల్లికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాయి. కలీం, హసీనా జంట అలాగే బాబు, పాపతో వలస వచ్చారు. 2017 డిసెంబర్‌ 6న వాళ్ల ఆరేళ్ల పాప ఖుష్బూ కనిపించకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరుసటిరోజు ముప్పిరెడ్డిపల్లిలోని మొండికుంట అనే ప్రాంతంలోని కల్వర్టులో ఆరేళ్ల పాప శవం కనిపించింది. క్లూస్‌టీం, పోలీసు జాగిలాలను రంగంలోకి దించి దర్యాప్తు వేగవంతం చేశాం. స్వయంగా నేనే కేసును దర్యాప్తు పర్యవేక్షించాను. మాకు అందిన క్లూస్‌ మేరకు అజయ్‌ అలియాస్‌ శమీరాజ్‌ బ్రార్‌ అనే అతన్ని నిందితునిగా గుర్తించాము. శమీరాజ్‌ బ్రార్‌ డిసెంబర్‌ 6వ తేదీన ఖుబ్బూ(6) చదువుకునే పాఠశాలకు వెళ్లి భోజన విరామం సమయంలో పాపకు చాక్లెట్‌లు ఇచ్చి బయటకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత గ్రామ శివారులో చిన్నారిపై కిరాతకంగా అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశాడు. శమీరాజ్‌ బ్రార్‌కు ఆరేళ్ల కూతురు ఉంది. మానవమృగంలా మారి శమీరాజ్‌ బ్రార్‌ ఖుష్బూలో తన కూతురును చూసుకోకపోవటం నన్ను కలిచివేసింది. ఈ కేసులో శమీరాజ్‌ బ్రార్‌ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఇలాంటి కేసులు చూసినప్పుడల్లా నేను కదలిపోతాను. చిన్నారులు, మహిళల విషయంలో పురుషుల ప్రవర్తన మారాలని బలంగా కోరుకుంటున్నాను’’ అని ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు చందన దీప్తి.

మగపిల్లలకో పాఠ్యాంశం ఉండాలి
మహిళలపై దాడులు అరికట్టాలంటే ముందు పురుషుల్లో మార్పు రావాలి. మహిళలు తమ ఆత్మరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా వేధిస్తున్నారు అంటే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలి. తల్లిదండ్రులు తమ చిన్నారులకు బ్యాడ్‌ టచ్, గుడ్‌ టచ్‌ గురించి అవగాహన కల్పించాలి. ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీటీమ్స్‌ ఏర్పాటు చేయటంతోపాటు గృహహింస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. అయితే మహిళల సంరక్షణ కోసం మరికొన్ని చర్యలు తీసుకోవచ్చు. నిర్మానుష్య ప్రదేశాల్లోనే ఎక్కువగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో లైటింగ్‌ ఏర్పాటు చేస్తే దాడులు తగ్గుతాయి. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించాలన్న విషయం మగపిల్లల మనస్సు ల్లోకి ఎక్కించేందుకు పాఠ్యాంశాల్లో మహిళల ఔన్నత్యం గురించి తెలియజెప్పే అంశాలను చేరిస్తే బాగుంటుంది.
మెదక్‌ జిల్లా ఎస్పీ చందన దీప్తి 
– కాకోళ్ల నాగరాజు, సాక్షి, మెదక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement