దీపావళి అంటే దీపాల పండుగే కాదు, ఇళ్లువాకిళ్లను శుభ్రం చేసి, ఇంటిని చక్కగా సర్దుకోవడం కూడా. ఇంటిని సర్దే క్రమంలో అందంగా అలంకరించుకోవడం కూడా ఈ పండగ సమయంలో చేసే ముఖ్యమైన పని. ఎంత అనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇంటిని డెకరేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఏం పర్లేదు.. చిన్నచిన్న ఐడియాలు, చిట్కాలతో మీ ఇంటిని క్షణాల్లో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి.
►గాజు, రాగి, ఇత్తడి వెడల్పాటి పాత్రలో నీళ్లుపోసి తాజాపువ్వులతో నింపేయాలి. పూలమధ్యలో దీపాలను వెలిగించాలి. ఈ పాత్రను గుమ్మానికి ఎదురుగా, డోర్ పక్కన పెడితే చాలా అందంగా ఉంటుంది.
► ఇంటి గుమ్మం పెద్దగా ఉన్నట్లయితే సంప్రదాయబద్ధంగా అలంకరించాలి. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులను పూలతో అలకరించి మధ్యలో దీపాలు పెట్టాలి. ఈ రంగవల్లుల పైన వేలాడే ల్యాంప్స్‌ను వెలిగిస్తే ఇంటి గుమ్మం కళకళలాడిపోతుంది.
► వివిధ రంగులతో మెరిసిపోయే చీరలు చున్నీలను గ్లాస్ విండో, డోర్‌లకు కర్టెన్స్‌లా పెట్టాలి. ఈ చీరలపైన సన్నని లైటింగ్ దండలను వేలాడదీయాలి. గది మధ్యలో సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిస్తే ఇల్లు మరింత కాంతిమంతంగా మారుతుంది.
► గుమ్మం ముందు, హాల్లో వేసే ముగ్గుని రెండు మూడు రకాల పువ్వులతో వేయాలి. ఈ ముగ్గు మధ్యలో మట్టిప్రమిదలు, సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ పెట్టి వెలిగించాలి.
► ఇంటిముందు పెద్దగా స్థలం లేనప్పుడు డోర్ పక్కనే ఉన్న గోడ మూలనుంచి దీపాలు పెట్టాలి. వీటిచుట్టూ పూలతో ఆలంకరించాలి. ఇవి ఇంటిని మరింత అందంగా చూపిస్తాయి.
► మార్కెట్లో దొరికే వివిధ రకాల వేలాడే దీపాలను వెలిగిస్తే చీకట్లో సైతం ఇల్లు కాంతులీని, పండుగ వాతావరణం కనిపిస్తుంది.
► గోడలకు వేలాడదీసే రంగురంగుల డెకరేషన్ వస్తువులు మార్కెట్లో చాలా కనిపిస్తాయి. కలర్‌ఫుల్ పూసలు, దారాలు, రంగురంగుల మెరిసే క్లాత్‌తో చేసిన, గంటలతో వచ్చే అలంకరణ వస్తువులను గోడకు వేలాడదీసి, కింద మట్టి దీపాలతో అలంకరిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది.
► వీటిలో ఏదీ చేసే సమయం లేకపోతే మార్కెట్‌లో దొరికే చెక్క, యాక్రాలిక్ ల్యాంప్స్ కొనుక్కోని... కిటికీలు, గ్యాలరీలోవేలాడదీస్తే మీ ఇంటి దీపావళికి కళ వస్తుంది. ఇంకెందుకాలస్యం మీ ఇంటికి నప్పే విధంగా సింపుల్ డెకరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టండి.
Comments
Please login to add a commentAdd a comment