ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని
సాక్షి, మహేంద్రవరం : ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెతను తు.చ. తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పై నుంచి కింది స్థాయి వరకూ పాటిస్తున్నట్టుంది. మహిళలకు భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 18 దిశ పోలీసు స్టేషన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా ‘దిశ’ తొలి పోలీసు స్టేషన్‌ను రాజమహేంద్రవరం కేంద్రంగా శనివారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రయత్నాన్ని పార్టీలకతీతంగా అన్ని వర్గాలూ స్వాగతించాయి. కానీ ప్రచారం కోసం టీడీపీ రాజకీయ రంగు పులమడాన్ని ఆ పార్టీ శ్రేణులే ఛీ కొడుతున్నాయి. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గ’న్నట్టుగా రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సోమవారం ఫిర్యాదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే భవాని ఫిర్యాదు ఇలా...
గత డిసెంబరు 16న అసెంబ్లీలో మద్యం పాలసీపై జరిగిన చర్చలో మద్యం బ్రాండ్ల గురించి ఆమె ప్రస్తావించారు. దీనిపై హేళన చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అదే నెల 17న స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తనకు న్యాయం చేసి ‘దిశ’ చట్టంపై ప్రజలకు నమ్మకం కల్పించాలని రాజమహేంద్రవరంలోని ‘దిశ’ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సోమవారం ఫిర్యాదు చేశారు.
ఇన్నాళ్లూ ఎందుకు మౌనం...?
గత ఏడాది డిసెంబరు 17న అసెంబ్లీ స్పీకర్‌కు ఎమ్మెల్యే భవాని ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ సైబర్ పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయకుండా మౌనం వహించి ఇప్పుడు ‘దిశ’ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంలో ఔచిత్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. శనివారం దిశ పోలీసు స్టేషన్ ప్రారంభమైతే 48 గంటలు కూడా తిరగకుండానే ఇంత హఠాత్తుగా ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేమిటంటున్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేసి 53 రోజులవుతోంది. ఆ చర్యలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోకుండా పార్టీ కార్యకర్తలతో దిశ పోలీసు స్టేషన్‌కు రావడమేమిటని అక్కడున్నవారే విసవిసలాడారు.
మహిళా ఎమ్మెల్యేగా గైర్హాజరవుతూ...
మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశ పోలీసు స్టేషన్‌ను తన నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నప్పుడు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగానే కాకుండా ఒక మహిళా ప్రతినిధి అయి ఉండి గైర్హాజరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా ప్రభుత్వం ఏమైనా పార్టీ కోణంలో చూసిందా అంటే అదీ లేదు. పోలీసు శాఖ నుంచి మిగిలిన ప్రజాప్రతినిధులకు పంపించినట్టుగానే ఈ ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానం పంపించినా డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేస్తూ...న్యాయం జరిగేలా చూసి... దిశ చట్టంపై మహిళల్లో నమ్మకం కలిగించాలని ఎలా కోరతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వెనుకబడ్డ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ రాష్ట్ర నలుమూలల నుంచి మహిళా ప్రజాప్రతినిధులు ఈ ప్రతిష్టాత్మక సభకు హాజరయ్యారు. సమావేశానికి హాజరై చట్టంపై తన అభిప్రాయాన్ని తెలియజేసి ఉంటే మరింత హుందాగా ఉండేదంటున్నారు.
రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నాయకులు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. 53 రోజుల కిందట జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఫిర్యాదు చేశారు. ఇది అసెంబ్లీ సెక్రటేరియట్ పరిధిలో ఉంది. దీనిపై ఎలా చర్యలు తీసుకోవాలో న్యాయ సలహా తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూష ఆరు నెలలుగా ఫేస్ బుక్‌లో అసభ్యంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదు వచ్చింది. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన మద్దుల రాజేశ్వరి 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ వరకూ పోస్టింగ్‌లు ఉన్నాయంటున్నారు. ఫేస్ బుక్‌లలో 18 అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టినట్లు ఫిర్యాదు చేశారు. ఏడాది కిందట జరిగిన సంఘటనపై ఒకటి, నెల కిందట జరిగిన సంఘటనపై మరొకటి ఫిర్యాదు చేశారు. ఈ మూడు ఫిర్యాదులు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోనివి కావు. అయినా న్యాయ సలహా తీసుకొని చర్యలు తీసుకుంటాం. జీరో ఎఫ్‌ఐఆర్ అనేది అత్యవసర సంఘటనలో మహిళల రక్షణ కోసం తీసుకుంటాం. మూడు సంఘటనలు ఇప్పటికిప్పుడు జరిగినవి కావు. భారత దేశం మొత్తం దిశ చట్టం కోసం అభినందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజలు, చట్టం అమలు చేసేందుకు పోలీసులకు సహకరించాలి.
– లతామాధురి, అదనపు ఎస్పీ, రాజమహేంద్రవరం.
Comments
Please login to add a commentAdd a comment