
జాతీయ జెండా ఆవిష్కరణలో ప్రత్యేక నియమావళి
రాజ్యాంగం రూపొందించిన.. నిబంధనలేంటి?
2002 నవీన్ జిందాల్ కేసులో పలు సవరణలు
ఇంటింటికీ జెండా నేపథ్యంలో.. సమగ్ర నియమావళి
సాక్షి, సిటీబ్యూరో: దేశ ప్రాథమిక, ప్రధాన చిహ్నం.. భారత గౌరవ ప్రతీక.. శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వాన్ని ప్రతిబింబించేది జాతీయ జెండా. ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు పలు ప్రత్యేక రోజుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తుంటాం. అంతేకాకుండా దేశభక్తిని, భారత ప్రతిష్టను ప్రదర్శించే వివిధ సందర్భాల్లోనూ జాతీయ పతాకాన్ని వినియోగిస్తాం. ఇటీవలి కాలంలో హర్ ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోంది. అయితే జాతీయ జెండా ఎగరవేయడానికి, ప్రదర్శించడానికి ప్రత్యేక నిబంధనలున్నాయి. ఈ నియమావళికి ఏ మాత్రం అవాంతరం ఎదురైనా దేశ ప్రతిష్టకే అవమానం. ఈ నేపథ్యంలో రాజ్యాంగం సూచించిన ఫ్లాగ్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలు తెలుసుకుందాం..
జాతీయ జెండా కేవలం ప్రభుత్వ భవంతుల మీద, ప్రభుత్వాధికారులకు మాత్రమే ఎగరవేసే ఆధికారముండేది. 2001లో నవీన్ జిందాల్ సుప్రీం కోర్టు కేసులో భాగంగా ప్రతి పౌరుడూ జెండాను ఎగరేయొచ్చని సవరించింది. జాతీయ జెండా పరిరక్షణకు సంబంధించి 1950, 1971 చట్టాలతో పాటు 2002, 2005లో సవరించిన అంశాలతో నూతన జాతీయపతాక నియమావళిని రూపొందించింది. ఈ నియమావళిలో భాగంగా పతాకం నేలనుగానీ, నీటినిగానీ తాకరాదు. టేబుల్ క్లాత్‌గా, వేదికకు ముందు భాగంలో వాడకూడదు.
ఉద్దేశపూర్వకంగా జెండాను తలకిందులు చేయకూడదు, విగ్రహాలమీద, ఇతర వస్తువులకు కప్పకూడదు. నడుం కింది భాగంలో, లోదుస్తులమీద జెండాను వాడకూడదు. ఆవిష్కరణకు ముందు పువ్వులు తప్ప ఇతర వస్తువులను జెండాలో ఉంచడం, జెండా మీద ఏదైనా రాయడం నిషిద్ధం. సాధారణంగా సూర్యోదయంలో జెండాను ఎగరవేసి, సూర్యాస్తమయంలో దించివేయాలి. కాషాయరంగు పైన ఉండేటట్లు, నిలువుగా వేలాడదీసినట్లైతే కాషాయరంగు చూసేవారికి ఎడమచేతివైపున ఉండాలి. మురికిగా ఉన్న జెండాను ప్రదర్శించకూడదు. రెండు జాతీయపతాకాలను ఎక్స్ ఆకారంలో కర్రలకు తగిలించినట్లైతే రెండు జెండాలూ వ్యతిరేకదిశల్లో తగిలించాలి. పోడియంలు, బిల్డింగుల మీద కప్పడానికి గానీ, రెయిలింగుల మీద అలంకరణ కోసంగానీ వాడకూడదు.
వీరి ఆదేశాల మేరకు..
రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం మాత్రమే సంతాపసూచకంగా పతాకాన్ని అవనతం (జెండా కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చెయ్యాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల్లో ఎవరు మరణించినా దేశవ్యాప్తంగా అవనతం చేస్తారు. అధికార, సైనిక, పారామిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేటప్పుడు శవపేటిక మీద తలవైపు కాషాయరంగు వచ్చేటట్లు కప్పాలి. ఐతే దానిని ఖననం చేసే ముందు తీసేయాలి. శవంతో పాటు సమాధిలోకి దించడం, కాల్చడం చెయ్యరాదు.
ఇవి తప్పనిసరి..
ఇతర దేశాల జాతీయపతాకాలతో కలిపి ఎగరేసే సమయంలో వరుసలో మొదటి స్థానంలో కుడివైపు (చూసేవారి ఎడమచేతివైపు) ఉండాలి. మిగతా పతాకాలు ఇంగ్లి‹Ùలో ఆయాదేశాల పేర్లను బట్టి అక్షరక్రమంలో అమర్చాలి. అన్ని పతాకాలూ దాదాపు ఒకే పరిమాణంలో ఉండాలి. అన్ని పతాకాలూ విడివిడిగా వేర్వేరు జెండాకర్రలమీద ఎగరెయ్యాలి. వృత్తాకారంలో ఎగరేసినప్పుడు భారత పతాకం దగ్గరే వృత్తం మొదలై, సవ్యదిశలో తిరిగిరావాలి. మన పతాకాన్ని ముందు ఎగరేసి అన్నిటికంటే చివర అవనతం చెయ్యాలి. పతాకాన్ని సమావేశాల్లో వేదికల మీద ప్రదర్శించేటప్పుడు కుడివైపునే (చూసేవారికి ఎడమవైపున) ఉండాలి. వక్తలు ఉపన్యసించేచోట ఉన్నట్లైతే వారికి కుడిచేతి వైపునే ఉండాలి. ఇతర జెండాలతో కలిపి ఊరేగింపులో తీసుకెళ్ళే సమయంలో మొదట్లో ఉండాలి. జెండాలన్నిటినీ ఒకే వరసలో తీసుకెళ్లేటప్పుడు కుడివైపున మొదటిదిగా లేదా మధ్యలో అన్నిటికంటే ముందు ఉండాలి. దేనికీ/ఎవరికీ గౌరవసూచకంగా జాతీయ జెండాను కిందికి దించరాదు.
వాహనాలపై..
జాతీయపతాకాన్ని వాహనాల మీద ఎగరేసే అధికారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, పార్లమెంటు, శాసనసభల సభ్యులు, లోక్‌సభ, శాసనసభల స్పీకర్లు, రాజ్యసభ, రాష్ట్రాల శాసనమండళ్ల అధ్యక్షులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, సైనిక, నావికాదళ, వాయుసేనల్లోని ఉన్నతాధికారులకు మాత్రమే ఉంది. ఇతర దేశాల నాయకులు భారత ప్రభుత్వ వాహనంలో తిరుగుతున్నప్పుడు భారత జాతీయపతాకం కుడి వైపు చివరన, వారి జాతీయపతాకం ఎడమవైపు చివరన ఉండాలి.