
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన దిశ చట్టం ఆడపడుచులకు ఆభయమిచ్చేదిగా ఉందని పలువురు ప్రజా ప్రతినిధులు, మేధావులు, న్యాయవాదులు, విద్యార్థినులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ రక్షణకు భరోసా లభించిందని విద్యార్థినులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో ‘సాక్షి’ టీవీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన చర్చావేదికలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మహిళలు, యువతుల నుంచి ముక్కుపచ్చలారని ఆడ శిశువులు, వృద్ధురాళ్లపై కూడా అత్యాచారాలకు తెగబడుతున్న ప్రస్తుత సమాజంలో దిశ చట్టం రక్షణ ఇస్తుందనే భరోసాను వ్యక్తం చేశారు. పాతికేళ్లు పెంచిన తల్లిదండ్రులను కడుపుకోతకు గురిచేస్తున్న అత్యాచారాలు, హత్యలు వంటి సంఘటనలను నిరోధించడానికి దిశ బిల్లు పూర్తిగా ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం చట్టాల్లోని లొసుగుల వల్లేనని, కింది కోర్టు నుంచి ఉన్నత న్యాయస్థానం వరకూ వెళ్ళే అవకాశం దోషులకు కల్పించడంవల్లే వారికి భయం లేకుండా పోయిందన్నారు.
అటువంటి నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లో శిక్ష పడే విధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చట్టం తీసుకు రావడంతో వారి వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. కొత్తం చట్టం అమలులోకి వస్తే ఆడపడుచులు నిర్భయంగా ఉంటారన్నారు. దిశ çఘటనలో దోషులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని ఎందరో మేధావులు స్వాగతించడం, మగవాళ్ల నుంచి కూడా ఈ దిశ చట్టానికి సంపూర్ణ మద్దతు లభిస్తుండడం సమాజంలో మార్పు ఎంత అవసరమో స్పష్టం చేస్తోందని అన్నారు. దోషులను శిక్షించడంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా అసలైన నేరస్థులకే శిక్షపడేలా చూడాలని సూచించారు. ఈ చర్చా వేదికలో వైఎస్సార్‌సీపీ ఉభయగోదావరి జిల్లాల మహిళా కన్వీనర్ శ్రీలక్ష్మి, న్యాయవాదులు అంబటి స్వర్ణలత, శ్రీలేఖ, తేతలి శశిధర్ రెడ్డి, పారిశ్రామికవేత్త కేకే గుప్తా, కళాశాల ప్రిన్సిపల్ మరియట్ట డిమెల్లో, యాంకర్ హిమబిందు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment