Sankranti 2025 : సులువుగా చేసుకునే పిండి వంటలు మీకోసమే! | Sankrant​​i 2025 check here Important sweets and Recipes | Sakshi
Sakshi News home page

Sankranti 2025 : సులువుగా చేసుకునే పిండి వంటలు మీకోసమే!

Published Mon, Jan 6 2025 3:30 PM | Last Updated on Mon, Jan 6 2025 4:54 PM

Sankrant​​i 2025  check here Important sweets and Recipes

భారతదేశం అంతటా మకర సంక్రాంతిని చాలా ఉత్సాహంగా  జరుపుకుంటారు.   ముఖ్యంగా తెలుగువారు ఎంతో పవిత్రంగా భావించే అతి ముఖ్యమైన పండుగ. భోగి, సంక్రాంతి, కనుక, ముక్కనుమ ఇలా ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.  సంక్రాంతి  వస్తోందంటే బోలడెన్ని పిండి వంటలు చేయాలి. చుట్టాలు, బంధువులు ముఖ్యంగా కొత్త అల్లుళ్లకి మర్యాదల సందడి ఎక్కువగా ఉంటుంది. మరి  సంక్రాంతికి ఈజీగా చేసుకునే కొన్ని  వంటకాల్ని చూద్దాం.

 

పూర్ణం బూరెలు
కావల్సినవి: పచ్చి శనగపప్పు - 2 కప్పులు
మినప్పప్పు - కప్పు
కొత్త బియ్యం - 2 కప్పులు
బెల్లం తురుము - 2 కప్పులు
నెయ్యి - అర కప్పు
నూనె -సరిపడ

తయారి:  మినపప్పు, బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత జారుగా కాకుండా, మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి కుక్కర్‌లో రెండు విజిల్స్‌ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి.   చల్లారాక మందపాటి గిన్నెలో ఉడికించిన శనగపప్పుతోపాటు తరిగిన బెల్లం వేసి మళ్లీ ఉడికించాలి. బెల్లం పాకం వచ్చి, ఈ మిశ్రమం ఉండ చేసుకునే విధంగా అయ్యేలాగా ఉడికించుకోవాలి.  చివరగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి.  చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన  సైజులో ఉండలు చేసుకోవాలి.  

ఆ తరువాత  కడాయిలో నూనె పోసి బాగా కాగనివ్వాలి. ఇపుడు ముందే  చేసిపెట్టిన ఒక్కో ఉండనూ మెత్తగా రుబ్బిన పప్పు మిశ్రమంలో ముంచి జాగ్రత్తగా నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. వేడివేడిగా బూరెల్లో నెయ్యి వేసుకొని  తింటే భలే రుచిగా ఉంటాయి. 
 
నువ్వుల బొబ్బట్లు, బెల్లంతో
కావల్సిన పదార్తాలు : తెల్ల నువ్వులు - 2 కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; యాలకుల పొడి - ఒకటిన్నర టీ స్పూన్; మైదాపిండి- ఒకటిన్నర కప్పులు; నెయ్యి - సరిపడినంత


తయారి:  మైదాపిండిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి చపాతీ పిండిలాగా మృదువుగా కలుపుకోవాలి.  ఆ తరువాత దీనిని కొద్దిసేపు తడిబట్ట కప్పి ఉంచాలి. 

ఈలోపు బాణలిలో నువ్వులు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి.  నువ్వులు చల్లారిన తర్వాత బెల్లం తురుము వేసి, రెండూ కలిపి  మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.  ఇందులో రుచికి, సువాసన కోసం  యాలకులకు కూడా కలపాలి.

ఇపుడు  కలిపి ఉంచుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని, చపాలీగా వత్తి అందులో నువ్వుల మిశ్రమం పెట్టి బొబ్బట్టు మాదిరిగా వత్తాలి. దీనిని పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా మాడిపోకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి. 

ఇదీ చదవండి : ఆంధ్ర దంగల్‌కు సై అంటున్న.. తెలంగాణ కోళ్లు! ఇంట్రస్టింగ్‌ విషయాలు


 
పాకం గారెలు
కావల్సినవి: మినప్పప్పు -అర కిలో,  బెల్లం అర కిలో, కొద్దిగా  నీళ్లు, నూనె - వేయించేందుకు సరిపడా నెయ్యి - 50 గ్రాములు యాలకుల పొడి - 1 టీ స్పూన్ ఉప్పు - రుచికి సరిపడా

తయారి:  పొట్టు తీసిన మినప్పప్పును ముందురోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లన్నీ వంపేసి, గారె చేయడానికి అనువుగా పిండి గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కలుపుకోవాలి.బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి, అందులో యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి.గారెలు వత్తుకొని, నెయ్యి కలిపిన నూనెలో దోరగా వేయించి, వేడిగా ఉండగానే పాకంలో వేయాలి. వీటిని ఓ పూటంతా కదపకుండా ఉంచితే పాకంలో గారెలు బాగా నాని రుచిగా ఉంటాయి.

గోధుమరవ్వ హల్వా
కావల్సినవి: చిన్నగోధుమ రవ్వ - 1కప్పు
పాలు - 2 కప్పులు; నీళ్లు - 1 కప్పు
యాలకుల పొడి - చిటికెడు
జీడిపప్పు పలుకులు - 10
కిస్‌మిస్ - 10
పంచదార - 2 కప్పులు
నెయ్యి - 4 పెద్ద చెంచాలు
కుంకుమపువ్వు - కొద్దిగా

తయారీ:  మందపాటి గిన్నెలో నెయ్యి  కొద్దిగా వేసి వేడిచేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యిలో రవ్వ వేసి దోరగా కమ్మని వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి. ఈ రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 

ఇపుడు మరో గిన్నెలో చిక్కని పాలు, నీళ్లు కలిపి బాగా మరిగించాలి. దానిలో గోధుమరవ్వను కొద్ది కొద్దిగా పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉడకనివ్వాలి. రవ్వ బాగా ఉడికాక అందులో పంచదార, నెయ్యి కూడా వేసి బాగా కలపాలి.  పంచదార కరిగి, హల్వా కొద్దిగా దగ్గరకి వచ్చేవరకు కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్, కుంకుమ పువ్వు వేసి మంట తీసేయాలి. ఘుమఘుమలాడే గోధుమరవ్వ హల్వా రెడీ. 

ఇదీ చదవండి : HMPV : మళ్లీ మాస్క్‌ వచ్చేసింది.. నిర్లక్ష్యం వద్దు!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement