మన్మథుడికి వసంతుడి లాగా, భోగి పండగ సంక్రాంతికి సామంతుడు. పెద్ద పండగకు హంగుదారు. ‘సంక్రాంతి లక్ష్మి వేంచేస్తు న్నదహో, బహుపరాక్!’ అని ముందస్తు హెచ్చరికలు చేస్తూ, ఊరంతటినీ ఉత్తేజపరిచి, పండగ కళకు పటిష్ఠమైన పునాది వేస్తుంది.
ధనుర్మాసపు ముచ్చటలకు యథోచితంగా భరతవాక్యం పలికి, పౌష్యయోష ఆగమనానికి అంగరంగ వైభవంగా రంగం సిద్ధం చేస్తుంది. మకర సంక్రమణం జరగ బోతున్న మహత్తర ముహూర్తం వేళకు, చప్పటి సాధారణ జీవితపు స్తబ్ధతను వది లించే ప్రయత్నం చేస్తుంది. చలిమంటల నెపంతో, ఆబాల గోపాలంలోనూ సంబరాల వేడి పుట్టిస్తుంది. పల్లె సీమలలో ప్రతి ఇంటి ముంగిటా సమృద్ధికి సంకేతాలుగా, సంతుష్టికి గుర్తులుగా, పూర్ణ కలశాల ‘కుండ ముగ్గులు’ పూయిస్తుంది.
వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి! /అరటి స్తంభాలతో అందగింతాము, / బంతి పూదండలన్ భావించుదాము, / తామరాకులతోడ దళ్ళల్లు దాము, / కలవ కాడల తోడ మెలికలేతాము! అంటూ (రాయప్రోలు వారి) పాటలు పాడుతూ వచ్చి, అందరినీ హుషారు చేస్తుంది.
మరో రకంగా చూస్తే, సుదీర్ఘమైన సంక్రాంతి ఉత్సవంలో భోగి పండగ భోగానుభవాల రోజు. పులకింతలు కలిగించే చలిమంటలూ, ఉత్సాహం పెంచే ఉష్ణోదక అభ్యంగన స్నానాలతో ఆరంభించి, కొత్త బట్టల కోలాహలాలతో, వంటలు, పిండి వంటల ఆటోపాలతో, ఆత్మారాముడిని ఆనందపరిచే రోజు భోగి.
సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభ సమయం. మార్తాండుడి మకర సంక్రమణ వేళ. కనుక దానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎక్కువ. ఆ రోజు ఆస్తికులు దానాలూ, తపాలూ, పితృతర్పణాల లాంటి ఆధ్యాత్మిక వ్యాసంగాలలో ఎక్కువ కాలం గడుపుతారు. కాబట్టి, సరదాలకూ, భోగాలకూ సమయం సరిపోక పోవచ్చు. కాబట్టి భోగినాడే చలిమంటలలో విభేదాలూ, విద్వేషాలూ, ఈర్ష్యా సూయల లాంటి నకారాత్మక భావనలు యథాశక్తి దహించేసుకొని, ఆ రోజంతా బంధుమిత్రుల సాంగత్యంలో ఉల్లాసంగా గడిపి, జీవితంలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ నింపుకొని, ఆపైన జరపవలసిన సంక్రాంతి విధులకు సన్నద్ధం కావాలి.
అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు!
– ఎం. మారుతి శాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment