
దిశ చట్టం అమలుకు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ అధికారిని నియమించి, రాష్ట్రంలోని 18 మహిళా పోలీసుస్టేషన్లను ఈ అధికారి కిందకు తీసుకువచ్చేలా చూడండి. ఈ చట్టం అమలుకు వ్యవస్థలన్నీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి. వీలైనంత త్వరలో ఇవి పూర్తి కావాలి.– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించేలా తాజాగా తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం అమలుకు రాష్ట్ర పరిధిలో అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులతో ఈ విషయమై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. న్యాయపరంగా, పోలీసుపరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేకకోర్టులకు అవసరమైన బడ్జెట్‌ను వెంటనే కేటాయించాలని సీఎం ఆదేశించారు. ప్రతి కోర్టుకూ సుమారు రూ.2 కోట్లు అవసరం అవుతాయని అధికారులు పేర్కొనగా వారం రోజుల్లోగా డబ్బును డిపాజిట్ చేయాలని చెప్పారు. 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని సూచించారు.
వైజాగ్, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు
రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రస్తుతం ఉన్న ఫోరెన్సిక్ విభాగాన్ని రెట్టింపు చేయడం.. వైజాగ్, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబుల్లో 176 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని డీజీపీ పేర్కొనగా.. ఇందుకోసం జనవరి 1న నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. జిల్లాల్లోని మహిళా పోలీస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను డీజీపీ.. ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. రాష్ట్రంలోని 18 మహిళా పోలీస్‌స్టేషన్లలో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు సపోర్టు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్న డీజీపీ ప్రతిపాదనలకు సీఎం వెంటనే అంగీకారం తెలిపారు. ఈ పోలీసుస్టేషన్లలో మౌలిక సదుపాయలు, ఇతరత్రా అవసరాల కోసం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు.
వన్ స్టాప్ సెంటర్లలో మహిళా ఎస్‌ఐ నియామకం
ప్రతి జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ల (హింస, లైంగిక దాడులకు గురైన మహిళలను ఆదుకునేందుకు)ను మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సెంటర్లలో ఇప్పుడున్న సిబ్బందితోపాటు ఒక మహిళా ఎస్‌ఐని నియమించడానికి ఆమోదం తెలిపారు. వేధింపులకు గురవుతున్న మహిళలు కాల్ చేయాల్సిన కాల్ సెంటర్, యాప్, వెబ్‌సైట్ల పనితీరును సమీక్షించారు. సురక్ష స్పందన యాప్ తయారు చేశామని, మొత్తం 86 రకాల సేవలు అందుతాయని, దీనిని త్వరలోనే ప్రారంభిస్తామని డీజీపీ వివరించారు. 100, 112 నంబర్లను ఇంటిగ్రేట్ చేయాలని, దీంతో పాటు దిశ యాప్ కూడా పెట్టాలని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యలపై దుష్ప్రచారం
ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న ఏకైక అజెండాతో చాలా మంది పని చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. కేవలం టీడీపీతోనే కాకుండా టీడీపీ అనుకూల మీడియాతో, చంద్రబాబుకు మద్దతిస్తున్న వారితో మనం పోరాటం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘పేదల కోసం ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ప్రవేశ పెడుతున్నాం.. మద్యం మహమ్మారిని పారదోలాలనే ఉద్దేశంతో తొలిదశలో పలు చర్యలు తీసుకున్నాం.. మద్యం నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలను తగ్గించాం.. పర్మిట్ రూమ్‌లను నిషేధించాం.. బెల్టుషాపులను ఏరివేశాం.. బార్ల సంఖ్యనూ తగ్గించాం.. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ చర్యలపై కూడా ఎలాంటి ప్రచారం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం..’ అని సీఎం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment