గర్జించిన గళాలు | YSRCP protests in Delhi over special status to Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గర్జించిన గళాలు

Published Fri, Dec 28 2018 2:09 AM | Last Updated on Fri, Dec 28 2018 5:47 AM

YSRCP protests in Delhi over special status to Andhra Pradesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా హోదా గళాలు గర్జించాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న కపట నాట కాలపై సమరశంఖం పూరించాయి. టీడీపీ, బీజేపీ సర్కారుల ద్రోహానికి నిరసనగా హస్తినలో వైఎస్సార్‌ సీపీ గురువారం రోజంతా నిర్వహించిన ‘వంచనపై గర్జన’ ధర్నా కార్యక్రమానికి వణికించే చలి గాలుల్లోనూ ప్రజలు భారీగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలంటూ నినదించారు.

జంతర్‌ మంతర్‌ వేదికగా...
ప్రత్యేక హోదాపై నాలుగున్నరేళ్లుగా మడమ తిప్పకుండా పోరాడుతున్న వైఎస్సార్‌ సీపీ 16వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కావడంతో మరోసారి కేంద్రానికి ఏపీ ప్రజల ఆకాంక్షను చాటి చెప్పింది. హోదాపై ప్రభుత్వాల వంచనను గుర్తు చేస్తూ  ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వేదికగా ఢిల్లీ పీఠాన్ని నిలదీసింది. ప్రత్యేక హోదా కోసం 2015 ఆగస్టు 10వతేదీన వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే స్థలంలో భారీ ధర్నా నిర్వహించడం తెలిసిందే. 2018 మార్చి 5న పార్టీ శ్రేణులు మరోసారి పార్లమెంట్‌ పోలీస్‌ స్టేషన్‌ వీధిలో మహా ధర్నా కూడా చేపట్టాయి. 

హోదా కోరుతూ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన
ఇటీవలే 12 ఏళ్ల నాటి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ఢిల్లీలో శీతాకాలపు చలి గాలులను లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు, నేతలు ఉదయం 9 గంటలకే ధర్నా వేదిక వద్దకు  చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు దివంగత వైఎస్సార్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ధర్నా కార్యక్రమాన్ని పార్టీ నేతలు ప్రారంభించారు. మరోవైపు పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పి.వి.మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించిన అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభలో ఆందోళన నిర్వహించి సభ వాయిదా పడిన అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వైఎస్సార్‌ సీపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సీనియర్‌ నేతలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని విజయవంతం చేశారు. సీనియర్‌ నేత కంతేటి సత్యనారాయణరాజు ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించారు.

ఏపీకి ప్రాణవాయువు లాంటి హోదాను తాకట్టు పెట్టిన బాబు
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.10 వరకు జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఏపీని వంచించిన తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నేతలు నిలదీశారు. మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తీరు, ప్రత్యేక హోదా తెస్తామని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు వంచించడాన్ని వివరించారు. ఏపీకి ఆక్సిజన్‌ లాంటి ప్రత్యేక హోదాకు చంద్రబాబు అడ్డుపడి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికలు మంచుకొస్తుండటంతో ప్లేటు ఫిరాయించిన చంద్రబాబు ప్రత్యేక హోదా, శంకుస్థాపనలు అంటూ మరోసారి వంచించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

చంద్రబాబు, మోదీ నమ్మించి వంచించారు..
‘ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశారు. ఇద్దరూ పొత్తు పెట్టుకుని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి వంచించారు. ఢిల్లీని తలదన్నేలా ఏపీ రాజధాని నిర్మిస్తామని ఆనాడు మోదీ హామీ ఇచ్చారు. హోదా ఐదేళ్లు ఇస్తామని యూపీఏ అంటే 10 ఏళ్లు ఇస్తామని బీజేపీ నమ్మబలికింది. 15 ఏళ్ల పాటు హోదా సాధిస్తామని చంద్రబాబు చెప్పారు. వారిని నమ్మి రాష్ట్రం అన్యాయమైపోయింది. మోదీ గ్రాఫ్‌ తగ్గుతోందని చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. బాబు సిగ్గు లేని వ్యక్తి. నయవంచకుడు, రోషం లేని వ్యక్తి. బీజేపీకి మేం బీ–టీం అని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు కాపాడితే వారికే మా మద్దతు ఉంటుంది. చంద్రబాబు ఇప్పుడు రాహుల్‌గాంధీని వివిధ భంగిమల్లో ప్రేమిస్తున్నారు. ముద్దులు పెట్టుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మీ మోసాన్ని మరిచిపోరు. ప్రతిపక్ష నేతనే అంతమొందించాలని చూశారు. ప్యాకేజీ కోసం, అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఆరాటపడ్డారే కానీ చంద్రబాబు ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేయలేదు’ – మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ

ఎన్డీఏపై మొదట అవిశ్వాసం పెట్టిన ఘనత మాదే..
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసంపై వైఎస్సార్‌ సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. నాలుగున్నరేళ్లుగా ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసగించాయి. ఇన్నాళ్లూ ఎన్డీఏలో భాగంగా ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రత్యేక హోదాపై ప్రజలను వంచించాయి. వైఎస్సార్‌ సీపీ వీరి మోసాన్ని ఆనాడే గ్రహించి మడమ తిప్పకుండా పోరాడుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం మీద మొదటిసారిగా అవిశ్వాసం పెట్టిన ఘనత మాదే. 13సార్లు అవిశ్వాసం పెట్టినా చర్చకు రానివ్వలేదు. దీంతో రాజీనామాలు చేశాం. ఏపీ భవన్‌లోనే ఆమరణ దీక్షలు చేశాం. ఇవే పార్లమెంట్‌ చివరి సమావేశాలు. కేంద్రం మెడలు వంచేందుకుమరోసారి గర్జన నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్రం ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలి. బీజేపీతో నాలుగున్నరేళ్లు కాపురం చేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు వెన్నుపోటు పొడిచారు. ప్యాకేజీకి అంగీకరించి ఘోర తప్పిదం చేశారు. ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. చంద్రబాబు తన దోపిడీ, అవినీతి వెలుగులోకి వస్తే జైలుకు వెళ్తాననే భయంతోనే మోదీని ప్రశ్నించడం లేదు’ – వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ

జగన్‌ పోరాడకుంటే బాబు నోరెత్తేవారా?
‘హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడంతోపాటు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి వంచించిన ఎన్డీఏ సర్కారు మెడలు వంచేందుకే ఈ గర్జన నిర్వహిస్తున్నాం. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హోదాపై నిరంతరం పోరాడకుంటే చంద్రబాబు ఆ మాటే ఎత్తేవారా? ప్యాకేజీనే సంజీవని అంటూ రాష్ట్ర ప్రజలను వంచించినందుకే ఈ గర్జన చేపట్టాం. మేం అవిశ్వాసం పెడితే దానివల్ల ఏం వస్తుందన్నారు.. మేం రాజీనామా చేస్తే.. వాటితో ఏం ఒరుగుతుందన్నారు. చంద్రబాబు నాలుగున్నరేళ్లు నిద్రపోయారు. పోలవరం పూర్తిచేయకుంటే ఓట్లడగబోనన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారు. ఏపీకి హోదాను తెచ్చే ఏకైక శక్తి వైఎస్‌ జగన్‌’ – పీవీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ 

బడుగులంటే బాబుకు చిన్నచూపు
‘చంద్రబాబుకు పేదలంటే గౌరవం లేదు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ అవమానించేలా వ్యాఖ్యలు చేస్తారు. ఓ ముఖ్యమంత్రి ఇలా అవమానించడం సిగ్గు చేటు. బీసీలనూ మోసగించారు.వారిని చిన్నచూపు చూశారు. రిజర్వేషన్ల కోసం అడిగితే మత్స్యకారులను తోలు తీస్తా అని బెదిరించారు. నాయీ బ్రాహ్మణులు కలవటానికి వస్తే బెదిరించారు. ఎన్నికలొచ్చేసరికి ఆయనకు ప్రత్యేక హోదా, పేదోడి ఆకలి గుర్తొస్తుంది. స్టీలు ప్లాంటు కూడా గుర్తొస్తుంది. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా సాధించలేని వ్యక్తిని సీఎం అని పిలుద్దామా? దుగరాజపట్నం ఇస్తామని గడ్కారీ చెబితే బాబు ప్రైవేట్‌ పోర్టు యాజమాన్యాలతో లాలూచీ పడి రాకుండా చేశారు. రైల్వే జోన్‌ చిన్న అంశం. అది కూడా సాధించలేని వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి విపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేసిన ఆయన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తాడట. మేనిఫెస్టో అంశాలను కూడా అమలు చేయలేని ముఖ్యమంత్రి ధర్మ పోరాటం ఎవరిపై చేస్తున్నారు? 
– వెలగపల్లి వరప్రసాదరావు (మాజీ ఎంపీ)

అప్పుడెందుకు హోదా అమలు చేయలేదు..?
యూపీయే హయాంలో మంత్రిమండలిలో తీర్మానం చేసిన అనంతరం రెండు నెలల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అప్పుడెందుకు హోదా అమలు చేయలేదు? రాష్ట్రాన్ని దారుణంగా విభజించి కంటితుడుపు చర్యగా హోదా హామీ ఇచ్చినా చట్టంలో చేర్చలేదు. 2014 ఎన్నికల అనంతరం వైఎస్‌ జగన్‌ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో కలసి హోదా హామీని అమలు చేయాలని మోదీని కోరారు. అప్పటి నుంచి జగన్‌ నిరంతరం హోదా కోసం పోరాటం చేస్తున్నారు. అమరణ దీక్షలు, ధర్నాలు, బంద్‌లు, యువభేరి కార్యక్రమాలు నిర్వహించారు. జగన్‌ తొలి అసెంబ్లీ భేటీ నుంచే హోదాపై మాట్లాడుతున్నారు. హోదా పోరాటంలో కలసి రావాలని టీడీపీకి పిలుపునిస్తే హేళన చేశారు. ఏపీకి ప్యాకేజీ ప్రకటనపై మోదీని అభినందిస్తూ బాబు సన్మానించారు. ప్యాకేజీలో కొత్తగా ఏమీ లేదని జగన్‌ ఆనాడే చెప్పారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వవద్దని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని జగన్‌ అసెంబ్లీలో, బయట చెప్పినా ఆలకించలేదు. ఇప్పుడు హోదా ఇవ్వాలంటూ చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు. వైఎస్సార్‌ సీపీ పోరాటంతో తన పుట్టి మునుగుతుందని ఆందోళన చెందిన చంద్రబాబు రాత్రికి రాత్రే కేంద్రం నుంచి బయటకొచ్చి డ్రామాలు ఆడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకొని మళ్లీ ప్రజల్ని మోసగించేందుకు సిద్ధమయ్యారు. ఏపీకి ఇచ్చిన హామీకి విలువ ఇచ్చి కేంద్రం ఈ రెండు నెలల్లో హోదాను అమలు చేయాలి. లేదంటే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో ఢిల్లీకి వచ్చి కేంద్రం మెడలు వంచి జగన్‌ హోదా సాధిస్తారు. – సజ్జల రామకృష్ణారెడ్డి (వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

మోదీతో బాబు లాలూచీ..
హోదా విషయంలో ప్రధాని మోదీతో చంద్రబాబు లాలూచీ పడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించగానే స్వాగతించి సన్మానించారు. ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని హోదా కావాలంటున్నారు. హోదా పేరెత్తితే  పీడీ కేసులు నమోదు చేస్తామన్న చంద్రబాబుపై ఇప్పుడు ఏ కేసులు పెట్టాలి? రాష్ట్రంలో అవినీతి మినహా అభివృద్ధి లేదు. రైతుల గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. అధిక సంపాదన కోసం రైతులు వలస పోతున్నారని అంటూ వారిని అవమానించారు. గతంలో అంతా కలసి మోదీ వద్దకు వెళ్లి హోదాపై నిలదీద్దాం అని వైఎస్సార్‌ సీపీ సూచిస్తే పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే అడ్డుకుంటున్నారు. హోదా, విభజన హామీల సాధన కోసం ఆది నుంచి పోరాడుతోంది ఒక్క వైఎస్సార్‌ సీపీ మాత్రమే. 
– ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (శాసన మండలిలో ప్రతిపక్ష నేత)

ఎన్నికల వేళ శంకుస్థాపనలతో బాబు మోసం..
‘చంద్రబాబు నాలుగున్నరేళ్లు మోదీతో అంటకాగి ఆయన చెప్పింది చేస్తూ ప్రత్యేక ప్యాకేజీనే మహద్భాగ్యంగా శాసనసభలో రెండుసార్లు తీర్మానం చేశారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడూ పట్టలేదు. మాయ మాటలతో అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయకుండా ఎన్నికలు సమీపిస్తుండటంతో సచివాలయం, ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన అంటూ ఇంద్రజాలం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇలా రాజకీయ ఆయుధాలను సమీకరిస్తున్నారు. ప్రజలు మరోసారి మోసపోవద్దు. రాష్ట్రాన్ని మోదీ, బాబు వంచించడానికి నిరసనగా ఈ గర్జన నిర్వహిస్తున్నాం. మా పార్టీ సింహంలా గర్జిస్తోంది. సివంగిలా నిలదీస్తోంది’
– భూమన కరుణాకర్‌రెడ్డి (వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత)

చీత్కారం తప్పదనే ఈ వేషాలు
‘టీడీపీ, బీజేపీ కుట్ర పన్ని రాష్ట్రానికి అన్యాయం చేశాయి. వారికి ఇక్కడ ఓట్లు లేవని గ్రహించిన బీజేపీ ప్రభుత్వం నిధులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేసింది. చంద్రబాబు, మోదీ కలిసి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కారు. నీతి ఆయోగ్, 14వ ఆర్థిక సంఘం వద్దన్నదని చెబుతూ ప్యాకేజీ మాత్రమే కావాలంటూ చంద్రబాబే హోదాకు అడ్డుపడ్డారు. హోదా కోసం చట్టం చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజల నుంచి చీత్కారాలు తప్పవని గ్రహించి నవనిర్మాణ దీక్షలు, ధర్మపోరాటం, శ్వేతపత్రాలు అంటూ రకరకాల వేషాలు వేస్తున్నారు. విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని సంపూర్ణంగా అమలు చేయించలేని వ్యక్తి సీఎంగా ఉన్నారు. రాష్ట్రానికి రూ. 90 వేల కోట్ల నష్టం జరిగిందని చెబుతున్న ఆయన మొదటి సంవత్సరం ఏం చేశారు? రెండో సంవత్సరం ఏం చేశారు? అవకాశం ఉన్నప్పుడల్లా మోదీని పొగిడారు. హోదా ఉద్యమాలను అణచి వేశారు’
– పార్థసారథి, మాజీ మంత్రి

ఓటుకు కోట్లులో దొరికిపోయి పరార్‌..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చారు. ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి వెంకయ్యనాయుడు కూడా కారణం. రాష్ట్రంలో ఇష్టానుసారంగా ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచి కమీషన్లు దోచుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడిన చంద్రబాబును ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఏపీ అభివృద్ధి చెందాలంటే ఒక బలమైన శక్తి కావాలి. ఆ శక్తి జగన్‌కు ఉంది. ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావడం ఖాయం.     
– సి.రామచంద్రయ్య (మండలి మాజీ ప్రతిపక్షనేత)

తెల్ల కాగితాలపై నల్ల అబద్ధాలు..
శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు తెల్ల కాగితాలపై నల్ల అబద్ధాలు విడుదల చేస్తున్నారు. 650 అబద్ధపు హామీలతో ఆయన అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. హోదా కోసం జగన్‌ పోరాడుతుంటే హేళన చేసిన చంద్రబాబు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూశారు. 
– మహ్మద్‌ ఇక్బాల్, పార్టీ సీనియర్‌ నేత

హోదా అంటే కేసులు పెడతానన్నారు..
ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ఉద్యమిస్తే పీడీ కేసులు బనాయిస్తానని హెచ్చరించిన చంద్రబాబు ఈరోజు హోదా కోసం పోరాడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. హోదా కోసం నాలుగున్నరేళ్లుగా పోరాడుతోంది వైఎస్‌ జగన్‌ మాత్రమే. అందుకే వైఎస్సార్‌ సీపీ చేస్తున్న ప్రతి పోరాటానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు.
– జంగా కృష్ణమూర్తి, పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు

బాబు మోసాలను జనం క్షమించరు..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. వైఎస్‌ జగన్‌ హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు అవహేళన చేశారు. హోదా వద్దు ప్యాకేజీ చాలంటూ బీజేపీ నేతలను ఊరూరా తిప్పి సన్మానించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కావాలంటూ నాటకాలు ఆడుతున్నారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయాలను ప్రజలు క్షమించరు. తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలు చంద్రబాబును తిరస్కరించినట్టుగానే ఏపీ ప్రజలు కూడా ఆయన్ను గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ సీఎం కాకుండా ఎవరూ ఆపలేరు.
– పృథ్వీ (ప్రముఖ నటుడు, వైఎస్సార్‌ సీపీ నేత)
 
చంద్రబాబు అబద్ధాలకోరు...
‘చంద్రబాబు అబద్ధాలకోరుగా మారారు. రాష్ట్ర విభజనకు కారకుడైన చంద్రబాబు రంగులు మార్చి అధికారంలోకి వచ్చి మళ్లీ వంచించారు. రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ తన హక్కుల కోసం పోరాడుతోంది’– శారద, డ్వాక్రా సంఘాల ప్రతినిధి

భారీగా హాజరైన వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు
ఢిల్లీలో నిర్వహించిన వంచనపై గర్జన ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కోన రఘుపతి, ఆదిమూలపు సురేష్, జగ్గిరెడ్డి, రక్షణనిధి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, షేక్‌ మహ్మద్‌ ముస్తఫా, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, అంజాద్‌ బాషా, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, తిప్పేస్వామి, వేణుగోపాలరెడ్డి, కిలివేటి సంజీవయ్య, చింతల రాంచంద్రారెడ్డి, కంబాల జోగులుతోపాటు ఎమ్మెల్సీ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేతలు పినిపె విశ్వరూప్, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కన్నబాబు, జోగి రమేష్, గౌరు వెంకటరెడ్డి, మల్లాది విష్ణు, ముదునూరి ప్రసాదరాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, శిల్పా రవి, ఉండవల్లి శ్రీదేవి, పద్మజ, ఎం.శంకరనారాయణ, విజయశారద, పి.వి.సిద్దారెడ్డి, బీవై రామయ్య, రహమాన్, మాజీ ఎంపీ బాలశౌరి, కుంభా రవిబాబు, చల్లా మధుసూదన్‌రెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్, మల్లా విజయప్రసాద్, తిప్పల నాగిరెడ్డి, శ్రీపర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్, చెల్లుబోయిన శ్రీనివాస్‌ గోపాల కృష్ణ, గున్నం నాగబాబు, దూలం నాగేశ్వరరావు, నంబూరి శంకర్‌రావు, వెంకటరమణ, చంద్రగిరి యేసురత్నం, గరటయ్య, బాలాజీ, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, మెరిగ మురళీధర్, గంగుల బ్రిజేందర్‌రెడ్డి, రవికిషోర్, కాటసాని రామిరెడ్డి, భరత్‌రామ్, కళ్యాణి, కడప రత్నాకర్, కడపల శ్రీకాంత్‌రెడ్డి, కంగటి శ్రీదేవి, హర్షవర్దన్‌రెడ్డి తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement