మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలో మహిళల రక్షణ, భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత, రక్షణపై నగరంలో గురువారం రెండు రోజుల జాతీయ సమావేశాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో రోజు రోజుకు మహిళలపై దౌర్జన్యాలు అధికమవుతున్నాయంటూ, చట్టాలంటే భయం లేకపోవడం కూడా దీనికి కారణమని అన్నారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలపై విచారణ జరపడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను కూడా నెలకొల్పాల్సిన అవ సరం ఉందన్నారు.
దోషులకు తగిన శిక్ష పడితే ఇలాంటి నేరాలు తగ్గుముఖం పడతాయని సూచించారు. మనలో నిజాయతీ కలిగిన అధికారులకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దౌర్జన్యాలు తగ్గకపోవడానికి ఇదీ ఒక కారణమేనని తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులను నియమించడం ద్వారా ఇలాంటి నేరాలను నివారించాలని ప్రభుత్వానికి సూచించారు. అమెరికా లాంటి దేశాల్లో విదేశ వ్యవహారాల మంత్రులుగా మహిళలను నియమిస్తున్నారని, మన దేశంలో వారిని నమ్మడం లేదంటూ ఇదే మన దౌర్భాగ్యమని విచారం వ్యక్తం చేశారు.
మహిళలకు బాధ్యతలను అప్పగిస్తే పురుషుల కంటే సమర్థంగా నిర్వర్తిస్తారని కితాబునిచ్చారు. మహిళలకు అధికారం అప్పగిస్తే సక్రమంగా వ్యవహరించలేరనే అప నమ్మకం ఏర్పడిందని అన్నారు. దీనిని పోగొట్టి మహిళలను గౌరవించాలని ఆయన సూచించారు. హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ మాట్లాడుతూ... మహిళల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మహిళలపై దౌర్యనాల కేసుల సత్వర పరిష్కారానికి పది ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ, డీజీపీ లాల్ రుకుమ్ పచావ్, నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎంఎన్. వెంకటాచలయ్య ప్రభృతులు పాల్గొన్నారు.