Decoration items
-
దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి ఇలా..
దీపావళి అంటే దీపాల పండుగే కాదు, ఇళ్లువాకిళ్లను శుభ్రం చేసి, ఇంటిని చక్కగా సర్దుకోవడం కూడా. ఇంటిని సర్దే క్రమంలో అందంగా అలంకరించుకోవడం కూడా ఈ పండగ సమయంలో చేసే ముఖ్యమైన పని. ఎంత అనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇంటిని డెకరేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఏం పర్లేదు.. చిన్నచిన్న ఐడియాలు, చిట్కాలతో మీ ఇంటిని క్షణాల్లో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి. ►గాజు, రాగి, ఇత్తడి వెడల్పాటి పాత్రలో నీళ్లుపోసి తాజాపువ్వులతో నింపేయాలి. పూలమధ్యలో దీపాలను వెలిగించాలి. ఈ పాత్రను గుమ్మానికి ఎదురుగా, డోర్ పక్కన పెడితే చాలా అందంగా ఉంటుంది. ► ఇంటి గుమ్మం పెద్దగా ఉన్నట్లయితే సంప్రదాయబద్ధంగా అలంకరించాలి. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులను పూలతో అలకరించి మధ్యలో దీపాలు పెట్టాలి. ఈ రంగవల్లుల పైన వేలాడే ల్యాంప్స్‌ను వెలిగిస్తే ఇంటి గుమ్మం కళకళలాడిపోతుంది. ► వివిధ రంగులతో మెరిసిపోయే చీరలు చున్నీలను గ్లాస్ విండో, డోర్లకు కర్టెన్స్లా పెట్టాలి. ఈ చీరలపైన సన్నని లైటింగ్ దండలను వేలాడదీయాలి. గది మధ్యలో సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిస్తే ఇల్లు మరింత కాంతిమంతంగా మారుతుంది. ► గుమ్మం ముందు, హాల్లో వేసే ముగ్గుని రెండు మూడు రకాల పువ్వులతో వేయాలి. ఈ ముగ్గు మధ్యలో మట్టిప్రమిదలు, సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ పెట్టి వెలిగించాలి. ► ఇంటిముందు పెద్దగా స్థలం లేనప్పుడు డోర్ పక్కనే ఉన్న గోడ మూలనుంచి దీపాలు పెట్టాలి. వీటిచుట్టూ పూలతో ఆలంకరించాలి. ఇవి ఇంటిని మరింత అందంగా చూపిస్తాయి. ► మార్కెట్లో దొరికే వివిధ రకాల వేలాడే దీపాలను వెలిగిస్తే చీకట్లో సైతం ఇల్లు కాంతులీని, పండుగ వాతావరణం కనిపిస్తుంది. ► గోడలకు వేలాడదీసే రంగురంగుల డెకరేషన్ వస్తువులు మార్కెట్లో చాలా కనిపిస్తాయి. కలర్‌ఫుల్ పూసలు, దారాలు, రంగురంగుల మెరిసే క్లాత్‌తో చేసిన, గంటలతో వచ్చే అలంకరణ వస్తువులను గోడకు వేలాడదీసి, కింద మట్టి దీపాలతో అలంకరిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది. ► వీటిలో ఏదీ చేసే సమయం లేకపోతే మార్కెట్లో దొరికే చెక్క, యాక్రాలిక్ ల్యాంప్స్ కొనుక్కోని... కిటికీలు, గ్యాలరీలోవేలాడదీస్తే మీ ఇంటి దీపావళికి కళ వస్తుంది. ఇంకెందుకాలస్యం మీ ఇంటికి నప్పే విధంగా సింపుల్ డెకరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టండి. -
Iraq wedding fire: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం
మోసల్ (ఇరాక్): ఇరాక్‌లోని ఒక పెళ్లి వేడుకల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది. అతిథులతో కిక్కిరిసిపోయిన హాలులో వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి 114 మంది మరణించారు. మరో 150 మంది వరకు గాయపడ్డారు. ఆస్పత్రితో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇరాక్‌లోని నినెవెహ్ ప్రావిన్స్ ఖరఖోష్ పట్టణంలో పెళ్లి వేడుకలో హాలులో బాణాసంచా కాల్చడంతో ఒక్కసారి డెకరేషన్‌కు మంటలు అంటుకొని వ్యాపించాయి. ఆ హాలు నిర్మాణంలో ఉపయోగించిన సామాగ్రి, పెళ్లి కోసం చేసిన డెకరేషన్ కూడా మండించే స్వభావాన్ని కలిగి ఉండడంతో అగ్ని కీలలు త్వరితగతిన విస్తరించాయి. కళ్ల ముందే షాండ్లియర్లు, సీలింగ్ నుంచి పెచ్చులు కింద పడడంతో పెళ్లికి హాజరైన అతిథులు అటూ ఇటూ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో వధూవరులు తీవ్రంగా గాయపడినా వారి ప్రాణాలకు ప్రమాదం లేదని స్థానిక మీడియా వెల్లడించింది. పెళ్లి వేడుకలు అంబరాన్నంటుతున్న సమయంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న అతిథులు ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో హాహాకారాలు చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పెళ్లి వేడుకలు జరిగే మండపం అంతా ప్లాస్టిక్‌తో డెకరేషన్ చేశారు. వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా హాలులోనే బాణాసంచా కాల్చారు. అవి నేరుగా రూఫ్‌కి తాకాయి. సీలింగ్‌కి మంటలు అంటుకోవడంతో అవి విస్తృతంగా వ్యాపించాయి. ఆ ఫంక్షన్ హాలుని శాండ్విచ్ ప్యానెల్స్, వినిల్ షీట్స్, ఫ్యాబ్రిక్‌తో నిర్మించడంతో మంటలు ఎగిసెగిసి పడ్డాయి. దీంతో పై నుంచి డెకరేషన్ సామాగ్రి కింద పడి ఎవరూ కదలడానికి వీల్లేకుండా పోయింది. అతిథుల సంఖ్య భారీ స్థాయిలో 1,000 నుంచి 1100 మంది ఉండడంతో అటూ ఇటూ వెళ్లాడానికి దారి లేక అందరూ అక్కడే చిక్కుకుపోయి మంటలకి ఆహుతైపోయారు. -
ఆనందాన్ని నింపే బబుల్స్
గడప ముందు వేసే డోర్ మ్యాట్ నుంచి టేబుల్ మ్యాట్స్ వరకు.. రూఫ్‌కి వేలాడే షాండ్లియర్ నుంచి క్యాండిల్ వరకు.. ఫ్లవర్ వేజ్ నుంచి సోప్కేస్ వరకు .. ఇంట్లోని అలంకరణ వస్తువులన్నీ బబుల్స్‌లా ఒకదానితో ఒకటి జత కలిసినట్టుగా కొత్తందాన్ని సంతరించుకుంటున్నాయి! చిన్నపిల్లలు సబ్బు ద్రావకాన్ని బుడగలుగా ఊదుతూ ఆనందాన్ని పొందే విధానం చూడటానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఆ రంగురంగుల బుడగలు గాలిలోకి ఎగిరినప్పుడు వెలువడి కాంతి ఎప్పుడూ కళ్ల ముందు కదలాడుతూ ఉంటే... ఆ ఆలోచనే హోమ్ డెకార్ నిపుణులను మరింతగా ఆకర్షించి ఉంటుంది. అందుకే, ఇప్పుడు ఇంటి అలంకరణలో ‘బబుల్’ ప్రధాన ఆకర్షణ అయ్యింది. బుడగల్లో ఇంద్రధనస్సు రంగులను ఇంటి గోడలపైనే కాదు, ఇతర అలంకరణ వస్తువుల్లోనూ చూపుతున్నారు హోమ్ డెకార్లు. కాంతులు వెదజల్లే బబుల్స్ పువ్వుల అమరికకే కాదు మంచినీళ్ల బాటిళ్లూ బబుల్ షేప్‌తో అలరిస్తున్నాయి. పూల కుండీలు, పెన్ హోల్డర్లు, ఇతర టేబుల్ అలంకరణ గ్లాస్ వస్తువులన్నీ బుడగల షేప్‌తో ఆకర్షిస్తున్నాయి. గాజు బుడగల వస్తువుల మీదుగా పడే కాంతి కూడా గది అందాన్ని పెంచడంతో అవీ ప్రధాన అలంకరణ జాబితాలోకి చేరిపోతున్నాయి. కాదేదీ అనర్హం టేబుల్ టాప్స్, ల్యాంప్ స్టాండ్స్, షెల్ఫ్స్... కాదేదీ అనర్హం అన్నట్టు సిరామిక్తోనూ, ప్లాస్టిక్‌తోనూ బబుల్ షేప్ వస్తువులు ముచ్చటగా ఆకట్టుకుంటున్నాయి. గోడకు అలంకరించే వాల్‌పేపర్స్ లేదా పెయింటింగ్స్‌లో కూడా బబుల్ షేప్ మరింత ఆహ్లాదంగా మారిపోయింది. పిల్లల గదులనే కాదు మెట్ల మార్గంలోనూ బబుల్ అలంకరణ చూపులను ఇట్టే కట్టిపడేస్తుంది. కలిసి జతకట్టు వేసవి వేడి తీవ్రతను తట్టుకునేందుకు ధరించే దుస్తులే కాదు ఇంటి వాతావరణమూ ఆహ్లాదంగా ఉండాలి. అందుకు లేత రంగుల బబుల్ డిజైన్స్ మనసుకు హాయినిచ్చే అలంకరణ అవుతుంది. ‘అంతే కాదు, ఒకదానితో ఒకటి కలిసికట్టుగా ఉండే బబుల్స్ కుటుంబ సభ్యుల మధ్య మమతానుబంధాన్ని బలం చేస్తాయి’ అంటున్నారు డెకార్ నిపుణులు. అందుకే, ఇంటి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా ఈ సీజన్‌ని మరింత ఆహ్లాదంగా మార్చేస్తున్నాయి బబుల్స్. -
బుర్రలో కొత్త ఐడియా!
కడవంత గుమ్మడి కాయ అయినా కత్తి పీటకు లోకువే... అని సామెత. గుమ్మడికాయ, సొరకాయ, బీరకాయ వంటి తీగజాతి కాయలు మనకు ఎన్నో పండుతాయి. లేతగా ఉన్నప్పుడే చెట్టు నుంచి కోసి, తరిగి పులుసులో వేసేస్తాం. చక్కగా భోంచేసి ఆ కాయ జీవితానికి ధన్యత్వాన్ని ప్రసాదించినట్లు పోజ్ కొడతాం. పొరపాటున ఏ కాయ అయినా ముదిరిపోతే అది ఎందుకూ పనికిరానిదయిపోతుంది. ఎవరికీ కొరగానిదయిపోతుంది. సొరకాయ కూడా అంతే కానీ, క్రియేటివిటీ ఉన్న వాళ్ల కళ్లలో పడితే మాత్రం.. ముదిరిన కాయ కూడా ఇదిగో ఇలా ఎల్లకాలం ఇంట్లో ఒక డెకరేషన్ ఐటమ్‌గా ఉండిపోతుంది. మన పూర్వికులు తమ బుర్రను ఉపయోగించి సొరకాయ బుర్రతో వీణ మీటారు, పొలం పోయే రైతులు మంచినీటి సీసాగా మలిచారు. ఆదివాసులైతే ధాన్యాన్ని దాచుకునేది పెద్ద సొరకాయ బుర్రల్లోనే. ఆధునిక ప్రపంచం.. పింగాణి గుమ్మడికాయలో గుమ్మడికాయ సాంబారు వడ్డిస్తోంది, పింగాణి పనసకాయ, దోసకాయల్లో పులుసు, పెరుగు వడ్డించి భుజాలు చరుచుకుంటోంది. కానీ... ఎవరెన్ని విన్యాసాలు పోయినా బస్తర్ ఆదివాసుల దగ్గర ఈ ఒరిజినల్ కళ ఇంకా బతికే ఉంది. కాయను చెట్టునే ఎండనిచ్చి గింజలు తీసి బుర్రను శుభ్రం చేసి ఉపయోగిస్తారు. మైసూర్‌కు చెందిన సీమా ప్రసాద్ సరిగ్గా ఇదే ఫార్ములాను పట్టుకున్నారు. అయితే ఆమెను ప్రభావితం చేసింది ఆఫ్రికా ఆదివాసులు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం సీమా ప్రసాద్ భర్త కృష్ణప్రసాద్ వ్యాపారరీత్యా కెన్యా, టాంజానియాలకు వెళ్లేవారు. అక్కడ వాటిని చూసిన సీమకు ఇండియాలో సొంతూరు గుర్తుకు వచ్చింది. పొలాల్లో తీగలకు ఎన్నెన్ని సొరకాయలు, వండినవి వండుకోగా మిగిలినవి ఎండి నేలపాలు కావడమే. వాటికి మార్కెట్ పెద్దగా ఉండదు కాబట్టి కాపు ఎంత విరివిగా ఉన్నా సరే సొరకాయను సాగుచేసే వాళ్లుండరు. సొరకాయలతో ఇంత చక్కని కళాకృతులను చేయవచ్చని తన ఊరి వాళ్లకు నేర్పిస్తే... సొరకాయలను పండించడానికి రైతులు కూడా ముందుకు వస్తారు. పెట్టుబడి తక్కువ, లాభాలకు మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. రెండు రకాల ప్రయోజనాలున్నప్పుడు ఓ ముందడుగు తానే ఎందుకు వేయకూడదు.. అనుకుంది సీమ. అలా పుట్టిందే ‘సీమసమృద్ధ’ సీమ బుర్రలో ఆలోచన తట్టినంత వేగంగానే సొంతూరులో అచరణలోకి వచ్చింది. ఇరుగుపొరుగు రైతు మహిళలనూ ఆమె కలుపుకుంది. ‘సీమ సమృద్ధ’ పేరుతో ఎన్జివో స్థాపించింది. మన సంప్రదాయ వంగడాలను సేకరించి పరిరక్షించే బాధ్యత తీసుకుంది. ఇండియాలో దొరికే దేశీయ సొరకాయ, గుమ్మడి వంటి తీగ పాదులతోపాటు ఆఫ్రికా నుంచి మన దగ్గర కనిపించని కొత్త రకం కాయల గింజలను సేకరించింది. పండించడం వరకు సరే, ఆ తర్వాత ఆ కాయలను కళాకృతులుగా మార్చడం ఎలా? అందుకోసం నిపుణులను మైసూరుకు పిలిపించింది. ఆసక్తి ఉన్న మహిళలకు ట్రైనింగ్ ఇప్పించింది, తానూ నేర్చుకుంది. కాయ ఆకారం పాడవకుండా గుజ్జు, గింజలు తీసి శుభ్రం చేయడంతోపాటు డిజైన్‌కి అనుగుణంగా రంగులు వేయడం కూడా నేర్చుకున్నారు. సీమ ఆఫ్రికాలో చూసిన, మన దగ్గర లేని డిజైన్లను నేర్చుకోవడానికి మరోసారి ఆఫ్రికాకు వెళ్లింది. అరచేతులకు మెహిందీ డిజైన్ పెట్టుకున్నట్లు సొరకాయ బుర్రల మీద డిజైన్ గీసి, ఆ డిజైన్‌కి అనుగుణంగా రంధ్రాలు చేయడం, రంగు వేయడం నేర్చుకుంది. అలా అందంగా రూపుదిద్దుకున్న ల్యాంప్ షేడ్లకు ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ లేని గిరాకీ. కాయ కూడా గిట్టుబాటే! తినడానికి మార్కెట్‌కొచ్చే సొరకాయ ధర కిలో పది నుంచి పన్నెండు రూపాయలుంటే, కళాకృతుల కోసం పెంచే కాయలకు వంద రూపాయల వరకు పలుకుతోంది. అయితే ఇక్కడ కొద్దిగా మెలకువలు పాటించాల్సి ఉంటుంది. తినడానికి సొరకాయ ఏ రూపంలో ఉన్నా పట్టింపు ఉండదు. వీటికి ఆకారం తీరుగా ఉండాలి. అందుకే పిందెగా ఉన్నప్పుడే ఆ తీగను ఎత్తు పందిరికి అల్లించి కాయ నిటారుగా కిందకు దిగేటట్లు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వాటికి ఆ ధర పలుకుతుంది. సీమ చేతిలో పడిన సొరకాయ ఇప్పుడు వాల్ హ్యాంగింగ్ అవుతోంది, కొండపల్లి బొమ్మలను పోలిన బొమ్మగానూ రూపాంతరం చెందుతోంది. ఈ ‘ట్యూమా క్రాఫ్ట్’కి మంచి డిమాండ్ ఉంది. – మను -
సీతాకోక పూలు
ఇంటికి - ఒంటికి ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున... లిప్‌స్టిక్ పెదాలకే ఎందుకు వేసుకోవాలి అని అడుగుతాడు. పెదాలకి మాత్రమే వేసుకోవాలని చివరకు డిసైడ్ చేస్తాడు. మరి నెయిల్ పాలిష్ కూడా అంతేనా గోళ్లకు మాత్రమే వేసుకోవాలా? అది కేవలం అందుకే పనికొస్తుందా? లేదు. నెయిల్ పాలిష్ గోళ్లకు మాత్రమే కాదు... మన ఇంటికి కూడా అందాన్ని తెస్తుంది. ఎలా అంటారా... ఒక్కసారి పక్కనున్న ఫొటోలపై ఓ లుక్కేయండి. అవన్నీ నెయిల్ పాలిష్‌తో చేసినవే. ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ నుంచి ఒంటికి పెట్టుకునే ఫ్యాషన్ జ్యూయెలరీ వరకు అన్నింటికీ నెయిల్ పాలిష్ హంగును అద్దారు. కావాలంటే ఇవన్నీ మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే... కావలసినవి: సులువుగా వంకులు తిరిగే సన్నని వైరు, రంగు రంగుల నెయిల్ పాలిష్‌లు (కొంచెం చిక్కబడినవి. అలాంటివి లేక పోతే నెయిల్ పాలిష్ సీసా మూత తీసి గాలి తగిలేలా పెడితే చిక్క బడుతుంది), క్విక్ డ్రై నెయిల్ పాలిష్ స్ప్రే (మార్కెట్లో దొరుకుతుంది; లేకున్నా ఫర్వాలేదు), కత్తెర, పెన్ లేదా సన్నని రాడ్, పట్టకారు తయారీ విధానం: ముందుగా తీగను పెన్ లేదా రాడ్‌కు చుట్టాలి. అది ఒక పూరేకులాగా అవుతుంది. పెన్/రాడ్‌ను రింగ్ లోంచి బయటికి తీసేసి, ఆ రేకుకు పక్కనే మరో రేకులా చేయాలి. ఇలా తీగను తిప్పుకుంటూ పక్కపక్కనే అయిదు రేకులు వచ్చేలా చేసు కుని, దాన్ని పువ్వు ఆకారంలోకి తీసుకురావాలి. తర్వాత నెయిల్ పాలిష్‌ను తీగల మీద పూసుకుంటూ పోవాలి. మొదట పలుచగా ఉన్నా కాసేపటికి దళసరి అవుతుంది. అప్పుడు దానిపై డ్రై నెయిల్ పాలిష్ స్ప్రే చల్లాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత, మళ్లీ రెండో కోటింగ్ వేస్తే రంగు బాగా కనిపిస్తుంది. ఇలా రంగురంగుల పూలు చేసు కుని వాటితో నెక్లెస్‌లు, బ్రేస్లెట్లు, ఉంగరాలు, హెయిర్ క్లిప్పులు చేసుకో వచ్చు. పూలగుత్తులు చేసుకుని ఫ్లవర్‌వాజుల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడిదో ఫ్యాషన్. మీరూ దీన్ని అనుసరించి చూడండి!