ఒక కొమ్మకు పుట్టిన ప్రేమ | Rows of children fall in love not knowing? | Sakshi
Sakshi News home page

ఒక కొమ్మకు పుట్టిన ప్రేమ

Published Tue, Feb 28 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

ఒక కొమ్మకు పుట్టిన ప్రేమ

ఒక కొమ్మకు పుట్టిన ప్రేమ

లీగల్‌   స్టోరీస్‌

ప్రేమ ఒక బంధమే.
కానీ అది కూడా ఒక విపరీత బంధానికి దారితీయవచ్చు.
ఒక కొమ్మకు పుట్టిన పిల్లలు వరసలు తెలియక ప్రేమలో పడితే?!
సంప్రదాయం వద్దంటోంది.
సంస్కారం కాదంటోంది.
మరి చట్టం ఏమంటుంది?


‘‘ఆనందా... గుడ్‌ న్యూస్‌ డియర్‌’’ శ్రీరామ్‌ వాయిస్‌లో ఆనందం.‘‘మీవాళ్లు ఒప్పుకున్నారా?’’ ఇవతల ఆనంద గొంతులో ఆత్రుత.‘‘ఊ.... ఒప్పుకున్నారు..’’ ఆ స్వరంలో ధీమా.‘‘హూ..’’ ఓ భరోసాతో నిట్టూర్చింది ఆనంద.‘‘నిన్ను ఎల్లుండి కలుస్తామన్నారు అమ్మానాన్న..’’ చెప్పాడు. ‘‘అవునా... అయితే తాతయ్యతో చెప్పేస్తాను ఈ రోజే’’. ‘‘చెప్పేయ్‌.. కాని హడావిడి పడకు.. పెద్దాయన్ని హడావిడి పెట్టకు. జస్ట్‌ నిన్ను చూసి పెద్దాయనతో మాట్లాడి వెళతారు అంతే.. ఓకేనా?’’ అన్నాడు శ్రీరామ్‌.‘‘ఒకే బాస్‌..’’ ఆనందలో సంతోషం.‘బై మరి..’ అంటున్న శ్రీరామ్‌కి ‘బై’ అంటూ ఆన్సర్‌ చేసింది. ఇద్దరి ఫోన్‌లు డిస్కనెక్ట్‌ అయ్యాయి.ఆనందకి ఆనందం మామూలుగా లేదు. ఎక్కడా కాలు నిలవడం లేదు. శ్రీరామ్‌ పేరెంట్స్‌ ఒప్పుకున్నారు. అంటే త్వరలోనే శ్రీరామ్‌కి భార్య కాబోతుంది. ఆ ఊహ ఆమె కళ్లల్లో ఓ మెరుపుని తెచ్చింది. మదిలో జ్ఞాపకాలను తట్టిలేపింది.

‘ప్రొఫైల్స్‌’.. కలిపాయి ఇద్దరినీ
ఆనంద కృష్ణ... ఫేస్‌బుక్‌లో ఓ మ్యూచువల్‌ ఫ్రెండ్‌ పోస్ట్‌కి కామెంట్‌ పెట్టింది. ఆమె సోషల్‌ కాన్షస్‌కి ముగ్ధుడయ్యాడు శ్రీరామ్‌. ఆ పేరును క్లిక్‌ చేసి ఆమె పేజీని ఓపెన్‌ చేశాడు. ప్రతి పోస్ట్‌లో కనిపించిన ఆమె ఆలోచన, అభిరుచి, అవగాహన ఆయనను ఆనందకు కట్టిపడేశాయి. ఆమె ప్రొఫైల్‌ పిక్‌ ఆయనను ఫిదా చేసింది.బ్యూటీ విత్‌ బ్రెయిన్‌! మురిసిపోయాడు. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. నాలుగు రోజులకు గానీ రెస్పాన్స్‌ రాలేదు ఆనంద నుంచి... యాక్సెప్ట్‌ చేస్తూ! ముందు హలో.. హాయ్‌ అంటూ పలకరింపు పర్వం. అతి కొద్ది రోజుల్లోనే వీళ్ల ప్రేమతో ఇన్‌బాక్స్‌ సిగ్గు పడడం మొదలెట్టింది. శ్రీరాం ఓ యాడ్‌ ఏజెన్సీలో క్రియేటివ్‌ హెడ్‌. ఆనంద ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌. మంచి క్లాసికల్‌ డాన్సర్‌. ఆయన సోషల్‌ సర్వీస్‌లో మేటి. ఆయన స్లమ్స్‌లో సర్వీస్‌ ఇచ్చే చోట ఆ పిల్లలకు స్వచ్ఛందంగా డాన్స్‌ నేర్పించడం స్టార్ట్‌ చేసింది. దాంతో శ్రీరామ్‌కి ఆనంద మీద మరింత ప్రేమ పెరిగింది. గౌరవమూ ఇనుమడించింది. తను జీవిత భాగస్వామిగా వస్తే బాగుంటుందని ఆశపడ్డాడు. ఆ ఆశను ఆమె ముందు ఎక్స్‌ప్రెస్‌ చేశాడు. శ్రీరామ్‌ తనకన్నా మూడేళ్లు చిన్నవాడు. ఆ సంశయాన్నే వెలిబుచ్చింది ఆనంద. అదసలు మ్యాటరే కాదన్నాడు. రెండు రోజులు ఆలోచించుకునే టైమ్‌ అడిగింది. మూడో రోజు ‘ఎస్‌’ అని చెప్పింది.

పెళ్లిచూపులకు ఏర్పాట్లు
శ్రీరామ్‌ ఆనందానికి అవధుల్లేవ్‌ ఆరోజు. ఆనందను తలచుకొని గర్వంగా ఫీలయ్యాడు. ఇద్దరి ఆలోచనలూ ఒకటే. ఆలోచనలు సరే... అలవాట్లూ ఒకటే! ఆ విషయంలో చాలాసార్లు ఆశ్చర్యపోయేవాడు శ్రీరామ్‌. మొత్తానికి తనతో పెళ్లికి ఆనంద ఒప్పేసుకుంది. ఆనందకు అమ్మానాన్న లేరు. తాతే ఆమెను పెంచాడు. ఆయన ఆమెకు ఓ స్నేహితుడు. అన్నీ షేర్‌ చేసుకుంటుంది. శ్రీరామ్‌ విషయమూ చెప్పింది. చూస్తాను అన్నాడు. ఇంటికి తీసుకెళ్లింది. పిల్లాడు నచ్చాడు పెద్దాయనకు. ఆయన తల్లిదండ్రులకు విషయం చెప్పి వారిని ఇంటికి తీసుకురమ్మన్నాడు. శ్రీరామ్‌ ఉండేది ముంబైలో. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటారు. కిందటి వారం హైదరాబాద్‌ వెళ్లినప్పడు చెప్పాడు. వివరాలు అన్నీ విని.. ‘వీలు చూసుకొని  వస్తాం’ అన్నారు. తర్వాత అతడి పేరెంట్స్‌ దగ్గర్నుంచి ఫోన్‌ వచ్చింది వస్తున్నట్టుగా. వెంటనే ఆనందకు చెప్పాడు.జ్ఞాపకాల్లోంచి వాస్తవంలోకి వచ్చింది ఆనంద. శ్రీరామ్‌ చెప్పిన శుభవార్తను తాతయ్యకు అందించింది. శ్రీరామ్‌ కుటుంబాన్ని రిసీవ్‌ చేసుకునే ఏర్పాట్లలో పడిపోయారు తాతా మనవరాలు ఆ క్షణం నుంచే...!

ఊహించని పరిణామం
శ్రీరామ్‌ చెప్పిన ఎల్లుండి రానేవచ్చింది. ఇల్లంతా నీట్‌గా సర్దింది. సర్దినవాటిని వందసార్లు సరిచూసుకుంది. మనవరాలి ఆరాటం చూసి తాతయ్య ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. ఈలోపు కాలింగ్‌ బెల్‌ మోగనే మోగింది. ఆత్రంగా వెళ్లి తలుపు తీసింది ఆనంద. ఎదురుగా చిలిపిగా నవ్వుతూ శ్రీరామ్‌... అతని వెనకాలే మొహాల మీద చిరునవ్వులతో ఆయన తల్లిదండ్రులు ‘రండి రండి...’ అంటూ అంతే ఆత్రంగా లోనికి ఆహ్వానించింది. హాల్లో సోఫా చూపిస్తూ కూర్చోండి అంది. ఆనంద తాతయ్య వచ్చి త్రీ సీటర్‌ సోఫాకు ఎదురుగా ఉన్న సింగిల్‌ సీటర్‌లో కూర్చున్నాడు. అక్కడే నిలబడ్డ ఆనందను చూస్తూ వాళ్లకు కాస్త మంచినీళ్లు తెచ్చివ్వమ్మా అంటూ మనవరాలిని పురమాయించాడు. వచ్చిన వాళ్లను పరిచయం చేసుకుందామని ఇటు తిరిగాడు. శ్రీరామ్‌ తల్లిని చూడగానే ఒక్కక్షణం ఆగిపోయాడు ఎందుకో ఆ పెద్దాయన! ఆయనను చూసిన శ్రీరామ్‌ తల్లిలో కూడా ఇంచుమించు అదే భావం. అమ్మా... నువ్వు శోభ కదూ... అన్నాడు అనుమానం నివృత్తి చేసుకుందామని. అర్థమైపోయింది... శోభకు విషయం మొత్తం అర్థమైపోయింది. మామయ్యా... మీరు... ఆనంద... అంటూ ఆగిపోయింది. కాళ్లు చేతులు చల్లబడ్డాయి. మెదడు మొద్దు బారిపోయింది. అడుగు ముందుకు పడడం లేదు. పాలిపోయిన మొహంతో కొడుకును, భర్తను చూసింది. శ్రీరామ్‌ తల్లి వైపు, తండ్రి వైపు అయోమయంగా చూశాడు. భార్య స్థితి అర్థమైన శ్రీరామ్‌ తండ్రి... కొడుకును బయటకు తీసుకెళ్లాడు.

నాటి కూతురే.. నేటి కోడలు!
‘‘శ్రీరామ్‌... నాతో పెళ్లికి ముందే మీ అమ్మకు పెళ్లయింది. ఓ కూతురు కూడా. ట్రైన్‌ యాక్సిడెంట్‌లో అతను చనిపోయాడు. అప్పటికి వాళ్లకు యేడాదిన్నర బిడ్డ. ఆ షాక్‌తో మీ అమ్మ సైకలాజికల్‌గా ఎఫెక్ట్‌ అయింది. దాదాపు ఆర్నెల్లు పిచ్చిదానిలాగే ఉంది. ఇక్కడ ఉంచితే లాభంలేదు ఎప్పటికీ కోలుకోదని వాళ్ల మేనమామ అమెరికా తీసుకెళ్లాడు. ఆ బిడ్డను శోభ వాళ్ల అత్తగారు, మామగారే ఉంచేసుకున్నారు. మీ అమ్మమ్మ వాళ్లు అడిగినా ఇవ్వలేదు. కొడుకు జ్ఞాపకంగా ఉంటుందని తమ దగ్గరే పెట్టుకున్నారు. శోభ యూఎస్‌లోనే ఉండిపోయింది. నయం అయ్యాక కూతురి కోసం చాలానే తాపత్రయ పడింది. కాని పెద్దవాళ్లు సర్ది చెప్పి అక్కడే యూఎస్‌లో వాళ్ల మేనమామ ద్వారా ఉద్యోగం ఇప్పించారు. ఆ కంపెనీలోనే నేనూ జాబ్‌ చేసేవాడిని. అలా ఇద్దరం లవ్‌ లో పడ్డాం. పెళ్లి ప్రస్తావన తెచ్చాను. అప్పుడు చెప్పింది మీ అమ్మ.. తనకు అంతకు ముందే పెళ్లయిన విషయం, ఓ కూతురూ ఉన్న సంగతి. అయినా నాకేం అభ్యంతరం లేదన్నాను. పెళ్లి చేసుకున్నాను. తర్వాత నేను, మీ అమ్మ ఇద్దరం కలిసి ఆ అమ్మాయిని తెచ్చేసుకోవాలని చాలా ప్రయత్నించాం. ఆ పాప నానమ్మ, తాతయ్యను కలిశాం. వాళ్లు ససేమీరా అన్నారు. చేసేదేం లేక అమెరికా తిరిగి వెళ్లిపోయాం. యేడాదికి నువ్వు పుట్టావ్‌. లైఫ్‌ బిజీలో పడిపోయాం. అదిరా వివరం. అందుకే ఈ పెళ్లి కుదరదు’’ అని చెప్పాడు శ్రీరాం తండ్రి. హతాశుడయ్యాడు శ్రీరాం. ఉన్న చోటనే కూలబడిపోయాడు.

చట్టం ఏం చెబుతోందంటే...
హిందూవివాహ చట్టం 1955, సెక్షన్‌ 5 పెళ్లికి కొన్ని షరతులు విధిస్తోంది. పెళ్లి సమయానికి వధూవరుల్లో ఎవరికైనా అంతకుముందే పెళ్లయి ఉండి, ఆ భాగస్వామి బతికున్నా, విడాకులు ఇవ్వకపోయినా ఆ పెళ్లి చెల్లదు. ఆచార వ్యవహారాలు అనుమతించినప్పడు తప్ప నిషేధించిన బంధుత్వం ఉండకూడదు, సపిండులు కాకూడదు. పై షరతులకు విరుద్ధంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు. వీటినే వాయిడ్‌ మ్యారేజెస్‌ అంటారు. సెక్షన్‌ 11 ప్రకారం ఇలాంటి పెళ్లిళ్లను రద్దు చేయొచ్చు. వేరువేరు తండ్రుల ద్వారా ఒకే తల్లికి పుట్టిన పిల్లల సంబంధాన్ని ఏకోదర రక్తసంబంధం అంటారు. పైన కేస్‌లోని శ్రీరామ్, ఆనందల బంధం దీని కిందికే వస్తుంది. కాబట్టి ఆ పెళ్లి చెల్లదు. సంపూర్ణ రక్త సంబంధం అంటే... ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మధ్య, అసంపూర్ణ రక్త సంబంధం... అంటే ఒకే భర్తకు వేరువేరు మహిళల ద్వారా పుట్టిన పిల్లల మధ్య, ఏకోదర రక్తసంబంధం ఉన్న పిల్లల మధ్య వివాహాలు నిషిద్ధం.
– ఇ. పార్వతి,అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్‌
parvathiadvocate2015@ gmail.com

– సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement