వైరల్ అవుతున్న వీడియోలోని మహిళ
మగవారు ఇంట్లో తలుపులు వేసుకుని ఉంటేనే మహిళలకు రక్షణ అంటున్నారు ఒక మహిళ. ఆ మహిళ పోస్టు చేసిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ‘దిశ’ ఘటనకు స్పందనగా విడుదలైన వీడియో అది. ఆ మహిళ చేతిలో ఒక ప్లకార్డు ఉంది. దాని మీద ‘షీ గాట్ రేప్‌డ్’ , ‘హీ రేప్‌డ్’ అని రెండు నినాదాలు రాసి ఉన్నాయి. మొదటి నినాదం పక్కన ఉన్న బాక్స్‌లో ఇంటూ మార్క్, రెండో నినాదం ముందున్న బాక్స్‌లో రైట్ మార్క్ ఉన్నాయి. వీడియోలో ఈ మహిళ చెబుతున్న మాటలు అందరినీ ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. ‘మహిళ రేప్ చేయబడింది’ అని మొదటి నినాదానికి అర్థం. ‘ఒక మగవాడు బలాత్కరించాడు’ అనేది రెండో నినాదం. మొదటి నినాదం సరైనది కాదు అని ఈ ప్లకార్డు అంతరార్థం. ‘‘రాత్రి ఏడు గంటల తరవాత మహిళలు ఇంటి దగ్గరే ఎందుకు ఉండాలి, పురుషులే ఉండొచ్చుగా.
ఈ విషయాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి. మగవారంతా రాత్రి ఏడు గంటల లోపు ఇంటికి వచ్చి, తలుపులు వేసుకుని ఇంట్లో ఉండాలి. అప్పుడే మహిళలకు రక్షణ. నన్ను ఒక పోలీసు రక్షించాలని కోరుకోను, నా అన్నదమ్ములు నాకు రక్షణగా ఉండాలని కోరుకోను. మహిళల మీద జరుగుతున్న అరాచకాలకు కారణం పురుషుడు. అందువల్ల పురుషులు రాత్రి ఏడు గంటల లోపు ఇంటికి చేరుకుంటే, ప్రపంచమంతా స్వేచ్ఛగా విహరించగలదు’’ అని ఆ మహిళ ఆవేదనగా, ఆలోచింపచేసేలా మాట్లాడారు. ఈ వీడియో మీద ఇంటర్నెట్‌లో చర్చ జరుగుతోంది. చాలామంది నెటిజన్లు, ‘ఒక భారతీయ స్త్రీ చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఈ మహిళ ధైర్యంగా చెబుతున్నారు’ అని ఆమెను ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment