సాక్షి, అమరావతి: దేశాన్ని కుదిపేసిన దిశ హత్యాచార ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. కౄర మృగాలను వెంటనే ఉరి తీయాలని కోరుతూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇంకా ఎంతమంది నిర్భయలు, దిశలు బలి కావాలంటూ మహిళా సంఘాలు మండిపడ్డాయి. తెలంగాణ రాజధానిలో గత బుధవారం జరిగిన దారుణంపై పలువురు శాంతియుతంగా నిరసనలు చేపట్టారు.
తూర్పు గోదావరి: దిశ హత్య కేసు నిందితులను వెంటనే ఉరి తీయాలని కోరుతూ ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేత కుడుపూరి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు క్లాక్ టవర్ సెంటర్‌లోని గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి, మానవహారం చేపట్టారు.
విశాఖపట్నం: నిందితులకు కఠిన శిక్ష విధించాలని, అదే సమయంలో మహిళలకు రక్షణ కల్పించాలని జిల్లా బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీఎం రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులుతోపాటు మహిళా న్యాయవాదులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల తరపున న్యాయవాదులు ఎవరూ వాదించారని జిల్లా బార్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా గాయకుడు దేవిశ్రీ నిరసన వ్యక్తం చేశాడు. హాజరైన ప్రజాగాయకులు ‘ఎందరో నిర్భయలు.. మరెందరో ప్రియాంకలు..’ అంటూ విప్లవ గీతాలతో ప్రజలను చైతన్యపరిచారు.
వైఎస్సార్: షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ దిశను అతికిరాతకంగా హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలంటూ రాజంపేటలో అన్నమాచార్య ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించి దిశను హత్యచేసినట్లే ఆ నరరూప రాక్షసులను సైతం నడిరోడ్డుపై శిక్షించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
చిత్తూరు: దిశ హత్య తీరుకు నిరసనగా గుడిపాలలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
కృష్ణా: వెటర్నరీ డాక్టర్ హత్యాచారానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విస్సన్నపేటలో శ్రీచైతన్య విద్యార్థులు మానవహారం చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment