వెలుగు పూల పండుగ
చీకటిపై వెలుతురు విజయం సాధించినందుకు, చెడుపై మంచి పోరు సాగించి గెలిచినందుకు గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. లోకాన్నంతటినీ పట్టి పీడిస్తున్న నరకాసురుడనే దుష్ట దానవుని అంతమొందించిన వెలుగుల పండుగ దీపావళి.
పురాణాల్లో... పండుగ కథలెన్నో!
లోకాన్ని పీడించిన నరకాసురుడి పీడ విరగడైనందుకు గుర్తుగా ఈ పండుగ చేసుకుంటున్నామనేది ప్రాచుర్యంలో ఉన్న విషయం. ఇదే కాకుండా ఇంకా చాలా పురాణ కథలు దీపావళికి సంబంధించినవి ఉన్నాయి. రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగా, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగా, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగా - ఇలా దీపావళికి అనేక పురాణ కథలు.
ఇంటింటా... దీపలక్ష్మి
లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. ఆయన అన్నిరకాలైన చీకట్లనూ... అంటే... అవిద్యను, అజ్ఞానాన్ని, అవివేకాన్ని పారదోలగల సమర్థుడు. జ్ఞానప్రదాత. దీపం వల్లనే సమస్త కార్యాలూ సాధ్యమవుతాయి. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు.
నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, పుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకరవస్తువుల్లో, వేదఘోష వినిపించేప్రదేశాలల్లో, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుడినీ, తులసినీ పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్త్తి.
దివిటీలు కొట్టాలి! మానవతకు దివిటీ పట్టాలి!!
సమాజానికి దుష్టుని పీడ వదిలిందన్న ఆనందోత్సాహాలతో దీపావళినాడు బాణాసంచా కాల్చడం ఆనవాయితీ. టపాసులు కాల్చే ముందు పిల్లలు గోగుపుల్లలకు నూనెతో తడిపిన వస్త్రాన్ని చుట్టి, దాన్ని కాలుస్తూ ‘దుబ్బూ దుబ్బూ దీపావళీ... మళ్లీ వచ్చే నాగులచవితి’ అని దివిటీలు కొట్టడం ఆనవాయితీ. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో పేదవారికి దానం చేయడం, సాటివారికి సాయపడే బాధ్యత పురుషులది.
పూజా సంప్రదాయం ఇదీ...
దీపావళి రోజు సాయంకాలం నువ్వులనూనె, లేదంటే ఆవు నేతిని మట్టి ప్రమిదలలో నింపి, దీపాలు వెలిగించాలి. దారిద్య్రబాధలు తొలగి, ధనలాభం పొందడానికి ఆశ్వయుజ అమావాస్య నాడు తప్పక లక్ష్మీపూజ చేయాలి. అలా ఈ దీపావళి అందరి ఇంటా కొత్తకాంతి తేవాలని కోరుకుందాం.
- డి.వి.ఆర్. భాస్కర్