ఎంతో విస్తృతీ, వైవిధ్యం గల భారతదేశంలో, భిన్నత్వంలో అంతర్లీనంగా ఉండే ఏకత్వానికి దీపావళి పండగ ఒక ప్రతీక. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండగ జరుపుకుంటారు. కానీ ఈ పండగ ప్రాశస్త్యానికీ, ప్రాముఖ్యతకూ వెనక కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది.
దక్షిణ భారతంలో నరకాసుర వధ కథ ప్రసిద్ధం. సత్యభామా సహితుడై, శ్రీకృష్ణుడు ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకుడిని సంహరించాడు. కనుక అది నరక చతుర్దశి. ఆ మరునాటి విజయోత్సవ దినం దీపావళి. కానీ ఉత్తర భారతంలో ఈ కథ తెలిసిన వారే అరుదు. ఉత్తర భారతంలో, రావణ సంహారం జరిపి రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ దినంగా దీపావళి అమావాస్యకు గుర్తింపు. అందుకే ఆరోజు మహోత్సవం. అంతటి మహోత్సవం గనక చిన్న దీపావళి (చతుర్దశి), పెద్ద దీపావళి అని రెండు రోజులు జరుగుతుంది. తూర్పున వంగ దేశంలో దీపావళి అమావాస్య... కాళీ పూజ పర్వదినం. పశ్చిమాన గుజరాత్ వాసులకు దీపావళి అమావాస్య సంవత్సరాంతం. అమావాస్య ముగుస్తూనే నూతన సంవత్సరాది. రాజస్థాన్‌లో చాలా ప్రాంతాలలో దీపావళి అమావాస్య నాడే ఉగాది. ఆరోజు వైభవంగా లక్ష్మీ పూజ చేసి, కొత్త పద్దు పుస్తకాలకు శ్రీకారం చుట్టడం భాగ్యప్రదమని అక్కడి వ్యాపారస్థులు భావిస్తారు.
జైనులకు దీపావళి అయిదు రోజుల పండగ. జైన ప్రవక్త మహావీరుడు, నేటికి సరిగ్గా 2,550 సంవత్సరాల క్రితం, దీపావళి అమావాస్యనాడు మోక్ష ప్రాప్తి (నిర్వాణం) పొందాడు. అమావాస్య ముందు త్రయోదశి నాడు ఆయన తన శిష్యులకు ఆఖరి బోధనలు ఆరంభించాడు. ఆ త్రయోదశి ‘ధన్య త్రయోదశి’ (ధన్–తేరస్). ఆ రోజు వాళ్ళు ధ్యానాది సాధనలలో గడిపే పవిత్ర దినం. కాలగతిలో ‘ధన్–తేరస్’ను ధన త్రయోదశిగా జరుపుకొనే ఆనవాయితీ అనేక ప్రాంతాలలో ఆరంభమైంది.
అమావాస్య నాడు మహావీరుడనే మహత్తరమైన ‘జ్ఞాన జ్యోతి’ అంతర్ధానమవటం వల్ల కలిగిన అంధకారాన్ని ఆయన శిష్యగణం దివ్వెల వరసలు (దీప– ఆవళులు) వెలిగించి తొలగించటానికి చేసే ప్రయత్నంగా ఈ దీపావళులకు చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వర్ధమానుడు దూరమవడంతో, దుఃఖ సాగరంలో మునిగి, చేష్టలుడిగిన నంది వర్ధనుడనే రాజును, శుక్ల విదియనాడు, ఆయన సోదరి సుదర్శన తన ఇంటికి ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి, వైరాగ్య బోధన చేసి ఊరడించిన సందర్భం ‘భాయి–దూజ్’.
దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు!
– ఎం. మారుతి శాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment