శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ‘దిశ’ చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్ సెషన్‌లోనే ఆమోదం తెలపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు విన్నవించారు. శుక్రవారం రాత్రి హోంమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. 9.40 గంటల నుంచి రాత్రి 10.20 వరకు దాదాపు 40 నిమిషాల పాటు రాష్ట్ర అంశాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రంలోని వివరాలు ఇలా ఉన్నాయి.
దిశ చట్టం కోసం చేయాల్సిందంతా చేశాం
‘మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. విచారణను వేగంగా పూర్తి చేసి, నిర్దేశిత సమయంలోగా శిక్షలు విధించడానికి దిశ చట్టం తీసుకువస్తున్నాం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిందంతా చేశాం. ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేశాం. సరిపడా సిబ్బందితో వీటిని బలోపేతం చేశాం. అందువల్ల ఏపీ దిశా చట్టం త్వరిత గతిన ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలి.
శాసనమండలి రద్దును ఆమోదించాలి
శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తెచ్చిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నంచేసి అపహాస్యం చేసింది. ఈ నేపథ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. శాసన మండలిని రద్దు చేస్తూ సిఫారసు చేసింది. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయ శాఖకు సూచించి ప్రస్తుత పార్లమెంట్ సెషన్‌లోనే ఆమోదించేలా చూడాలి.
ఏపీ పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ఊతమివ్వాలి
పోలీసు వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. ఈ విషయంలో ఏపీ పోలీసు విభాగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. వ్యవస్థ సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు చేస్తున్నా.. నిధుల లేమి, సిబ్బంది కొరత వల్ల ఆశించిన లక్ష్యం చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవసరాలకు అనుగుణంగా పోలీసు విభాగం సమర్థతను పెంచేలా సహాయం చేయాలి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాజెక్టును పునరుద్ధరించాలి. హోంమంత్రిత్వ శాఖ రూ.253.40 కోట్ల అంచనా వ్యయంతో దీనిని 2017లో ఆమోదించింది. ఇందులో రూ.152 కోట్లు కేంద్ర వాటా కాగా, రూ.101.40 కోట్లు రాష్ట్ర వాటా. కానీ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిధులు సమకూర్చకపోవడంతో ఈ ప్రాజెక్టు మూత పడింది. ఈ విషయంలో చొరవ చూపి ఆదుకోవాలి.
సీనియర్ అధికారులను కేటాయించండి
శాంతి భద్రతలను కాపాడేందుకు, ప్రజల భద్రత కోసం గట్టి చర్యలను తీసుకునేందుకు వీలుగా ప్రస్తుత కేడర్ సామర్థ్యం పెంచాలి. ఇందులో భాగంగా 79 సీనియర్ డ్యూటీ పోస్టులను 96కు పెంచాలి. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యుటేషన్‌పై పని చేసేందుకు వీలుగా డీఐజీ, ఐజీపీ, ఏడీజీపీ ర్యాంకుల్లో పని చేస్తున్న ఐపీఎస్ అధికారులను కేటాయించాలి. రాష్ట్ర పోలీసు విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందున ఈ అంశాల పరిష్కారం దిశగా దృష్టి పెట్టాలి. దీంతోపాటు స్టేట్ ఆపరేషనల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సెంట్రలైజ్డ్ డేటా సెంటర్, ఏపీ పోలీస్ అకాడమి ఏర్పాటుకు తగిన సహాయం చేయాలి.
అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ
రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడిషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ కేపిటల్‌గా అమరావతి కొనసాగేలా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయంలో అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం–2020కి కూడా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. రెండు మూడు నెలల్లో ఇది చట్టంగా మారనుంది. ఈ దిశగా హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశం మీకు తెలిసిందే.
పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ప్రాజెక్టులకు సాయం
ఏపీ విభజన చట్టంలో పొందు పరిచిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి చేయూత ఇవ్వాలి. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం – చెన్నై కారిడార్, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ కోసం తగిన ఆర్థిక సహాయం చేయాలి. రాష్ట్రంలో సాగునీటి వసతి మెరుగు పరచడానికి గోదావరి నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టుకూ తగిన ఆర్థిక సహాయం చేయాలి. ఆ మేరకు సంబంధిత శాఖలకు సిఫారసు చేయాలి.
పోలవరం నిధులు త్వరగా విడుదల చేయాలి
పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటి వరకు రూ.838 కోట్లు ఆదా చేశాం. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో సాగుతోంది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలను వెంటనే చేపట్టాల్సి ఉంది. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,549 కోట్లుగా కేంద్ర జల వనరుల శాఖలోని సాంకేతిక కమిటీ 2019 ఫిబ్రవరిలో ఆమోదించింది. దీనికి సంబంధించిన పాలనా పరమైన అనుమతి ఇప్పించేందుకు జోక్యం చేసుకుని, ఈ అంశాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలి. సహాయ, పునరావాస వ్యయం రూ.3,200 కోట్ల నుంచి రూ.33,010 కోట్లకు పెరగడం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.3,320 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వినియోగపత్రాలు అందజేసినప్పటికీ, ప్రభుత్వ సంస్థ అయిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆడిట్ చేసినప్పటికీ నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కేంద్ర జల వనరుల శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలి.
గ్రాంట్లు, నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి కేవలం రూ. 10,610 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఒక ఏడాది విడుదల చేసిన రూ.22,000 కోట్లలో ఇది సగం మాత్రమే. పెండింగులో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాల్సిందిగా సంబంధిత శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. వెనకబడిన జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.1,050 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అయితే గత మూడేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి ఈ నిధులు వస్తున్నా.. ఏపీకి రావడం లేదు.
ప్రత్యేక ఆర్థిక సహాయం పొందుతున్న కలహండి, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో తలసరి సగటున రూ.4,000 ఇస్తే, ఏపీలో వెనకబడిన ఏడు జిల్లాల్లో కేవలం రూ.400 చొప్పున మాత్రమే ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడిన జిల్లాలకు ఇస్తున్న ప్యాకేజీని కలహండి, బుందేల్‌ఖండ్ తరహాలో పెంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విభజన జరిగిన తొలి ఏడాది 2014–15 ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ లోటును భర్తీ చేస్తామంటూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. దీన్ని పార్లమెంటు కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. 2014–15 సంవత్సర రెవిన్యూ లోటును రూ.22,949 గా కాగ్ నిర్ధారించింది. ఇందులో ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉంది. ఈ మేరకు నిధులు విడుదల చేయించాలి. రాజధాని నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు మంజూరు చేయగా.. ఇందులో రూ.1,000 కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది.
ప్రత్యేక హోదా ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని 15వ ఆర్థిక సంఘం తన మధ్యంతర నివేదికలో ప్రస్తావిస్తూ.. ‘కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరాయి. ఇది 15వ ఆర్థిక సంఘం ఇవ్వాల్సిన ఆదేశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం పరిశీలన అనంతరం తగిన నిర్ణయం తీసుకోవచ్చు’ అని స్పష్టం చేసింది. అందువల్ల దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేయాలి’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. అంతకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అమిత్ షాకు వేంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. సీఎం వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నందిగం సురేష్ ఉన్నారు.
మెడిక్లెయిమ్ కార్డులు సమకూర్చండి..
ఢిల్లీ తెలుగు పాత్రికేయుల వినతి
ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స పొందేలా మెడిక్లెయిమ్ కార్డులు సమకూర్చాలని ఢిల్లీలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అక్రిడేటెడ్ తెలుగు జర్నలిస్టులు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాని కలిసేందుకు ఇక్కడకు వచ్చిన ముఖ్యమంత్రిని ఢిల్లీ తెలుగు పాత్రికేయులు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. వీరితో ఆత్మీయంగా మాట్లాడిన వైఎస్ జగన్.. ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. ఈ సౌకర్యాన్ని అందించే దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, సీఎం శనివారం ఉదయం తిరిగి ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment